Andhra PradeshPoliticsPolitics & GovernancePopular NewsRecent NewsTelanganaTrending News

స‌రిహ‌ద్దు గ్రామాల్లో స‌ర్ కు స‌వాళ్లు!

INTRODUCTION

ఇదొక విచిత్రమైన పరిస్థితి. సాధారణంగా ఏ ఊరైనా…గ్రామమైనా ఒక జిల్లా, ఒక రాష్ట్రం పరిధిలోనే ఉంటుంది. అక్కడ ఆ రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలే ఉంటాయి. ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులే ఉంటారు. సంక్షేమ పథకాలు కూడా ఆ ప్రభుత్వానివే వర్తిస్తాయి. కానీ కొన్ని గ్రామాలు రెండు రాష్ట్రాల పరిధిలో ఉన్నాయి. రెండు ప్రభుత్వాలకు సంబంధించిన కార్యాలయాలు, విద్యా సంస్థలు ఆ ఊళ్లలో ఉన్నాయి. అలాగే అధికారులు కూడా. అక్కడి ప్రజలు రెండు రాష్ట్రాల సంక్షేమ పథకాలను పొందుతుంటారు. విచిత్రమేమంటే ఆ రెండు రాష్ట్రాల ఓటర్ల జాబితాల్లోనూ ఆయా గ్రామా ప్రజలు ఉంటారు. అంటే ఒక్కరికి రెండు ఓట్లు అధికారికంగా ఉంటాయన్న మాట. రెండు చోట్లా వారు ప్రజా ప్రతినిధులను ఎన్నుకుంటారు. సుమారు 6,000 మంది జనాభా ఉన్న ఈ 14 గ్రామాల్లో దాదాపు 3,500 మంది ఓటర్లు దశాబ్దాలుగా తెలంగాణ (గతంలో ఆంధ్రప్రదేశ్), మహారాష్ట్ర రాష్ట్రాల ఎన్నికల్లో ఓటు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక్కరికి ఒకటే ఓటు ఉండాలన్న లక్ష్యంతో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ( సర్ ) కార్యక్రమానికి ఆయా గ్రామాల్లో సవాళ్లు ఎదురవుతున్నాయి. ఈ పరిస్థితిపై ప్రత్యేక కథనం ఇది.

ANALYSYS

ఈ  వివాద స‌రిహ‌ద్దు గ్రామాలు సుమారు 80 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉన్నాయి. తెలంగాణలోని కెరమెరి ప్రాంతం, మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా జివతి తాలూకా పరిధులతో వీటికి సంబంధం ఉంది. పరందోలి, ముకద్దంగూడ, అంతాపూర్, బోలాపటార్ అనే నాలుగు గ్రామ పంచాయతీల పరిధిలో ఈ నివాస ప్రాంతాలు ఉన్నాయి.  ఈ 14 గ్రామాల్లో సర్ ప్రక్రియకు ప్రతిష్ఠంభన ఏర్పడుతోంది. ఎలా ముందుకు వెళ్లాలో తెలియక రెండు రాష్ట్రాల అధికార యంత్రాంగం తర్జన భర్జన పడుతోంది. ఈ గ్రామాలన్నీ మహారాష్ట్ర పరిధిలో కూడా ఉండటమే అందుకు కారణం. దశాబ్దాలుగా అవి రెండు రాష్ట్రాల పరిధిలో ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు, తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా ఈ వ్యవహారాన్ని కొలిక్కి తీసుకురాలేకపోయారు. ఆయా గ్రామాల ప్రజలు రెండు రాష్ట్రాల సంక్షేమ పథకాలను పొందుతూ ఉండటం విశేషం. ఈ పరిస్థితుల్లో సర్ ప్రక్రియ తెరపైకి వచ్చింది. ఒకరికి ఒకే ఓటు ఉండాలన్నలక్ష్యంతో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఈప్రక్రియకు ఇక్కడ సవాల్ ఎదురవుతోంది. తాము ఏ రాష్ట్రానికి చెందిన వారమో తేల్చకుండా ఈ వ్యవహారమేందని ప్రజలు అధికారులను నిలదీస్తున్నారు. సమాచారం ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు.

అసలు వివాదం ఏమిటి ?

