ఫ్లై దుబాయ్ సంఘటన చిన్నదేనా? విదేశీ పత్రికల దృక్కోణం
పాశ్చాత్య మీడియా ఒక ఉగ్రవాద దాడి వంటి సంఘటనను కేవలం ‘గొడవ’ (brawl) గా చిత్రీకరించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోసారి, పాశ్చాత్య మీడియా యొక్క పక్షపాత పదజాలంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి
తాజా వార్త (breaking news) యొక్క ప్రారంభ కథనం తరచూ ప్రజల మనస్సుల్లో గాఢంగా నిలిచిపోతుంది. అందుకే ఆ వార్తల శీర్షికలలో వాడే పదజాలం అత్యంత కీలకమైనది. సెప్టెంబర్ 30న జరిగిన ‘ఫ్లైదుబాయ్ ఫ్లైట్ FZ1073′ ఘటన దీనికి ఒక స్పష్టమైన ఉదాహరణ.
ఒమాన్ దేశానికి చెందిన సహ-పైలట్ (co-pilot) 174 మంది ప్రయాణికులతో దుబాయ్ నుండి టెల్ అవీవ్ వెళ్తున్న ఈ విమానంలో భారతీయ కెప్టెన్ స్మిత్ మచ్ఛార్‌పై కాక్‌పిట్ లోపల కత్తితో దాడి చేయడంతో విమానం అత్యవసర పరిస్థితిని ఎదుర్కొంది. ఆ తర్వాత విమానం వేగంగా కిందికి దిగడం ప్రారంభించింది. తీవ్ర గాయాలైనప్పటికీ, కెప్టెన్ మచ్ఛార్ కాక్‌పిట్ తలుపు తెరిచి, ప్రయాణికులు, ఇతర సిబ్బంది లోపలికి వచ్చి అడ్డుకోవడానికి మార్గం సుగమం చేశారు. చివరికి విమానాన్ని అదుపులోకి తెచ్చి సౌదీ అరేబియాలోని తబుక్‌కు మళ్లించారు. విమానం దాదాపు 14,000 అడుగుల కిందకు పడిపోయిందని, ఈ ఘటన వెనుక ఉగ్రవాదం ఉందా లేదా మరేదైనా కోణం ఉందా అనే అంశంపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారని రాయ్టర్స్ పేర్కొంది.
అయినప్పటికీ ప్రధాన పాశ్చాత్య మీడియా సంస్థలు ఈ తీవ్రమైన ఘటనను చాలా సాధారణ పదాలతో—’గొడవ’ (altercation, brawl), ‘పోరాటం/ఘర్షణ’ (struggle, fight) మరియు ‘ఢీకొనడం’ (clash) వంటి మాటలతో వర్ణించాయి దీనిని చాలా చిన్న సంఘటన గా చూపింకే ప్రయత్నం చేశాయి. దీనిపై ఇప్పుడు తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
సమస్య ఏమిటంటే…
‘గొడవ’ (altercation) లేదా ‘పోరాటం’ (struggle) వంటి పదాలు తప్పు కాదుకాని తీవ్రతను తక్కువ చేసి చూపించేలా ఉన్నాయి. ఒక ఘటన వేగంగా మారుతున్న ప్రారంభ దశలో విలేకరులకు దాని వెనుక ఉన్న ఉద్దేశం వ్యక్తుల గుర్తింపు లేదా లక్ష్యాల గురించి ధృవీకరించబడిన సమాచారం నిజంగా లేకపోవచ్చు. అధికారులు ఇంకా దర్యాప్తు చేస్తున్న సమయంలోనే, సమయం కంటే ముందే ఊహాగానాలు చేయవద్దని ఫ్లైదుబాయ్ సంస్థ స్వయంగా హెచ్చరించింది.
అయితే ఇక్కడ సమస్య ఏమిటంటే… అసలు నిజాలను ఏ విధంగా పక్కదారి పట్టించారు అనేదే! ఇద్దరు పైలట్ల మధ్య ‘గొడవ’ జరిగిందని పాఠకులకు చెప్పడానికి, ఒక పైలట్ కాక్‌పిట్ లోపల దారుణంగా కత్తిపోట్లకు గురయ్యాడని అందువల్ల విమానం వేగంగా కిందకు పడిపోయే పరిస్థితి తలెత్తిందని చెప్పడానికి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. మొదటిది కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఘర్షణను సూచిస్తుంది. రెండవది ఒమాన్ దేశానికి చెందిన సహ-పైలట్ చర్య వల్ల వైమానిక భద్రతకు ఏర్పడిన తీవ్రమైన ప్రమాదాన్ని తెలియజేస్తుంది.
