వినూత్నం…విప్లవాత్మకం… 3D ప్రింటింగ్ ఇళ్ల నిర్మాణం
Introduction:
3D అనే పదం మనకు చాలాకాలంగా తెలుసు. ముఖ్యంగా సినిమాల్లో ఈ విధానం ప్రవేశపెట్టినప్పుడు అబ్బురంగా చూశాం. ప్రత్యేకంగా ఇచ్చే కళ్లద్దాలను ధరించి చూసినప్పుడు అప్పటివరకు పొందని ఒక కొత్త అనుభూతిని పొందాం. చిత్రం తెరవరకే పరిమితం కాకుండా మన కళ్ల ముందు వరకు వచ్చినట్టు కనిపించడం అందులో ప్రత్యేకత. ముఖ్యంగా యుద్ధం సీన్లలో బాణాలు మనపైకి దూసుకొచ్చినట్లు భ్రాంతి కలుగుతుంది. పాత్ర అడుగులు మనవైపే వస్తున్నట్లు, మన ముందే కదలాడినట్లు అనిపిస్తుంది. సరళంగా చెప్పాలంటే ఇక్కడ దృశ్యం మూడు డైమెన్షన్ల లో కనిపించింది. పొడవు, వెడల్పు రెండు డైమెన్షన్లు అయితే లోతు అనేది మూడో కోణం. ఒక వస్తువును మనం ప్రత్యక్షంగా చూసినప్పడు ముందు భాగమే కాకుండా పక్కభాగాలు, కొంతవరకు వెనుక భాగం కనిపిస్తాయి. రెండు వస్తువుల మధ్య ఉన్న దూరం కూడా అర్థమవుతుంది. అదే దృశ్యాన్ని ఫొటో తీస్తే అందులో పొడవు, వెడల్పులు మాత్రమే కనిపిస్తాయి. దానిని 2D చిత్రం అని అనుకోవచ్చు. అదే చిత్రాన్ని 3Dలో కూడా చూపించే అవకాశం ఇప్పుడు ఉంది. ఇది క్రమంగా వృద్ధి చెందుతూ దీంతో వస్తువులు ప్రింట్ చేసే (తయారుచేసే) సాంకేతికత అందుబాట్లోకి వచ్చింది. జిరాక్స్ మిషిన్‌లో ఒక కాగితం పెడితే దాని ప్రతి బయటికి వచ్చినట్లే …ఒక త్రీడీ డిజైన్ ను కంప్యూటర్లో సిద్ధం చేసి సంబంధిత మెషిన్‌కు ఆదేశం ఇస్తే ఆ వస్తువు తయారై బయటికి వస్తుంది. ఈ విధానాన్ని ఉపయోగించి ఇప్పటికే ఎన్నో ఉత్పత్తులు తయారై మార్కెట్లోకి వస్తున్నాయి. మానవ మేధ అద్భుతం కదా….దీనిని చిన్నవస్తువులకే ఎందుకు పరిమితం చేయాలి? పెద్దవి తయారుచేయలేమా? ఇళ్లు కట్టలేమా? అని శాస్త్రజ్ఞులు పరిశోధించి విజయం సాధించారు. ఇప్పుడు 3D విధానంలో ఇళ్లు కూడా కడుతున్నారు. సరికొత్త సాంకేతిక నైపుణ్యాన్ని అందిపుచ్చుకోవడంలో ఆంధ్రప్రదేశ్ ముందడుగు వేసింది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం (PMAY-G) కింద ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో 177 ఇళ్లను 3D ప్రింటింగ్ విధానంలో నిర్మించబోతున్నారు. ఈ ప్రాజెక్టుకు కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ సుమారు ₹9.44 కోట్లు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ₹4.49 కోట్లు సమకూర్చనున్నాయి. త్రీడీ సాంకేతికతను పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణానికి ఉపయోగించడం దేశంలో ఇదే మొదటిసారి. ఈ నేపథ్యంలో 3D సాంకేతికతను, ప్రభుత్వ ప్రాజెక్టు పూర్వాపరాలు, ప్రయోజనాలు తదితర విషయాలను అర్థం చేసుకునేందుకు ఈ ప్రయత్నం.
