ఏపీలో రాజకీయ దుమారం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల జీవోలు రద్దు
INTRODUCTION
ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అంశం మళ్లీ తెరమీదికి వచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు పెంచిన రిజర్వేషన్లకు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు
2026 అక్టోబర్ 1న కొట్టివేసింది. ఇది పెను దుమారం రేపుతోంది. ప్రభుత్వం, ప్రతి పక్షం మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. చట్టబద్ధం కాని జీవోలతో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం బీసీలను మోసం చేయడానికి యత్నిస్తోందని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. అయితే తాము బీసీల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్తున్నారు. బీసీ సంఘాల నాయకులు కూడా ఈ తీర్పుపై పెదవి విరిచారు. సుప్రీంకోర్టుకు వెళ్లడంతో పాటు కేంద్ర సహకారం తీసుకుని రాజ్యాంగ సవరణ ద్వారా ఈ రిజర్వేషన్లను వర్తింప జేయాలని బీసీ నాయకుడు ఆర్.కృష్ణయ్య కోరారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు..హైకోర్టు తీర్పు నేపథ్యంలో పరిణామాలపై ఒక విశ్లేషణ.
ANALYTICAL VIEW
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు పెంచిన రిజర్వేషన్లకు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టివేసింది.ప్రస్తుత ఆధారాలతో మొత్తం ఎస్.సి, ఎస్.టి, బీసీ రిజర్వేషన్లు 50% పరిమితిని దాటేలా 34% BC కోటాను అమలు చేయడం చెల్లదని కోర్టు పేర్కొంది తప్ప బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడాన్ని రద్దు చేయలేదు. 34% అనే ప్రస్తుత విధానాన్ని, దానికి అవసరమైన సుప్రీంకోర్టు నిర్దేశించిన ఎంపరికల్/ ట్రిపుల్ టెస్ట్ ప్రక్రియ తగినంతగా నిరూపితం కాలేదనే కారణంతో రద్దు చేసింది.
ఏమి జరిగింది?
2020లోనే ఏపీ హైకోర్టు బిర్రు ప్రతాపరెడ్డి కేసులో ఈ అంశాన్ని పరిశీలించింది. అప్పట్లో గ్రామీణ స్థానిక సంస్థలకు SCలకు 6.77%, STలకు 19.08%, BCలకు 34% కలిపి మొత్తం 59.85% రిజర్వేషన్ అవుతున్నందున 34% కనీస BC కోటాను చట్టపరంగా నిలబెట్టలేమని కోర్టు పేర్కొంది. దీంతో 2020లో BC రిజర్వేషన్ వాస్తవంగా సుమారు 24.15% కు తగ్గింది. మళ్లీ 34% రిజర్వేషన్‌ను పునరుద్ధరించేందుకు 2026 ఆగస్టులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్థానిక సంస్థల్లో బీసీలకు పెంచిన రిజర్వేషన్‌ను ప్రకటించారు. దానికి అనుగుణంగా రెండు ప్రధాన ఉత్తర్వులు జారీ చేశారు.
- G.O.Ms.No.105 – 20 ఆగస్టు 2026: గ్రామ పంచాయతీలు, MPTCs, ZPTCs తదితర గ్రామీణ స్థానిక సంస్థల్లో 34% BC రిజర్వేషన్
- G.O.Rt.No.1065 – 19 ఆగస్టు 2026: మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, నగర పంచాయతీల్లో 33.33% BC రిజర్వేషన్
ప్రభుత్వం దీనిని బీసీల రాజకీయ సాధికారతకు సంబంధించిన ముఖ్యమైన నిర్ణయంగా, ఎన్నికల హామీ అమలుగా అభివర్ణించింది. అయితే ఈ ఉత్తర్వులను న్యాయవాది తాండవ యోగేష్ తదితరులు హైకోర్టులో సవాలు చేశారు.
హైకోర్టు ప్రధానంగా ఏం చెప్పింది?
హైకోర్టు ధర్మాసనం చీఫ్ జస్టిస్ లిసా గిల్, జస్టిస్ చల్లా గుణరంజన్ ప్రస్తుత 34% BC కోటాతో SC + ST + BCల కలిపిన రిజర్వేషన్లు 50% పరిమితిని దాటుతున్నాయని పేర్కొంది. ఇది స్థానిక సంస్థల రాజకీయ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు నిర్దేశించిన సూత్రాలకు అనుగుణంగా లేదని కోర్టు చెప్పింది. అయితే 50% పరిమితిని ఏ పరిస్థితిలోనూ దాటరాదని కోర్టు చెప్పలేదు. అసాధారణ పరిస్థితుల్లో దాటే అవకాశం ఉందని, కానీ అందుకు బలమైన గణాంకాలు, సమకాలీన ప్రామాణిక డేటా అవసరమని పేర్కొంది.