విమానం కూలిపోకుండా కాపాడే క్రమంలో తీవ్రంగా గాయపడిన ఒక భారతీయ పైలట్ ఈ ఘటనలో భాగమైనప్పుడు ఈ వ్యత్యాసం మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. కెప్టెన్ మచ్ఛార్ చేసిన ఈ సాహసకార్యాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఇజ్రాయెల్ ప్రధాని బెన్జమిన్ నేతన్యాహు తర్వాత ‘హీరోయిక్’ (సాహసోపేతమైనది) గా అభివర్ణించారు. ఆ తర్వాతే న్యూయార్క్ టైమ్స్ కూడా ఆయన గాయపడినప్పటికీ తిరిగి పోరాడారని, కాక్‌పిట్ తలుపు తెరిచి ప్రయాణికులు, సిబ్బంది ఆ దాడి చేసిన వ్యక్తిని లొంగదీసుకునేలా చేశారని నివేదించింది.
ఈ వార్తా కథనాలు పరిణామం చెందిన తీరు ఒక న్యాయమైన ప్రశ్నకు తావిస్తోంది: ఈ ధృవీకరణ ప్రమాణాలు (verification standards) ఒక ఘటన నుంచి మరొక ఘటనకు మారినప్పుడు ఎందుకు అసమానంగా ఉంటున్నాయి? న్యూయార్క్ టైమ్స్ తన ప్రారంభ నివేదికలను సమర్థించుకుంటూ, తమ శీర్షికలు, ప్రత్యక్ష ప్రసారాలు ఆ సమయంలో తమ విలేకరులు ధృవీకరించగలిగిన విషయాలను మాత్రమే ప్రతిబింబించాయని, ఊహాగానాలు లేదా ధృవీకరించని దావాలను ప్రచురించవని పేర్కొంది. సిద్ధాంతపరంగా అది సరైన సూత్రమే. కానీ ఇటువంటి సూత్రానికి విలువ ఉండేది అది నిలకడగా వర్తింపచేసినప్పుడు మాత్రమే.
‘ధృవీకరణ ప్రమాణాల‘ను పాశ్చాత్య మీడియా అసమానంగా వర్తింపజేయడం
భారత్‌లోని జమ్మూ కాశ్మీర్‌లో లేదా పాశ్చాత్యేతర ప్రపంచంలో ఏదైనా ఘటన జరిగినప్పుడు, ప్రతి అంశం స్వతంత్రంగా నిర్ధారణ కాకముందే పాశ్చాత్య మీడియా సంస్థలు విస్తృతమైన వ్యాఖ్యలను ప్రచురించడంపై తరచూ విమర్శలు ఎదుర్కొంటున్నాయి.
ఆ చరిత్రే ఫ్లైదుబాయ్ ఘటనపై వచ్చిన వార్తా కథనాలను పరిశీలించాల్సిన అవసర్యాన్ని కలిగిస్తోంది. ఈ పరిశీలన ప్రతీ ప్రారంభ నివేదిక వెంటనే ఆ ఘటనను ‘ఉగ్రవాదం’ అని ముద్ర వేయాలని కాదు, కానీ ధృవీకరణ పేరుతో అత్యంత కీలకమైన, ధృవీకరించిన నిజాల తీవ్రతను తగ్గించేలా పదజాలాన్ని ఎంచుకోకూడదనే ఉద్దేశంతోనే. కొన్ని ఉదాహరణలను పరిశీలిద్దాం.
2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత అనేక ప్రధాన పాశ్చాత్య ప్రచురణలు భారత నిర్ణయాన్ని దాని పరిణామాలను తీవ్రంగా విమర్శిస్తూ కథనాలను ప్రచురించాయి. భారత్ “ప్రమాదకరమైన, తప్పుడు” మార్గాన్ని ఎంచుకుందని న్యూయార్క్ టైమ్స్ సంపాదకీయం రాసింది. వాషింగ్టన్ పోస్ట్ కూడా ఈ చర్యను తీవ్ర విమర్శనాత్మక కోణంలో వర్ణించింది.
‘ది కాశ్మీర్ క్రైసిస్ ఈజ్ నాట్ అబౌట్ టెరిటరీ. ఇట్స్ అబౌట్ ఎ హిందూ విక్టరీ ఓవర్ ఇస్లాం’ (కాశ్మీర్ సంక్షోభం భూభాగం గురించి కాదు, ఇది ఇస్లాంపై హిందువుల విజయం) అనే వ్యాస శీర్షిక ద్వారా వాషింగ్టన్ పోస్ట్ యొక్క వైఖరిని అర్థం చేసుకోవచ్చు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత వచ్చిన ఇలాంటి వరుస వ్యాసాలు కాశ్మీరీ హిందువుల ప్రాతినిధ్యంపై నేరుగా వివాదాన్ని రేకెత్తించాయి. కాశ్మీరీ పండిట్ల బృందం వాషింగ్టన్ పోస్ట్ కార్యాలయాల బయట సెప్టెంబర్ 2019లో నిరసన వ్యక్తం చేసింది. న్యూ యార్క్ దాని కాశ్మీర్ కవరేజ్ మైనారిటీల అనుభవాలను, కాశ్మీరీ హిందువుల బలవంతంగా అక్కడనుండి పంపివేయడం నిర్లక్ష్యం చేసిందని వాదించింది. వాషింగ్టన్ పోస్ట్ తన పత్రికా కథనాలను ‘నిష్పాక్షికమైనవి, ఖచ్చితమైనవి, సమగ్రమైనవి’ అని నిస్సిగ్గుగా సమర్థించుకుంది. ఒక పార్లమెంటరీ నిర్ణయంలో ‘ఇస్లాంపై హిందూ విజయాన్ని’ ఆ పత్రిక ఎలా ధృవీకరించిందో అనే ప్రశ్నకు సమాధానం లభించకుండానే ఉండిపోయింది. ఆ పత్రిక కవరేజ్‌లో ఉన్న పక్షపాతాన్ని మరింత బలపరిచింది.
ఆగస్టు 5 నుండి సెప్టెంబర్ 3, 2019 మధ్య బిబిసి, సిఎన్ఎన్, న్యూయార్క్ టైమ్స్, ఎన్‌పిఆర్ వాషింగ్టన్ పోస్ట్‌లు ప్రచురించిన 132 వ్యాసాలను సమీక్షించింది. ఈ కవరేజ్ అసంపూర్ణ చిత్రాన్ని అందించిందని, కాశ్మీరీ పండిట్ల నిర్బంధ వలసల చరిత్రకు తగినంత ప్రాధాన్యత ఇవ్వలేదని ఆ సంస్థ ఆభిప్రాయపడింది. అది ఒక సంస్థ యొక్క విశ్లేషణ మాత్రమే కావచ్చు, కానీ పాశ్చాత్య మీడియా పక్షపాతపూరిత ధోరణిపై ఉన్న ఆందోళనలు కేవలం సోషల్ మీడియా విమర్శలకే పరిమితం కాలేదని ఇది నిరూపిస్తుంది. అలాగే, ఇది ‘ధృవీకరణ ప్రమాణాల’ ను తమ ఇష్టానుసారం వర్తింపచేయయడాన్ని కూడా ప్రశ్నిస్తోంది.
భారత్‌పై కథనాలు: పక్షపాత ‘ప్రమాణాలు‘
2019 పుల్వామా బాంబు దాడిలో 40 మంది భారత భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. కాశ్మీర్ కవరేజ్ గురించి చర్చిస్తున్నప్పుడు కొలంబియా జర్నలిజం రివ్యూ అంతర్జాతీయ మీడియా సంస్థలు కొన్నిసార్లు ఈ వివాదాన్ని ప్రధానంగా కాశ్మీరీల అసంతృప్తి, భారతదేశం బలగాల వినియోగం చుట్టూనే చిత్రీకరించాయని, కానీ పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థలకు, ఉగ్రవాద చరిత్రకు తక్కువ ప్రాధాన్యత ఇచ్చాయని పేర్కొంది.
2019లో, పౌరసత్వ సవరణ చట్టం (CAA) ఆమోదించిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ, హిందువులకు వ్యతిరేకంగా న్యూయార్క్ టైమ్స్ విషప్రచారం చేయడం ప్రారంభించింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ వంటి మూడు పొరుగు ఇస్లామిక్ దేశాల నుండి వేధింపులకు గురైన మైనారిటీలకు ఈ చట్టం పౌరసత్వం మంజూరు చేసినప్పటికీ ‘యాజ్ మోదీ పుషెస్ హిందూ ఎజెండా, ఎ సెక్యులర్ ఇండియా ఫైట్స్’ అనే శీర్షికతో న్యూయార్క్ టైమ్స్ ఒక వ్యాసాన్ని ప్రచురించింది.