ప్రస్తుతం తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులోని పరందోలి, ముకద్దంగూడ, అంతాపూర్, బోలాపటార్ పంచాయతీ పరిధిలోని గ్రామాలు నిజాం పరిపాలనలో ఒకే గొడుగు కింద ఉండేవి.భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు వేళ భౌగోళిక, సాంస్కృతిక అంశాలను పరిగణనలోకి తీసుకుంటే 48 శాతం మంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు, 52 శాతం మంది మహారాష్ట్రకు అనుకూలంగా ఉన్నట్లు తేలింది.  జీవన విధానం మహారాష్ట్రకు దగ్గరగా, భౌగోళిక పరిస్థితులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు అనుకూలంగా ఉండటంతో  ఈ గ్రామాలను  ఏ రాష్ట్రంలో చేర్చాలనేది తేల్చలేదు. 1960లో మహారాష్ట్ర అవతరించిన తర్వాత సరిహద్దులోని ఆయనా గ్రామాలన్నింటిని మహరాష్ట్ర లోని చంద్రపూర్ జిల్లా జివితి తాలూకాలో చేర్చారు. దీనిపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభ్యంతరం చెప్పింది. ఆర్టికిల్-3 ప్రకారం ఆ గ్రామాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోకే వస్తాయని 1978లో తేల్చారు.  దాంతో అది రెండు రాష్ట్రాల మధ్య వివిదాస్పద సమస్యగా తయారైంది.  1983లో ఏర్పాటైన కేకే నాయుడు కమిటీ, 1996లో ఉమ్మడ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా ఆయా గ్రామాలు ఆంధ్రప్రదేశ్లోకే వస్తాయని చెప్పగా మహారాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం చెప్పింది. సుప్రీం కోర్టును కూడా ఆశ్రయించింది. అక్కడ నిర్ణయం ఎటూ తేలలేదు. ప్రత్యేక తెలంగాణ అవతరణ సమయంలోనూ ఈ వివాదం పరిష్కారం కాలేదు. దాంతో ఇప్పటికీ అక్కడి ఓటర్లకు తెలంగాణ, మహారాష్ట్ర తరఫున ఓటు హక్కు ఉంది. సర్పంచి నుంచి మొదలుకొని ముఖ్యమంత్రుల వరకు, గ్రామకార్యదర్శి నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వరకు రెండు రాష్ట్రాల తరఫున ఇద్దరేసి ప్రజాప్రతినిధులు, ఇద్దరు చొప్పున అధికారులు ప్రాతినిధ్యం కొనసాగుతూ వస్తోంది.ఈ పరిస్థితి కారణంగా కొందరికి రెండు రాష్ట్రాల ఓటరు గుర్తింపు కార్డులు, రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో రెండు రాష్ట్రాల నుంచీ విద్యుత్ సరఫరా జరుగుతోంది. రెండు రాష్ట్రాలకు చెందిన రేషన్ దుకాణాలు, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. అంటే, ఒకే ప్రాంతంలో రెండు రాష్ట్రాల పరిపాలనా వ్యవస్థలు సమాంతరంగా కొనసాగుతున్నాయని అర్థం.

స‌ర్‌ ప్రక్రియకు ఎందుకు అభ్యంతరం?

తెలంగాణ, మహారాష్ట్రల్లో ఒకేసారి స‌ర్‌ ప్రక్రియ ప్రారంభం కావడంతో అధికారులు ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఒక వ్యక్తి రెండు రాష్ట్రాల ఓటర్ల జాబితాల్లో కొనసాగడం సాధ్యం కాదన్న ‘ఒక వ్యక్తి–ఒక ఓటు’ సూత్రం ప్రకారం, ఓటర్లు ఏ రాష్ట్రంలో నమోదు కావాలో నిర్ణయించాల్సి ఉంది. తెలంగాణ అధికారులు జూన్ 25న పరందోలి గ్రామంలో గణన పత్రాలు అందజేయడానికి ప్రయత్నించారు. మహారాష్ట్ర అధికారులు కూడా జూన్ 30 నుంచి పత్రాల పంపిణీకి సిద్ధమయ్యారు. కొన్ని గ్రామాల్లో ప్రజలు పత్రాలు స్వీకరించినప్పటికీ, ముఖ్యంగా మహారాష్ట్రకు అనుకూలంగా ఉన్న మరాఠీ మాట్లాడే కొన్ని షెడ్యూల్డ్ కులాల కుటుంబాలు వాటిని స్వీకరించేందుకు నిరాకరించారు.  కొందరు తమకు తెలంగాణలోనే ఓటుహక్కు కల్పించాలని కోరుతుండగా మరికొందరు మహారాష్ట్రలోనే ఓటు హక్కు ఇవ్వాలని కోరుతున్నారు. మరికొన్ని గ్రామాల ప్రజలు తమ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తేనే  సహకరిస్తామని తెగేసి చెప్పారు. స‌ర్ ప్రక్రియ‌లో భాగంగా వివ‌రాల సేక‌ర‌ణ గ‌డువు ముగిసినప్ప‌టికీ ఈ గ్రామాల‌కు సంబంధించి ఎంత‌మంది ఏవైపు న‌మోదు చేసుకున్నారు? ఎంత మంది నిరాక‌రించారు? అన్న విష‌యంలో అధికారులు ఎలాంటి ప్ర‌క‌ట‌న జారీ చేయ‌లేదు.

కుల ధ్రువీకరణ, సంక్షేమ పథకాల విషయంలో ఆందోళనలు

లంబాడీ సమాజానికి చెందిన కొందరు తెలంగాణలో షెడ్యూల్డ్ తెగలుగా (ST) గుర్తింపు పొందుతున్నారు. మహారాష్ట్రలో మాత్రం వారు వెనుకబడిన వర్గాల జాబితాలోని వేరే వర్గీకరణలో ఉన్నారు. అందువల్ల తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి తమ పేర్లు తొలగితే, తమకు లభిస్తున్న ST హోదాపై ప్రభావం పడుతుందేమోనని కొందరు ఆందోళన చెందుతున్నట్లు తెలంగాణ‌కు చెందిన ఒక అధికారి పేర్కొన్నారు.   క్షేత్ర స్థాయిలో తాము అవగాహన కల్పించామని, ముందుకు వచ్చిన పేర్లను నమోదు చేశామని చెప్పారు.