ప్రభుత్వ వాదనను ఎందుకు అంగీకరించలేదు?
34% కోటాను నిర్ణయించడానికి ప్రభుత్వం ఏకీకృత కుటుంబ సర్వే, డెడికేటెడ్ కమిషన్ నివేదిక తదితర సమాచారాన్ని ఆధారంగా చూపించింది. అయితే హైకోర్టు అభిప్రాయం ప్రకారం, ఈ సమాచారం సుప్రీంకోర్టు కోరిన విధమైన స్వతంత్ర ప్రామణిక కృషికి సమానంగా లేదని తేల్చింది. అందువల్ల 50%కు మించిన రిజర్వేషన్‌ను ప్రస్తుత డేటాతో సమర్థించలేమని పేర్కొంది. సుప్రీంకోర్టు వికాస్ కిషన్‌రావు గవాలి తీర్పులో స్థానిక సంస్థల్లో BC రాజకీయ రిజర్వేషన్ల కోసం అవసరమైన డేటా సేకరణ, ప్రామాణిక ఎక్సర్‌సైజ్ గురించి నిర్దేశించిన సూత్రాలను హైకోర్టు ప్రస్తావించింది.
BC రిజర్వేషన్ పూర్తిగా రద్దయిందా?
అలా అర్థం చేసుకోవడం సరైంది కాదు. హైకోర్టు 34% BC రిజర్వేషన్ కల్పిస్తూ జారీ చేసిన ప్రస్తుత రెండు జీఓలను రద్దు చేసింది. అదే సమయంలో ప్రభుత్వం BCల సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులపై అవసరమైన డేటాను సేకరించి, సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా మళ్లీ రిజర్వేషన్‌ను నిర్ణయించుకోవడానికి అవకాశం ఉంచింది.
స్థానిక ఎన్నికలపై కోర్టు ఏం చెప్పింది?
హైకోర్టు ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం ఆరు వారాల్లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాలని ఆదేశించింది. గ్రామ పంచాయతీలు, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలను ఇక నిరవధికంగా వాయిదా వేయకూడదని స్పష్టం చేసింది. అలాగే సర్ (Special Intensive Revision) పూర్తయ్యే వరకు స్థానిక ఎన్నికలు నిర్వహించకూడదన్న వాదనను కూడా కోర్టు అంగీకరించలేదు. 2026 జనవరి 1న ఉన్న అసెంబ్లీ ఓటర్ల జాబితాను ప్రాతిపదికగా తీసుకుని ఎన్నికల ప్రక్రియ ముందుకు తీసుకెళ్లవచ్చని పేర్కొంది.
వివాదం ఎలా మొదలైంది?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామీణ స్థానిక సంస్థల్లో 34%, పట్టణ స్థానిక సంస్థల్లో 33.33% రిజర్వేషన్ కల్పించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి ఆగస్టు 20, 19 తేదీల్లో పంచాయతీరాజ్ శాఖ GO 105, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ GO 1065 జారీ చేశాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయాన్ని బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం పెంచే చర్యగా, గత ఎన్నికల హామీ అమలుగా ప్రకటించారు. దీనిపై
న్యాయవాది తాండవ యోగేష్ ఆగస్టులో హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. బీసీలకు 34% ఇవ్వడం వల్ల SC + ST + BCలకు కలిపి మొత్తం రిజర్వేషన్లు 50% పరిమితిని దాటుతాయని, అందువల్ల ఈజీఓలను రద్దు చేయాలని కోరారు. ఈ పిటిషన్‌లో 2010 కె.కృష్ణమూర్తి తీర్పుతో పాటు ఇతర సుప్రీంకోర్టు తీర్పులను కూడా ఆధారంగా చూపించారు.
సుప్రీంకోర్టు సూచించిన విధానం ఏంటి?
2021లో వికాస్ కిషన్‌రావు గవాలి వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసులో సుప్రీంకోర్టు స్థానిక సంస్థల్లో OBC/BC రాజకీయ రిజర్వేషన్లకు మూడు దశల విధానాన్ని సూచించింది.
- మొదటి దశలో ప్రత్యేక డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయాలి. ఆ కమిషన్ స్థానిక సంస్థల స్థాయిలో బీసీల వెనుకబాటుతనం, రాజకీయ ప్రాతినిధ్యం తదితర అంశాలపై సమకాలీన, కఠినమైన ప్రామాణిక అధ్యయనం చేయాలి.