దేశం లౌకిక పునాదులను దెబ్బతీసే చట్టంగా ఈ వ్యాసం సిఏఏను దురుద్దేశపూర్వకంగా చిత్రీకరించడానికి ప్రయత్నించింది. అలాగే, ఈ చట్టం ముస్లింల పౌరసత్వాన్ని రద్దు చేయడానికి వేసిన మొదటి అడుగు అనే భయాందోళనలను పెంచుతూ, చట్టం గురించి సగం అబద్ధాలను వ్యాప్తి చేసింది. ఇది ధృవీకరణ ప్రమాణాల వర్తింపా లేదా రాజకీయ పక్షపాతమా?
కోవిడ్-19 మొదటి దశ భారతదేశాన్ని తాకినప్పుడు ‘ఇన్ ఇండియా, కరోనావైరస్ ఫ్యాన్స్ రిలీజియస్ హేట్రెడ్’ అనే శీర్షికతో న్యూయార్క్ టైమ్స్ స్పష్టమైన హిందూఫోబిక్ వ్యాసాన్ని ప్రచురించింది. కరోనావైరస్ ఉధృతంగా ఉన్న సమయంలో ‘హిందూ జాతీయవాదులు’ ముస్లింలకు వ్యతిరేకంగా భారతదేశంలో మత ద్వేషాన్ని పెంచుతున్నారని నిరూపించడానికి వాస్తవానికి విరుద్ధమైన కధనం ప్రచురించింది.
నమ్మకం అనే పెద్ద అంశం
భారతదేశంపై విమర్శలు స్వతహాగా పక్షపాతంతో కూడుకున్నవని గానీ, లేదా భారత అధికారులు ఒకవేళ అక్రమాలకు పాల్పడితే పత్రికలు ఆరోపణలను తొక్కిపెట్టాలని గానీ భావించడం లేదు. విశ్వసనీయమైన మీడియా వ్యవస్థ రెండు వైపులా ఉన్న వాస్తవాలను చెప్పాలి. సందర్భం, వాస్తవాలు ధృవీకరించుకోవడం, సూక్ష్మ అంశాల వ్యక్తీకరణ విషయంలో ఒకే ప్రమాణాన్ని అన్నిటికి వర్తింపజేస్తున్నారా లేదా అనేది మాత్రం చాలా ముఖ్యమైనది.
అందుకే ఫ్లైదుబాయ్ ఘటన అత్యంత ప్రాముఖ్యత సంతరించుకుంది. కత్తిపోట్లు, విమాన నియంత్రణలను దెబ్బతీసే ప్రయత్నం, ప్రమాదకరమైన రీతిలో కిందకు పడిపోవడం ఉన్న కాక్‌పిట్ దాడిని ప్రారంభంలో ‘గొడవ’గా తగ్గించి చూపితే, పాఠకులు ఆ ఘటన యొక్క తీవ్రతను సులభంగా తప్పుగా అర్థం చేసుకుంటారు. గాయపడిన భారతీయ కెప్టెన్ కాక్‌పిట్‌ను తెరవడానికి సహాయం చేసారని, ప్రయాణికులు, సిబ్బంది లోపలికి రావడానికి అనుమతించారని ఆ తర్వాత వచ్చిన వార్తలు స్పష్టం చేశాయి. జరిగినదాన్ని అర్థం చేసుకోవడానికి అది అత్యంత కీలకమైనది కాబట్టి ఆ వాస్తవానికి ప్రముఖ ప్రాధాన్యత లభించాలి.
అలాగే, అదే పాశ్చాత్య మీడియా బాధితులను, నేరస్థులను ఒక ఒకే మూసలో చిత్రీకరించడానికి ‘హిందువులు’, ‘ముస్లింలు’, ‘దళితులు’ వంటి గుర్తింపులను ఎంచుకుని మరీ జోడిస్తున్నప్పుడు, ఫ్లైదుబాయ్ ఘటనలో దాడి చేసిన వ్యక్తి కనీసం ఒక ఒమాన్ పౌరుడు అని తెలిసిన వెంటనే ఎందుకు చెప్పలేదు. దాడి చేసిన వ్యక్తి ఒమానీ గుర్తింపును దాచడం ద్వారా పాశ్చాత్య మీడియా ఏమి సాధించాలనుకుంది?
పాశ్చాత్య వార్తాసంస్థలు మరో ప్రశ్నకు కూడా సమాధానం చెప్పవలసి ఉంది. ఒక భారతీయ లేదా ఇజ్రాయెల్ పైలట్ మరొక పైలట్‌పై దాడి చేసి ఉంటే, భాషా పరంగా ఇదే రకమైన సడలింపు లభించేదా? మొదటి శీర్షిక దానిని ‘గొడవ’ అని పిలిచేదా, లేక గుర్తింపు, భావజాలం, ఉగ్రవాద కోణం వెంటనే కథనాన్ని ఆక్రమించేవా?
దీనికి సమాధానాన్ని ఊహించలేము. దీనిని నిలకడైన సంపాదకీయ ప్రమాణాల ద్వారా మాత్రమే పరీక్షించాలి. పాశ్చాత్య మీడియాను బాధ్యులను చేయాల్సింది ఆ విధంగానే. ఒమాన్ పౌరుడు ప్రమేయం ఉన్న ప్రతి ఘటనను దర్యాప్తు అధికారులు ఉద్దేశాన్ని నిర్ధారించక ముందే ఉగ్రవాదంగా ముద్ర వేయాలని ఇక్కడ వాదన కాదు. అలా అని భారత్‌కు సంబంధించిన ప్రతి నివేదిక ఒక భారతీయ పౌరుడిని హీరోగా చూపాలని కూడా కాదు. విషయం చాలా సరళమైనది. వార్తా కవరేజ్ యొక్క స్వభావం, తీవ్రతను రాజకీయ పక్షపాతాలు నిర్దేశించనివ్వవద్దు. ఆధారాలు తెలిసినప్పుడు విమానాన్ని కూల్చివేసే ప్రయత్నాన్ని ‘కూల్చివేత ప్రయత్నం’ అనే పిలవాలి. ఈ ఘటన న్యూయార్క్, కెనడా, లండన్, టెల్ అవీవ్, కాశ్మీర్, ముంబై లేదా గల్ఫ్‌లో ఎక్కడ జరిగినా ఒకే రకమైన ధృవీకరణ పరిమితి వర్తించాలి.
జర్నలిజంలో జాగ్రత్త వహించడం ఒక మంచి లక్షణమే, కానీ అది పక్షపాతంతో కూడిన తక్కువ చేసి చూపే ధోరణిగా మారకూడదు. ఉగ్రవాదం, మతపరమైన హింస, కాశ్మీర్, భౌగోళిక రాజకీయాలపై తమ కవరేజ్‌ను భారతదేశంలోని పాఠకులు నమ్మాలని పాశ్చాత్య వార్తా సంస్థలు భావిస్తే, కేవలం సాంకేతికంగా కొన్ని వాస్తవాలను సరిగ్గా నివేదిస్తే సరిపోదు. ఆయా వార్తా సంస్థల సాధారణ భావజాలానికి రాజకీయ పరిణామాలు సరిపోలనప్పుడు కూడా వార్తల చిత్రీకరణ అంతే కచ్చితత్వంతో ఉందా లేదా అనేదానిపైనే ఆ నమ్మకం ఆధారపడి ఉంటుంది. అందువల్ల, ఫ్లైదుబాయ్ ఎపిసోడ్ కేవలం ఇద్దరు పైలట్ల గురించి మాత్రమే కాదు. ప్రపంచ జర్నలిజం నిజాల పట్ల జాగ్రత్తగా ఉందో లేక కథనాల పట్ల జాగ్రత్తగా ఉందో గుర్తించడానికి ఇది ఒక పరీక్ష. ఎందుకంటే, రక్తం చిందిన నిజాలను కేవలం రాతల ద్వారా ఎప్పటికీ కప్పిపుచ్చలేరు!
News at a Glance:
- A pilot brawl, then a rapid descent: passengers recount chaos on flydubai flight
- Netanyahu and Modi hail Indian flydubai pilot as hero
- What to know about the attack on a FlyDubai flight bound for Israel
- New York Times roasted for calling flydubai stabbing an altercation, doubles down
- Kashmiri Pandits slam ‘biased’ media coverage on Kashmir
- Here are 14 articles published by the New York Times from the last 10 years that reaffirm its anti-Modi and anti-Hindu bias
- BBC receives 18,600 complaints over use of racial slur in news report
- Kenya demands CNN apology over ‘hotbed of terror’ slur
- The Washington Post and the consequences of biased reporting
- EXCLUSIVE: ‘The New York Times’ Sued by Shareholders Over Biased Israel Coverage
- How a recent study shows inherent biases of Western media when it comes to reporting about India
Social Media Pulse
- Western Media Narratives on India: From Gandhi to Modi, by Umesh Upadhyay
- Fake News: Read All About It (In the Headlines), by New York Times Company (Editor)
- ‘Many Voices, One World’ (Sean MacBride Commission) Report, by the International Commission for the Study of Communication Problems