భూముల హక్కులు, రెవెన్యూ రికార్డుల సమస్య

గ్రామాల సరిహద్దులు స్పష్టంగా నిర్ణయించకపోవడంతో భూముల సర్వే, పట్టాల జారీ, రెవెన్యూ రికార్డుల విషయంలోనూ సమస్యలు ఉన్నాయి. గతంలో రెండు రాష్ట్రాల నుంచి జారీ చేసిన పహాణీల ఆధారంగా రైతులు పంట రుణాలు పొందేవారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత పహాణీల జారీ నిలిచిపోయిందని, తమ వ్యవసాయ భూములను రిజర్వు అటవీ భూములుగా మార్చే చర్యలపై ఆందోళన  చెందుతున్నామ‌ని మహారాష్ట్ర వైపు నుంచి ఎన్నికైన ఒక ప్ర‌జాప్ర‌తినిధి తెలిపారు. రెండు రాష్ట్రాల్లోని వ్యవసాయ రాయితీలు, సంక్షేమ పథకాలు, విద్యా సదుపాయాలను కోల్పోతామనే ఆందోళన కూడా ఈ వివాదాన్ని మరింత క్లిష్టం చేస్తోంది.

గ్రామస్థుల ప్రధాన డిమాండ్ ఏమిటి?

చంద్రపూర్, కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాల కలెక్టర్లు చర్చలు జరిపి, గ్రామాల సరిహద్దులు, పరిపాలనా హక్కులు, భూముల సమస్యలను పరిష్కరించాలని గ్రామస్థులు కోరుతున్నారు. సమస్య పరిష్కారమయ్యే వరకు SIR పత్రాలను స్వీకరించబోమని కొందరు చెప్తున్నారు. మహారాష్ట్ర వాదనకు చారిత్రక రెవెన్యూ రికార్డులు ఆధారమైతే, తెలంగాణ వాదనకు కే.కే. నాయుడు కమిషన్ సిఫారసులు ఆధారంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది.

మొత్త‌మ్మీద చూస్తే ఈ వివాదం కేవలం ఓటర్ల జాబితాల సవరణకు సంబంధించినది కాదు. రాష్ట్ర సరిహద్దుల స్పష్టత లేకపోవడం వల్ల పౌరుల ఓటు హక్కు, భూముల యాజమాన్యం, కుల ధ్రువీకరణ, సంక్షేమ పథకాల లబ్ధి, స్థానిక పరిపాలన వంటి అంశాలన్నీ పరస్పరం ముడిపడ్డాయి. స‌ర్‌ ద్వారా ఓటర్ల జాబితాలను సరిచేయాలంటే, ముందుగా ఈ గ్రామాలపై ఉన్న పరిపాలనా, భౌగోళిక వివాదాన్ని పరిష్కరించడం అవ‌స‌రం.  అయితే రెండు రాష్ట్రాల జాబితాల్లో పేర్లు ఉండటం ఒక్కటే చట్టబద్ధంగా రెండు చోట్ల ఓటు వేయడానికి అనుమతి అని అర్థం కాదు.

IN NUMBERS

వివాదాస్పద పంచాయతీల వివరాలు

పంచాయతీ…….ఇళ్లు……జనాభా…..ఓటర్లు

పరందోలి         358        1573            873

ముకద్దంగూడ   305       1206           761

అంతాపూర్       363        1668           815

బోలాపటార్       406        1479          1007

NEWS AT A GLANCE

https://m.dailyhunt.in/news/india/english/the%2Bwire%2Benglish-epaper-wireng/in%2B14%2Bvillages%2Bthat%2Bvote%2Bin%2Btwo%2Bstates%2Bpeople%2Breject%2Bsir%2Bforms%2Buntil%2Bthey%2Bknow%2Bwhere%2Bthey%2Bbelong-newsid-n717964230?utm

https://m.thewire.in/article/rights/in-14-villages-that-vote-in-two-states-people-reject-sir-forms-until-they-know-where-they-belong/amp?utm

https://www.newindianexpress.com/states/telangana/2026/Jun/25/voter-mapping-begins-in-disputed-border-villages?utm

https://www.deccanchronicle.com/amp/southern-states/telangana/sir-residents-of-12-disputed-border-villages-filled-enumeration-forms-for-two-states-1975590?utm

https://timesofindia.indiatimes.com/city/nagpur/maha-sets-up-high-level-panel-to-solve-border-row-with-telangana-on-15-jiwati-villages/articleshow/131539922.cms?utm

https://www.indiatoday.in/amp/india/story/maharashtra-telangana-border-villagers-boycott-sir-over-land-dispute-2937730-2026-06-30?utm

https://indianexpress.com/article/political-pulse/maharashtra-telangana-border-row-dual-voters-9267739/?utm

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *