కేసీఆర్ అఫిడవిట్లు…భూములు పెరిగెనెట్లు?
INTRODUCTION
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు స్థిరాస్తుల గురించి తాజాగా చర్చ జరుగుతోంది. 2004 ఎన్నికల అఫిడవిట్లో తనకు వ్యవసాయ భూములు లేవని ప్రకటించిన చంద్రశేఖర్ రావు 2023 ఎన్నికల సందర్భంగా 53 ఎకరాల వ్యవసాయభూమి ఉన్నట్లు ప్రకటించడాన్ని ప్రస్తావిస్తూ రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. 20 ఏళ్ల వ్యవధిలో ఇంత భూమిని ఎలా సంపాదించారని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబం 1954 నుంచే వందల ఎకరాల భూములు కలిగిన కుటుంబం/జమీందారీ కుటుంబం అని కేటీఆర్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో, కాంగ్రెస్ 2004 నాటి కేసీఆర్ అఫిడవిట్‌ను బయటపెట్టింది.1954 నుంచే వందల ఎకరాలు ఉంటే, 2004 ఎన్నికల అఫిడవిట్లో వ్యవసాయ భూమి లేదు అని ఎందుకు ఉంది? అని విమర్శించింది. ఇది ఎన్నికల సంఘాన్నిమోసం చేయడంకాదా అని వారు నిలదీస్తున్నారు. అయితే బీఆర్ ఎస్ వైపు నుంచి వినిపిస్తున్న వివరణ ఏమిటంటే, పూర్వీకుల/ఉమ్మడి కుటుంబ భూములు తప్పనిసరిగా కేసీఆర్ వ్యక్తిగత పేరులో ఉండాల్సిన అవసరం లేదని, అందువల్ల 2004 అఫిడవిట్లో వ్యక్తిగత యాజమాన్యం నిల్ అని ఉంది అంటే పూర్వీకుల ఆస్తి లేదని నిరూపించదని వారు వాదిస్తున్నారు.
మరోవైపు అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ భూములు, ఆస్తులపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో చంద్రశేఖర్ రావు ఆస్తులు…వివిధ ఎన్నికల సందర్భంగా సమర్పించిన అఫిడవిట్లపై ఒక విశ్లేషణ.
కేసీఆర్ ఎప్పుడెప్పుడు పోటీచేశారు?
కేసీఆర్ 2004లో కరీంనగర్ లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీచేశారు. ఆ తర్వాత 2006, 2008లో జరిగిన ఉప ఎన్నికలో, 2009లో మహబూబ్‌నగర్ ఎంపీస్థానం నుంచి, 2014లో మెదక్ లోక్‌సభ స్థానం నుంచి , గజ్వేల్ అసెంబ్లీనియోజకవర్గం నుంచి పోటీ చేశారు. 2018, 203లలో కూడా గజ్వేల్ నుంచి పోటీచేశారు. 2023లో కామారెడ్డి నుంచి కూడా బరిలోకి దిగారు. ఈ అన్ని ఎన్నికల సందర్భంలో కేసీఆర్ దాఖలు చేసిన అఫిడవిట్ కాపీలు ప్రజలకు అందుబాట్లో ఉన్నాయి. అఫిడవిట్లలో ప్రకటించిన భూముల వివరాలను ఎన్నికల వారీగా పక్కపక్కన పెట్టి చూస్తే కొన్ని ముఖ్యమైన మార్పులు కనిపిస్తున్నాయి. అయితే “తేడా” కనిపించడం మాత్రమే అక్రమం లేదా తప్పుడు అఫిడవిట్‌కు రుజువు కాదు. భూమి కొనుగోలు, హిందూ అన్ డివైడెడ్ ఫ్యామిలీ (HUF) లోకి బదిలీ/నమోదు, భూమి వర్గీకరణ, సర్వే నంబర్ల పునర్విభజన, రికార్డు మార్పులు వంటి కారణాలు కూడా ఉండవచ్చు.
IN NUMBERS
ఎన్నిక వ్యవసాయ భూమి వ్యవసాయేతర భూమి గమనించదగ్గ విషయం
2004 – కరీంనగర్ లోక్‌సభ 0 0 అఫిడవిట్లోవ్యవసాయ, వ్యవసాయేతర రెండూ లేవు
2009 – మహబూబ్‌నగర్ లోక్‌సభ 0 సుమారు 6,440 స్క్వేర్యార్డులు 4,992 + 1,448 స్క్వేర్యార్డులు
2014 – గజ్వేల్/మెదక్ 37.70 ఎకరాలు 2.04 ఎకరాలు యర్రవల్లి వ్యవసాయ భూమి ప్రధాన భాగం
2018 – గజ్వేల్ సుమారు 51.81 ఎకరాలు 2.04 ఎకరాలు 11 వ్యవసాయ భూముల ఎంట్రీలు ; వాటిలో 2 HUF/భార్య పేరుతో
2023 – గజ్వేల్/కామారెడ్డి 53.30 ఎకరాలు 9.365ఎకరాలు వ్యవసాయ భూమి HUFలో; కొత్త వ్యవసాయేతర భూమి కూడా ఉంది
2018లో MyNetaలో ఇండివిడ్యువల్ పార్సిల్ ఏరియాలుగా ఇచ్చిన సంఖ్యలను కలిపితే సుమారు 51.81 ఎకరాలుగా వస్తుంది. కానీ అప్పటి మీడియా రిపోర్టులు దీనిని సాధారణంగా 54 ఎకరాలుగా పేర్కొన్నాయి.
మొత్తంగా చూస్తే వ్యవసాయ భూమిలో పెరుగుదల క్రమం ఇలా ఉంది.
2004: 0 ఎకరాలు
2009: 0 ఎకరాలు
2014: 37.70 ఎకరాలు
2018: ≈51.81ఎకరాలు
2023: 53.30 ఎకరాలు
అలా అలా…భూములు పెరిగాయిలా..
అంటే 2004 అఫిడవిట్లో వ్యవసాయ భూమి ఉన్నట్లు ఎలాంటి డిక్లరేషన్ లేదు. ప్రస్తుత వివాదానికి ఇదే మూలంగా నిలుస్తోంది. 2009లో కూడా వ్యవసాయ భూమి లేనట్లే ఉంది. అయితే వ్యవసాయేతర భూమి కింద మెట్టపల్లి/సిద్దిపేట ప్రాంతంలో 4,992 స్కేర్ యార్డులు, మరో 1,448 స్క్వేర్యార్డుల ఓపెన్ ప్లాట్ ఉన్నట్లు చూపారు.
మొత్తం సుమారు 6,440 స్క్వేర్యార్డులు…అంటే దాదాపు 1.33 ఎకరాలు. 2004 2009 మధ్య వ్యవసాయ భూమి డిక్లరేషన్‌లో లో మార్పు లేదు కానీ 2014లో ఒక్కసారిగా యర్రవల్లి గ్రామం, అప్పటి జగదేవ్‌పూర్ మండలం/గజ్వేల్ పరిధిలోని అనేక సర్వే నంబర్ల కింద 37.70 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు ప్రకటించారు.. ఇక్కడే గణనీయమైన మార్పు కనిపిస్తుంది. అఫిడవిట్లో కొనుగోలు తేదీగా 25-10-2013 పేర్కొన్నారు. కొనుగోలు విలువ ₹91.79 లక్షలు, అభివృద్ధి ఛార్జీలు ₹2.488 కోట్లు, అఫిడవిట్ వ్యాల్యూయేషన్ ₹4.50 కోట్లుగా పేర్కొన్నారు. అదే అఫిడవిట్లో మెట్టపల్లి, సిద్ధిపేటలో 2.04 ఎకరాల వ్యవసాయేతర భూమి ఉన్నట్లుచూపారు. 2018లో వ్యవసాయ భూమి మరింత పెరిగింది. 2014లో 37.70 ఎకరాలుకాగా2018లో 51.81 ఎకరాలుగా చూపారు. అంటే 14.11 ఎకరాల పెరుగుదల కనిపిస్తోంది. అంటే దాదాపు 37.4% పెరుగుదల ఉన్నట్లు లెక్క. అయితే ఇది పూర్తిగా కొత్తగా కొనుగోలు చేసిన భూమి అని చెప్పలేం. 2018 అఫిడవిట్లోనే పాత మరియు కొత్త కొనుగోలు తేదీలు ఉన్నాయి. 2018 గజ్వేల్ అఫిడవిట్‌ను వివరంగా పరిశీలిస్తే వ్యవసాయ భూమికి 11 స్థలాల వివరాలుఉన్నాయి. అన్నింటినికలిపితే కలిపితే 51.81 ఎకరాలుగా తేలుతుంది. ఇందులో చివరి రెండు స్థలాలు కేసీఆర్ భార్య కె.శోభ పేరుతో ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. 2018 అఫిడవిట్ వ్యవసాయ భూమి విలువను ₹6.50 కోట్లుగా, 2.04-ఎకరాల వ్యవసాయేతర భూమి విలువను ₹60 లక్షలుగా పేర్కొంది. కాగా 2023లో వ్యవసాయ భూమి 53.30 ఎకరాలు ఉన్నట్లు చూపారు. కాగా ఇది కేసీఆర్ సెల్ఫ్కాలమ్ కింద కాకుండా హిందూ అన్ డివైడెడ్ ఫ్యామిలీ కాలమ్‌లో ఉండటం గమనార్హం. 2018కి, 2023కి మధ్య అంతరం 1.49 ఎకరాలు. అంటే సుమారు 2.9% పెరుగుదల. కాబట్టి 2014–2018 మధ్య కనిపించే పెరుగుదలతో పోలిస్తే 2018–2023 మధ్య వ్యవసాయ భూమి పరిమాణంలో పెరుగుదల చాలా తక్కువగా ఉంది.కానీ 2023లో మరో ముఖ్యమైన మార్పు కనిపిస్తోంది. వ్యవసాయేతర భూమి 2018లో 2.04 ఎకరాలు కాగా 2023లో 9.365 ఎకరాలుగా చూపారు. అంటే 7.325 ఎకరాలు అదనంగా వచ్చి చేరిందన్నమాట. ఇది సుమారు 359% పెరుగుదల.2023 అఫిడవిట్ ప్రకారం ఈ 9.365 ఎకరాల భూమి సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలంలో ఉంది; 04-06-2022 తేదీన రూ. 25.50 లక్షలతో కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. కాగా ఇటీవల కేసీఆర్ భూములకు సంబంధించి భారతీయ జనతా పార్టీ నాయకుడు, కేంద్రమంత్రి బండి సంజయ్‌కూడా ఒక ఆరోపణ చేశారు. కేసీఆర్ అఫిడవిట్లో 53.30 ఎకరాలు ఉన్నట్లుచూపగా ధరణి ల్యాండ్ రికార్డుల్లో 53 ఎకరాల 31 గుంటలుగా ఉందని, రెండింటి మధ్య 121స్క్వేర్యార్డుల తేడా ఉందని ఆరోపించారు. అయితే ఇది రాజకీయ ఆరోపణ.
అక్రమమేనా?
కేసీఆర్ ఇరవై ఏళ్ల వ్యవధిలో పోటీచేసిన పలు ఎన్నికల సందర్భంగా చూపిన భూముల వివరాల్లో వ్యత్యాసాలు ఉన్న మాట వాస్తవమే. మరి ఇదంతా అక్రమమని చెప్పలేం. ఎందుకంటే అభ్యర్థి వాటిని కొనుగోలు చేసి ఉండవచ్చు. లేదా ఉమ్మడి కుటుంబ ఆస్తి నుంచి బదాలయించుకుని ఉండవచ్చు. లేదా గతంలో వివాదాల్లో ఉన్నభూమి ఆయనకు చెందేలా కోర్టు తీర్పులు వచ్చిఉండవచ్చు. అఫిడవిట్లు ఎక్కెడెక్కడే ఏఆస్తులు ఉన్నాయో చెప్తాయి తప్ప వాటి కొనుగోలుకు డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? రిజిస్ట్రేషన్ విలువ ఎంత, మార్కెట్ విలువ ఎంత, యాజమాన్యం ఎలా మారింది? ఎప్పుడు మారింది? మ్యుటేషన్ ఎప్పుడు జరిగింది, డిక్లరేషన్ తప్పా..ఒప్పా లాంటి వివరాలను అవి వెల్లడించవు. అందువల్ల భూముల పెరుగుదల అక్రమమని చెప్పలేం.
వివాదం ఎక్కడ మొదలైంది?
తెలంగాణలో తాజాగా భూముల వివాదం మొదలైంది. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేసీఆర్ కుటుంబంపై చేసిన ఆరోపణలుప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొత్తం వ్యవహారం ప్రధానంగా ఎన్నికల అఫిడవిట్లు, ఎర్రవల్లి ఫామ్‌హౌస్ చుట్టూ భూమి, 388 ఎకరాల ప్రభుత్వ భూమి ఆరోపణ, కేసీఆర్ కుటుంబం మొత్తం భూముల లెక్కలు అనే నాలుగు అంశాల చుట్టూ తిరుగుతోంది.
సెప్టెంబరు 16న అసెంబ్లీలో సెక్షన్ 22 ఎ , నిషేధిత భూములపై చర్చ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి కేసీఆర్ కుటుంబ భూముల అంశాన్ని ప్రస్తావించారు. కేసీఆర్ కుటుంబానికి సుమారు 67.13 ఎకరాలు, కేసీఆర్ విస్తృత కుటుంబ సభ్యులు, బంధువులకు కలిపి సుమారు 439.30 ఎకరాలు 9 జిల్లాలు, 24 మండలాలు, 31 గ్రామాల్లో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఇందులో కేటీఆర్ కుటుంబానికి 123.19 ఎకరాలు, కవిత కుటుంబానికి 37.26 ఎకరాలు, హరీశ్‌రావు కుటుంబానికి 30.16 ఎకరాలు ఉన్నట్లు సీఎం పేర్కొన్నారు.
మొత్తం సుమారు 700 ఎకరాల విస్తీర్ణం ఎర్రవల్లి ఫామ్‌హౌస్ పరిధిలో ఉన్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. అందులో సుమారు 295 ఎకరాలు రెండు గ్రామాల సరిహద్దుల మధ్య పాత వివాదంలో ఉన్న భూమి.
మరో 388 ఎకరాలు ప్రభుత్వ భూమి అని సీఎం పేర్కొన్నారు. బీఆర్ ఎస్ ప్రభుత్వం ఉన్న సమయంలో ఈ భూములు ఫామ్‌హౌస్ పరిధిలోకి వచ్చాయని ఆయన ఆరోపించారు. అయితే 388 ఎకరాలు నిజంగా ప్రభుత్వ భూమేనా? అవి KCR ఆధీనంలో ఉన్నాయా? అన్నది ఇంకా తేలలేదు. అందుకే ప్రభుత్వం ఇప్పుడు అధికారిక సర్వే, రికార్డుల పరిశీలన చేపట్టింది. 30 రోజుల్లో విచారణ పూర్తి చేయాలని సెప్టెంబరు 16న సీఎం ఆదేశాల మేరకు
కేసీఆర్‌కు నోటీసు ఇవ్వడం, రెవెన్యూ అధికారులు భూములను, ఫామ్‌హౌస్ చుట్టూ ఉన్న సర్వే నంబర్లను పరిశీలించడం ప్రభుత్వ, పట్టా భూములను విడదీయడం, అవసరమైతే ప్రభుత్వ భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవడంవంటి చర్యలు ప్రారంభమయ్యాయి. సెప్టెంబరు 18 నాటికి రెండో రోజు కూడా భూ సర్వే కొనసాగుతోంది. సర్వే నంబరు 325కు సంబంధించిన సుమారు 388 ఎకరాల విషయంలో శాటిలైట్ సర్వే కూడా చేస్తున్నారు. పాత రైతుల పేర్లు, రెవెన్యూ రికార్డులను, తదితరాలను పరిశీలిస్తున్నారు. ఇంకా విచారణ జరుగుతోంది; 388 ఎకరాలు భూమి విషయంలో తుది అధికారిక నివేదిక ఇంకా రాలేదు.
సమాధానం రావాల్సిన ప్రశ్నలెన్నో!
ఈ మొత్తం వివాదంలో అసలు తేలాల్సిన ప్రశ్న “2004లో 0 ఎకరాల నుంచి 2023లో ఎంత భూమి వచ్చింది?” అనే ప్రశ్న ఒక్కటే కాదు. ఇంకా అనేకం ఉన్నాయి. అవి
2014లో ప్రకటించిన 37.70 ఎకరాలకు కు టైటిల్ ఎలా వచ్చింది?
2018లో అదనంగా కనిపిస్తున్న పార్సిల్స్ ఎప్పుడు కొనుగోలు అయ్యాయి?
2023లో 53.30 ఎకరాలను ఎలా లెక్కించారు?
53 ఎకరాల 31గుంటలు మరియు 53.30 ఎకరాల మధ్య ఉన్న కొలత తేడా ఏమిటి?
9.365 ఎకరాల వ్యవసాయేతర భూమి ఎప్పుడు, ఎవరి పేరుతో వచ్చింది?
2023 అఫిడవిట్లో HUF ఓనర్ షిప్‌ను ఎలా చూపించారు?
700 ఎకరాల ఫామ్‌హౌస్ ఆస్తిలో కేసీఆర్ పేరిట ఉన్నది ఎంత? ప్రభుత్వ భూమి ఎంత? ఎంత? అసైన్డ్ ల్యాండ్ ఎంత?
388 ఎకరాల భూమి నిజంగా ప్రభుత్వానిదే అని రెవెన్యూ విచారణ నిర్ధారిస్తుందా? (ప్రస్తుతానికి ఈ ప్రశ్నకు సమాధానం లేదు. సర్వే ఇంకా కొనసాగుతోంది)
NEWS AT A GLANCE
https://www.myneta.info/Telangana2023/candidate.php?candidate_id=81
https://www.myneta.info/ls2014/candidate.php?candidate_id=6830
BY RAVIKANTI SRINIVAS