- రెండో దశలో ఆ అధ్యయనం ఆధారంగా ప్రతి స్థానిక సంస్థకు అవసరమైన రిజర్వేషన్ శాతాన్ని నిర్ణయించాలి. అంటే రాష్ట్రంలోని అన్ని పంచాయతీలు, మున్సిపాలిటీలకు ఒకే రేటు యాంత్రికంగా వర్తింపజేయడం కాకుండా, డేటా ఆధారంగా నిర్ణయం తీసుకోవాలి.
- మూడో దశలో SC + ST + BCల మొత్తం వర్టికల్ పొలిటికల్ రిజర్వేషన్లు సాధారణంగా 50% పరిమితిని మించకూడదు.
ఏపీ ప్రభుత్వం ఏమి వాదించింది?
రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ పెంపునకు యునిఫైడ్ ఫ్యామిలీ సర్వేతో పాటు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డెడికేటెడ్ కమిషన్ సమాచారాన్ని ఆధారంగా చూపింది. ఈ డేటా ఆధారంగా బీసీలకు 34% రిజర్వేషన్ అవసరమని నిర్ణయించినట్లు తెలిపింది. 2026 ఫిబ్రవరి 19న ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ కోసం డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేసినట్లు హైకోర్టు ముందు వివరించింది.
హైకోర్టు దాన్ని ఎందుకు అంగీకరించలేదు?
హైకోర్టు అభిప్రాయం ప్రకారం, ప్రభుత్వం సమర్పించిన యునిఫైడ్ ఫ్యామిలీ సర్వే డేటా సుప్రీంకోర్టు కోరిన కఠిన ప్రామాణిక కసరత్తు (rigorous empirical exercise) కు సమానం కాదు. ప్రత్యేకంగా, ప్రభుత్వం స్వయంగా సమర్పించిన సమాచారం మాత్రమే ఆధారంగా తీసుకుని 50%కు పైగా రిజర్వేషన్‌ను సమర్థించలేమని కోర్టు పేర్కొంది. అందువల్ల 34% BC కోటాను అమలు చేసే GOsను కోర్టు కొట్టివేసింది.అయితే 50% రిజర్వేషన్ దాటాలంటే కఠినమైన ఆధారాలు తప్పనిసరి అని స్పష్టం చేసింది.
మరి ఎన్నికల నిర్వహణ ఎలా?
పంచాయతీలు, పట్టణ స్థానిక సంస్థల పదవీకాలాలు ఇప్పటికే ముగిశాయని హైకోర్టు గుర్తించింది. రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆరు వారాల్లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాలని ఆదేశించింది. స్థానిక ఎన్నికలను స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) పూర్తయ్యే వరకు వాయిదా వేయాలని కోరిన వాదనను కూడా కోర్టు అంగీకరించలేదు. అంటే బీసీ రిజర్వేషన్ వివాదం కారణంగా స్థానిక ఎన్నికలను నిరవధికంగా వాయిదా వేయడం కాకుండా ఎన్నికల ప్రక్రియ ముందుకు సాగాలని కోర్టు దిశానిర్దేశం చేసింది.
రాజకీయ స్పందనలు ఎలా ఉన్నాయి?
తీర్పు బీసీల రాజకీయ ప్రాతినిధ్యానికి దెబ్బ అని, 34% అమలు కోసం న్యాయపోరాటం కొనసాగిస్తామని అధికార పక్ష నాయకులు చెబుతున్నారు. మరోవైపు ప్రభుత్వం సరైన న్యాయపరమైన, రాజ్యాంగపరమైన విధానాన్ని ముందుగానే పాటించకుండా రాష్ట్ర ప్రభుత్వం జీఓలు జారీ చేసిందనివైఎస్సార్‌సీపీ నాయకులు విమర్శిస్తున్నారు. మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ తదితరులు దీనిని రాజకీయంగా బీసీలకు ఇచ్చిన హామీని అమలు చేయడంలో విఫలమైన చర్యగా అభివర్ణించారు.
రాజ్యాంగ సవరణే శాశ్వత పరిష్కారం: ఆర్.కృష్ణయ్య
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య కూడా తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏపీ హైకోర్టు తీర్పు బాధాకరమని అన్నారు. 34% బీసీ రిజర్వేషన్ అంశానికి రాజ్యాంగ సవరణే శాశ్వత పరిష్కారం అని అభిప్రాయపడ్డారు. తీర్పు అనంతరం సీఎం చంద్రబాబు నాయుడుకు ఆయన లేఖ కూడా రాశారు. తనతో పాటు 14 బీసీ సంఘాలు చంద్రబాబును కోరిన విషయాలను ప్రస్తావించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చర్చించాలని, అన్ని పార్టీలతో కూడిన అఖిలపక్ష బృందాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని కోరారు. కేంద్రంతో చర్చించి బీసీ రాజకీయ రిజర్వేషన్లకు శాశ్వత రాజ్యాంగ పరిష్కారం సాధించాలని విజ్ఞప్తి చేశారు.