ANALYTICAL VIEW
గృహ నిర్మాణ రంగాన్ని మార్చనున్న 3D కాంక్రీట్ ప్రింటింగ్

ఒకప్పుడు కంప్యూటర్లో మాత్రమే కనిపించిన డిజైన్… ఇప్పుడు అదే కంప్యూటర్ ఆదేశాలతో ఇల్లు నిర్మిస్తోంది!
ఒక ఇంటి గోడను నిర్మించడానికి ఇటుకలు, సిమెంట్, ఇసుక తీసుకురావాలి. మేస్త్రీలు వరుసగా ఇటుకలు పేర్చాలి. సిమెంట్ మోర్టార్ వేయాలి. గోడ ఎత్తు పెరుగుతున్న కొద్దీ అదే ప్రక్రియను పునరావృతం చేయాలి. ఇందుకు అనేక మంది కార్మికులు, అనేక రోజుల సమయం అవసరం. కానీ 3D కాంక్రీట్ ప్రింటింగ్‌లో పరిస్థితి భిన్నం. కంప్యూటర్లో ఇంటి డిజైన్‌ను తయారు చేస్తారు. ఆ డిజైన్‌ను ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా చిన్న చిన్న పొరలుగా విభజిస్తారు. అనంతరం భారీ 3D ప్రింటర్‌కు ఆదేశాలు పంపుతారు. ప్రింటర్ ప్రత్యేక కాంక్రీట్ మిశ్రమాన్ని ఒక పొరపై మరొక పొరగా కచ్చితమైన మార్గంలో వేస్తూ గోడలను నిర్మిస్తుంది. అంటే, ఇటుకలను మనుషులు పేర్చడం నుంచి “కాంక్రీట్‌ను కంప్యూటర్ నియంత్రిత యంత్రం ముద్రించడం” వరకు వచ్చిన మార్పే 3D కాంక్రీట్ ప్రింటింగ్ అని చెప్పవచ్చు.
3D ప్రింటింగ్ అంటే ఏమిటి?
సులభంగా చెప్పాలంటే కంప్యూటర్లో తయారు చేసిన మూడు కొలతల (3D) డిజైన్‌ను, ఒక వస్తువుగా పొరలుపొరలుగా తయారు చేసే సాంకేతికతే 3D ప్రింటింగ్. ఇది ఆడిటివ్ మాన్యుఫ్యాక్చరింగ్ అనే అనే పెద్ద సాంకేతిక రంగానికి చెందినది. సాధారణ తయారీ విధానంలో ఒక పెద్ద ముడి పదార్థం నుంచి అవసరం లేని భాగాన్ని కత్తిరించి తొలగిస్తారు. ఉదాహరణకు చెక్క ముక్క నుంచి కుర్చీ తయారు చేయాలంటే చెక్కను కోస్తాం.3D ప్రింటింగ్‌లో మాత్రం దీనికి విరుద్ధంగా ఉంటుంది.ఏ భాగం అవసరమో అక్కడ మాత్రమే పదార్థాన్ని జోడిస్తూ వస్తువును తయారు చేస్తారు. అందుకే దీనిని ఆడిటివ్ మాన్యుఫాక్ఛరింగ్ అంటారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ..3D ప్రింటింగ్ అనేది కంప్యూటర్లో తయారైన డిజైన్‌ను ఆధారంగా చేసుకుని, పదార్థాన్ని తొలగించకుండా అవసరమైన చోట పొరలుగా జోడిస్తూ వస్తువును తయారు చేసే సాంకేతికత. నిర్మాణ రంగంలో అదే సూత్రాన్ని ఉపయోగించి ప్రత్యేక కాంక్రీట్‌ను పొరలుగా ముద్రించి గోడలు, ఇళ్లు, ఇతర నిర్మాణాలను వేగంగా నిర్మించడమే 3D కాంక్రీట్ ప్రింటింగ్ . ఈ విధానంలో మేస్త్రీని పూర్తిగా తొలగించడం కంటే, నిర్మాణ రంగంలో మానవ శ్రమ స్వభావాన్ని మార్చే అవకాశం ఎక్కువ. మేస్త్రీతో పాటు ఇంజనీర్, డిజైనర్, సాఫ్ట్వేర్ నిపుణుడు, మెటీరియల్ సైంటిస్ట్, ప్రింటర్ ఆపరేటర్ వంటి కొత్త నైపుణ్యాల అవసరం పెరుగుతుంది. అందువల్ల ఇది కేవలం ఇల్లు కట్టే కొత్త యంత్రం కాదు…“ఇల్లు కట్టే విధానంలో డిజిటల్ విప్లవానికి తొలి అడుగు అని చెప్పవచ్చు.
3D ప్రింటర్ ఎలా పనిచేస్తుంది?
ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. ఒక చిన్న బొమ్మను తయారు చేయాలి అనుకుందాం.ముందుగా కంప్యూటర్లో ఆ బొమ్మకు సంబంధించిన 3D డిజిటల్ మోడల్ తయారు చేస్తారు. రెండో దశలో సాఫ్ట్వేర్ ఆ 3D మోడల్‌ను వందలు, వేల చిన్న చిన్న పొరలుగా విభజిస్తుంది. దీనిని స్లైసింగ్ అంటారు. మూడో దశలో ప్రింటర్‌కు ఆదేశాలు ఇస్తారు. ప్రతి పొర ఎక్కడ, ఎంత మందంగా, ఎంత వేగంతో వేయాలో కంప్యూటర్ నిర్ణయిస్తుంది. నాలుగో దశ లో ప్రింటర్‌లోని ప్రింట్హెడ్ / నాజిల్ / ఎక్స్ట్రడర్ అవసరమైన పదార్థాన్ని బయటకు పంపుతుంది. ఐదో దశలో మొదటి ఒక పొర పూర్తయిన తర్వాత దాని మీద రెండో పొర, దాని మీద మూడో పొర చొప్పున కొనసాగుతుంది. చివరికి 3D వస్తువు తయారవుతుంది.
మరి ఇంటిని ఎలా ప్రింట్ చేస్తారు?
ఇక్కడే ఈ సాంకేతికత మరింత ఆసక్తికరంగా మారుతుంది. ముందుగా ఇంటి 3D మోడల్‌ను కంప్యూటర్లో తయారు చేస్తారు. అందులో గోడల ఆకారం, మందం, తలుపుల స్థానం, కిటికీల స్థానం, పైపుల కోసం అవసరమైన మార్గాలు, ఇతర నిర్మాణ వివరాలు నిర్ణయిస్తారు. తర్వాత పెద్ద గ్యాంట్రీ టైప్ లేదా రోబోటిక్ ఆర్మ్ 3D ప్రింటర్‌ను నిర్మాణ స్థలంలో ఏర్పాటు చేస్తారు. ప్రత్యేకంగా రూపొందించిన కాంక్రీట్ మిశ్రమాన్ని పంప్ ద్వారా ప్రింటర్‌కు పంపుతారు. ప్రింటర్ నాజిల్ కాంక్రీట్‌ను పొరలు పొరలుగా కిందికి పంపుతుంది. అంటే ఇటుకల మాదిరిగా ఒక్కొక్కటి పెట్టడం కాకుండా, నిరంతర కాంక్రీట్ పొరలను ఒకదానిపై మరొకటి వేస్తూ గోడను నిర్మిస్తుంది. దేశంలో మొదటిసారిగా మద్రాస్ ఐఐటీ 3D ప్రింటింగ్ విధానంలో ఇంటిని నిర్మంచింది. అందులో కూడా ఇదే విధానాన్నిఉపయోగించారు.
అయితే ఇల్లు మొత్తం ప్రింట్ అవుతుందా?

ఈ సందేహం చాలా మందికి వస్తుంది.కానీ త్రీడీ ప్రింటింగ్ విధానంలో ప్రధానంగా గోడలు, స్ట్రక్చరల్ సెల్ మాత్రమే నిర్మిస్తారు. పునాది, రూఫ్,స్లాబ్, డోర్లు, కిటికీలు, వైరింగ్ , ప్లంబింగ్,ఫ్లోరింగ్, పెయింటింగ్, బాత్రూం ఫిట్టింగ్స్ వంటి పనుల్లో సంప్రదాయ లేదా ఇతర నిర్మాణ పద్ధతులు అవసరమవుతాయి.అందుకే 3D ప్రింటింగ్ ఇల్లు అనేది వాస్తవానికి హైబ్రిడ్ నిర్మాణం అని చెప్పవచ్చు. నీతిఆయోగ్ కూడా భారతదేశంలోని 3D నిర్మాణంలో లో సుమారు 30% నిర్మాణ ప్రక్రియ ప్రధానంగా గోడలకు ఉపయోగపడుతుంది, ఎలక్ట్రికల్, ప్లంబింగ్, ఫినిషింగ్ వంటి పనులు సంప్రదాయ పద్ధతుల్లోనే జరుగుతాయని పేర్కొంది.
3D కాంక్రీట్ ప్రింటింగ్ సాంకేతికత ఏమిటి?
3D కాంక్రీట్ ప్రింటింగ్ విధానంలో ప్రధానంగా నాలుగు సాంకేతిక భాగాలు ఉంటాయి.
- CAD/BIM డిజిటల్ డిజైన్
ఇంటి మొత్తం డిజైన్‌ను కంప్యూటర్లో రూపొందిస్తారు.
- స్లైసింగ్ సాఫ్ట్వేర్
ఆ డిజైన్‌ను ప్రింటర్ కు అర్థమయ్యే వేలాది చిన్న పొరలుగా మారుస్తుంది.
- రోబోటిక్/ గ్యాంట్రీ ప్రింటర్
కంప్యూటర్ ఆదేశాల ప్రకారం X-Y-Z దిశల్లో కదులుతూ కాంక్రీట్ వేస్తుంది.
- స్పెషల్ కాంక్రీట్ మిక్స్
సాధారణ కాంక్రీట్‌ను యంత్రంలో పంపితే సరిపోదు. అది నాజిల్ నుంచి సులభంగా బయటకు రావాలి.
తన ఆకారాన్ని నిలుపుకోవాలి. పై పొర బరువును భరించాలి. కింద పొరతో బాగా కలసిపోవావి. సరైన సమయంలో గట్టిపడాలి. కాబట్టి ఈ లక్షణాలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక మిక్స్ డిజైన్ తయారు చేస్తారు.
3D ప్రింటింగ్ సాంకేతికత ఎప్పుడు పుట్టింది?
3D ప్రింటింగ్ అనేది నిన్న మొన్న వచ్చిన సాంకేతికత కాదు. దాని మూలాలు 1970లు–1980లలో ఉన్నాయి.
అమెరికాకు చెందిన ఛార్లెస్ ఛుక్ హల్ 1980లలో స్టీరియో లిథోగ్రఫీ (SLA) సాంకేతికతను అభివృద్ధి చేశారు. 1986లో దానికి పేటెంట్ దాఖలు చేశాడు. 1987లో SLA-1 వాణిజ్యంగా అందుబాటులోకి వచ్చింది. అందువల్ల:
2026 నాటికి 3D ప్రింటింగ్ వాణిజ్య సాంకేతికతకు దాదాపు 39 సంవత్సరాల చరిత్ర ఉంది.2000లలో డెస్క్ టాప్ 3D ప్రింటర్లు రావడంతో సామాన్య వినియోగం పెరిగింది. 2010ల నుంచి 3D ప్రింటింగ్ విస్తృత పారిశ్రామిక వినియోగంలోకి వచ్చింది.
ప్రస్తుతం 3D ప్రింటింగ్ ను ఎక్కడెక్కడ ఉపయోగిస్తున్నారు?
ఇది 3D ప్రింటింగ్ మిషిణ్ అంటే కేవలం బొమ్మలు తయారు చేసే యంత్రం కాదు. ఆటోమొబైల్, విమానరంగం, వైద్యం, దంతవైద్యం, పరిశ్రమలు, వినియోగ వస్తువుల తయారీ, కళలు, విద్య, ఆహారం, బయో ప్రింటింగ్, ఎలక్ట్రానిక్, జ్యువెలరీ, ఫుట్‌వేర్ , రక్షణ రంగాలకు సంబంధించిన అనేక వస్తువులను ఈ విధానంలో ఉత్పత్తి చేస్తున్నాను. కృత్రిమ అవయవాలను కూడా రూపొందిస్తున్నారు.
ప్రధాన ప్రయోజనాలు ఏమిటి?
సంప్రదాయ నిర్మాణంతో పోలిస్తే గోడల నిర్మాణ సమయం గణనీయంగా తగ్గవచ్చు. గోడలను ఇటుకలతో పేర్చే పనిలో మానవ శ్రమ తగ్గుతుంది. అవసరమైన చోట అవసరమైనంత పదార్థాన్ని మాత్రమే ఉపయోగించడం వల్ల వ్యర్థాలు తగ్గే అవకాశం ఉంది. కంప్యూటర్ ఆదేశాలతో నిర్మాణం జరగడం వల్ల కచ్చితత్వం, ఏకరూపత సాధ్యమవుతంది. సంప్రదాయ నిర్మాణంలో క్లిష్టమైన ఆకృతులను సులభంగా రూపొందించవచ్చు. డిజైన్ మార్పులు సులభతరమవుతాయి. తక్కువ శ్రమతో భారీ నిర్మాణాలు చేపట్టవచ్చు పెద్ద సంఖ్యలో ఒకే తరహా ఇళ్లను నిర్మించాల్సిన ప్రభుత్వ పథకాలకు ఇది ప్రత్యేకంగా ఉపయోగపడే అవకాశం ఉంది.
సమస్యలు…సవాళ్లూ ఉన్నాయ్
ఈ సాంకేతికతను పెద్ద ఎత్తున అమలు చేయడంలో అనేక సమస్యలు,సవాళ్లు కూడా ఉన్నాయ.ఇ పెద్ద నిర్మాణాలకు సాధారణ ప్రింటర్ సరిపోదు. భారీ పెట్టుబడి అవసరం. ఎక్కడపడితే అక్కడ లభించే సాధారణ కాంక్రీట్ మిక్స్‌తో ప్రింటింగ్ చేయలేరు. శిక్షణ పొందిన సాంకేతిక సిబ్బంది, స్ట్రక్చరల్ ఇంజినీరింగ్ నిపుణులు అవసరం.సాంప్రదాయ నిర్మాణంలో ఉక్కు రాడ్లను సులభంగా ఏర్పాటు చేస్తారు. 3D ప్రింటింగ్ విధానంలో లో అందుకు ప్రత్యేకంగా డిజైన్ చేయాలి. ప్రతి ప్రాంతంలో ఈ ప్రింటర్‌ను ఉపయోగించలేరు. సైట్ కు భారీ ప్రింటర్ ను తీసుకెళ్లడం, విద్యుత్, కాంక్రీట్ సరఫరా, సైట్ ను సిద్దం చేయడం వంటి పనులు సవాళ్లతో కూడుకున్నవి.
ఏయే దేశాల్లో 3D ప్రింటింగ్ తో ఇళ్లు నిర్మిస్తున్నారు?
3D ప్రింటింగ్ ఇప్పుడు కేవలం ప్రయోగశాల సాంకేతికత కాదు. అనేక దేశాలు సాంకేతికను వినియోగిస్తున్నాయి. అమెరికా, చైనా, భారత్, UAE, జర్మనీ, ఫ్రాన్స్, జపాన్, కెనడా, ఒమన్, నెదర్లాండ్స్, న్యూజిలాండ్, డెన్మార్క్, థాయ్‌లాండ్, సౌదీ అరేబియా తదితరాలు వీటిలో ఉన్నాయి. 35కుపైగా దేశాల్లో ఉపయోగించబడుతున్నాయి. ఇళ్లు మాత్రమే కాకుండా ఆఫీసులు,స్కూళ్లు, ఆసుపత్రులు, గోదాములు, డాటా సెంటర్లు, వంతెనలు వంటి నిర్మాణాలు కూడా చేపట్టారు.
దుబాయ్ 3D నిర్మాణ సాంకేతికను ని ప్రభుత్వ విధానంగా ప్రోత్సహిస్తోంది. 2023లో దుబాయ్ మున్సిపాలిటీ ఒక ప్రయివేట్ విల్లా కోసం 3D ప్రింటింగ్ నిర్మాణానికి అనుమతి జారీ చేసింది. 2030 నాటికి దుబాయ్ లో 25% భవనాలను 3D ప్రింటింగ్ విధానంతో నిర్మించాలన్న లక్ష్యాన్ని ప్రకటించింది. జర్మనీలో 160 చదరపు మీటర్ల రెండు అంతస్తుల రెసిడెన్షియల్ ఇంటిని 3D ప్రింటింగ్ తో నిర్మించారు.
భారతదేశంలో ఎప్పుడు వచ్చింది?
భారతదేశంలో 3D నిర్మాణ సాంకేతికతకు ముఖ్యమైన మైలురాయి 2018. మద్రాస్ ఐఐటీ భారతదేశపు తొలిసారిగా 600 చదరపు అడుగుల ఇంటిని కాంక్రీట్ ప్రింటింగ్ విధానంలో నిర్మించింది. 2021 ఏప్రిల్ 27న ఈ ఇంటిని ప్రారంభించారు. సంప్రదాయ పద్ధతిలో 4–6 నెలలు పట్టే నిర్మాణాన్ని 3D సాంకేతికతతో సుమారు 5 రోజుల్లో పూర్తి చేయగల సామర్థ్యాన్ని ఈ ప్రాజెక్టు ప్రదర్శించింది. తర్వాత పూర్వ విద్యార్థులు స్థాపించిన Tvasta మాన్యుఫాక్చరింగ్ సొల్లూషన్ అనే సంస్థ సాంకేతికతను గృహ నిర్మాణానికి తీసుకువెళ్లింది. మరో 500 చదరపు అడుగుల ఇంటిని చెన్నైలో 21 రోజుల్లో పూర్తి చేసినట్లు Tvasta తన నివేదికలో పేర్కొంది.
కేవలం ఇళ్లేనా…?
భారతదేశంలో 3D సాంకేతికతతో ఇళ్లు మాత్రమే కాకుండా డిఫెన్స్ బంకర్స్, శానిటేషన్ బ్లాక్స్, బస్ షెల్టర్లు, గెస్ట్ హౌసెస్, మౌలిక వసతులు కల్పించే నిర్మాణాలు కూడా చేపట్టారు. డిఫెన్స్ అప్లికేషన్లలో కూడా త్రీడీ ప్రింటింగ్ ఉపయోగించారు. నీతి అయోగ్ వివరాల ప్రకారం అహ్మదాబాద్ లో సైనికుల కోసం రెండస్తుల డ్వెల్లింగ్ యూనిట్‌ను నిర్మించారు. విశాఖ పట్నం, సిక్కిం, మహారాష్ట్ర,అరుణాచల్ ప్రదేశ్, వంటి ప్రాంతాల్లో కూడా డిఫెన్స్, డిజాస్టర్ అప్లికేషన్స్ లో ఈ సాంకేతికతను వినియోగించారు.
ఆంధ్రప్రదేశ్‌లో చారిత్రాత్మక అడుగు
ఇప్పుడు తెలుగు రాష్ట్రాల వైపు వస్తే…ఇక్కడే ఈ సాంకేతికతకు నిజమైన ప్రాధాన్యం ఏర్పడుతోంది. 2026 అక్టోబర్ 4న గుంటూరు జిల్లా బుర్రిపాలెంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో దేశంలో తొలి 3D కాంక్రీట్ ప్రింటింగ్ హౌసింగ్ పైలట్ ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగింది.
ప్రాజెక్టు వివరాలు
అంశం వివరాలు
ప్రదేశం గుంటూరు జిల్లా
గ్రామాలు బుర్రిపాలెం, ఒబులనాయుడుపాలెం
ఇళ్లు 177
పథకం PMAY-G 2.0
అంచనా వ్యయం సుమారు ₹14 కోట్లు
సాంకేతిక సంస్థ CSIR-CBRI,రూర్కీ
లక్ష్యం గ్రామీణ గృహ నిర్మాణంలో సాంకేతికతను పరీక్షించడం
లక్ష్య నిర్మాణ సమయం 6 నెలలు
ఈ ప్రాజెక్టులో 100 ఇళ్లు 25 చదరపు మీటర్ల విస్తీర్ణంలో, 77 ఇళ్లు 32 చదరపు మీటర్ల లో , దివ్యాంగుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని నిర్మించనున్నారు. ప్రతి ఇంటికి మరుగుదొడ్డి ఉంటుంది. ఇది కేవలం 177 ఇళ్ల నిర్మాణం కాదు.భవిష్యత్తులో దేశవ్యాప్తంగా PMAY-G వంటి పథకాలలో 3D ప్రింటింగ్ ను ఉపయోగించడానికి టెక్నికల్ ప్రోటోకాల్స్, నిర్మాణాలకు ఒక దిక్సూచిగా చూపడం కూడా ఈ పైలట్ ప్రాజెక్టు ఉద్దేశం. ఈ ప్రయోగం విజయవంతమైతే తెలంగాణ సహా ఇతర రాష్ట్రాలు ఈ విధానాన్నిఅనుసరించే అవకాశం ఉంది. ప్రయోగం విజయవంతం కావాలంటే…ఈ కింది ప్రశ్నలకు సమాధానాలు రావలసి ఉంది.
① ఎంత వేగంగా నిర్మించగలం?
② ఒక ఇంటి నిర్మాణ ఖర్చు ఎంత తగ్గుతుంది?
③ గోడల బలం ఎంత?
④ 20–30 సంవత్సరాల తర్వాత పనితీరు ఎలా ఉంటుంది?
⑤ ఉష్ణోగ్రత, వర్షాలు, తేమ వంటి భారతీయ వాతావరణ పరిస్థితుల్లో పనితీరు ఎలా ఉంటుంది?
⑥ భూకంప ప్రాంతాల్లో ఎలా ప్రవర్తిస్తుంది?
⑦ రీయిన్స్ఫోర్స్మెంట్ను ఎలా సమర్థవంతంగా అమలు చేయాలి?
⑧ వేలాది ఇళ్లను ఒకేసారి నిర్మించేటప్పుడు సాంకేతికత ఎంతగా ఉపయోగపడుతుంది.
ఈ ప్రశ్నలకు సమాధానాలు సానుకూలంగా వస్తేనే “3D ప్రింటింగ్ పేదల గృహ నిర్మాణానికి విప్లవాత్మక పరిష్కారం” అని చెప్పవచ్చు.
ఖర్చు తగ్గుతుందా?
3D ప్రింటింగ్ విధానంలో ఇల్లు మొత్తం నిర్మించడం కుదరదు. ప్రధానంగా గోడలు మాత్రమే నిర్మించొచ్చు.
పునాది, పైకప్పు, తలుపులు, కిటికీలు, విద్యుత్, ప్లంబింగ్, ఫ్లోరింగ్, పెయింటింగ్ తదితరాలు ఇంకా సాధారణ పద్ధతిలోనే చేయాల్సి ఉంటుంది. అందువల్ల గోడల నిర్మాణ ఖర్చు లోనే ఆదా అయ్యే అవకాశముంది. మిగతా వాటి విషయంలో మార్పేమీ ఉండదు. భారతదేశంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న 3D-కాంక్రీట్ ప్రింటింగ్ ధరల ఆధారంగా, పూర్తయిన చిన్న ఇంటికి ఒక సుమారు అంచనా ఇలా ఉంటుంది.
IN NUMBERS
అంశం 300 చ.అ. 400 చ.అ 500 చ.అ
3D ప్రింటింగ్ ఇల్లు రూ.6–13.5 లక్షలు రూ. 8–18 లక్షలు రూ.10–22.5 లక్షలు
సంప్రదాయ నిర్మాణం రూ.7.5–15 లక్షలు రూ. 10–20 లక్షలు రూ. 12.5–25 లక్షలు
సాధ్యమైన ఆదా సుమారు రూ. 1–2.5 లక్షలు రూ. 3.5 లక్షలు రూ.2.5–5 లక్షలు
శాతం సుమారు 15–25% 15–25% 15–25%
ఇవి సుమారు మార్కెట్ అంచనాలు మాత్రమే. స్థలం, డిజైన్, ఫినిషింగ్ స్థాయి, ప్రింటర్ సైట్ కు చేరవేత, ఫౌండేషన్, నేల స్వభావం, మెటీరియల్ ధరల ఆధారంగా బాగా మారవచ్చు. అందుకే పూర్తి ఇంటిపై 15–25% ఆదా అనేది ప్రస్తుతం మరింత వాస్తవికమైన అంచనా.
NEWS AND REFFERANCES AT A GLANCE
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2318899&lang=1®=3&utm
https://www.nist.gov/additive-manufacturing/what-additive-manufacturing?utm
https://www.tvasta.construction/projects/casestudy/firs3DPrintedHouse?utm
https://www.asme.org/about-asme/engineering-history/landmarks/261-stereolithography?utm
https://www.autodesk.com/content/autodesk/global/en/solutions/3d-printing.html?utm
https://www.tvasta.construction/projects/casestudy/firs3DPrintedHouse?utm