కృష్ణయ్య అభిప్రాయం ప్రకారం, కేవలం సుప్రీంకోర్టులో అప్పీల్ చేస్తే ప్రస్తుత రిజర్వేషన్ పరిమితులకు సంబంధించిన న్యాయపరమైన సమస్య మళ్లీ ఎదురవుతుందని ఆయన అన్నారు. అందువల్ల ఈ అంశంపై సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం పునఃపరిశీలించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అలాగే బీసీల జనాభా దేశంలో గణనీయంగా ఉన్నప్పటికీ విద్య, ఉద్యోగాలు, రాజకీయ వ్యవస్థల్లో తగిన ప్రాతినిధ్యం లేదని ఆయన అంటున్నారు. 50% రిజర్వేషన్ పరిమితి బీసీ రాజకీయ రిజర్వేషన్లకు ఎలా వర్తిస్తుంది? అనే అంశాన్ని కూడా ఆయన లేవనెత్తుతున్నారు.
ఇతర బీసీ సంఘాల స్పందన
ఆంధ్రప్రదేశ్ బీసీ అసోసియేషన్ అధ్యక్షుడు కేశన శంకరరావు కూడా ఈ వ్యవహారంలో కోర్టును ఆశ్రయించారు. అయితే ఆయన దాఖలు చేసిన పిల్ లో, బీసీ జనగణన పూర్తయ్యే వరకు స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించవద్దని కోరగా, హైకోర్టు ఆ అభ్యర్థనను తిరస్కరించింది.
మరోవైపు ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ బ్యాక్‌వర్డ్ క్లాసెస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, సీనియర్ సుప్రీంకోర్టు న్యాయవాది వంగల ఈశ్వరయ్య విచారణ సమయంలో 34% రిజర్వేషన్ ప్రస్తుత న్యాయపరమైన ప్రమాణాలతో నిలబడటం కష్టమని వాదించారు. బీసీలకు వారి జనాభా నిష్పత్తికి అనుగుణంగా రిజర్వేషన్ కల్పించేందుకు రాష్ట్ర శాసనసభ ఉభయ సభల్లో తీర్మానాలు చేసి కేంద్రానికి పంపాలని సూచించారు.
మరో బీసీ నాయకుడి భిన్నమైన స్పందన
బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్ మాత్రం ప్రభుత్వం తీసుకున్న 34% నిర్ణయాన్నే ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్లకు బలమైన చట్టపరమైన, శాస్త్రీయ, ఎంపరికల్ ఆధారం ఉండాలని అన్నారు. టీడీపీ, వైఎస్సార్‌సీపీ రెండింటికీ బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించాలనే విషయంలో తగిన రాజకీయ సంకల్పం లేదని ఆయన ఆరోపించారు.
రాజకీయంగా ఎందుకు ముఖ్యమైన అంశం?
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అమలు అంశం రాజకీయంగా అత్యంత కీలకమైనది. స్థానిక సంస్థలు అంటే కేవలం గ్రామ పంచాయతీ లేదా మున్సిపల్ ఎన్నికలు మాత్రమే కావు. వీటిలో సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్‌పీటీసీలు, మండల అధ్యక్షులు, జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్లు, మున్సిపల్ కౌన్సిలర్లు, మేయర్లు, కార్పొరేటర్లు
వంటి వేలాది రాజకీయ పదవులు ఉంటాయి. అందువల్ల బీసీ రిజర్వేషన్ల శాతంలో మార్పు వేలాది స్థానాల సామాజిక పంపిణీపై ప్రభావం చూపవచ్చు. అందుకే ఈ అంశం న్యాయపరమైనదే కాకుండా, గ్రామస్థాయి రాజకీయాల్లో కూడా ప్రాధాన్యం కలిగి ఉంది. రానున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలపై కూడా ఈ అంశం తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశం ఉంది.
NEWS AND REFERANCES AT A GLANCE
https://indiankanoon.org/doc/101935324/?utm
https://indiankanoon.org/doc/53712421/?utm
https://indiankanoon.org/doc/101935324/?utm
https://www.ysrcongress.com/top-stories/bc-quota-gos-political-105332?utm
BY RAVIKANTI SRINIVAS
