Art, Culture & ReligionRecent News

భాగ్య‌న‌గ‌రం…ఆధ్యాత్మిక వైభ‌వం బోనాలు…గ‌ణేశ ఉత్స‌వాల‌తో ప్ర‌త్యేక గుర్తింపు

INTRODUCTION:

హైద‌రాబాద్‌…భాగ్య‌న‌గ‌రం అనేక విధాలుగా దేశంలో ప్ర‌త్యేక‌త సంత‌రించుకుంది. నైజాం ప‌రిపాల‌న‌లోనే అనేక చారిత్ర‌క క‌ట్ట‌డాల‌తో…త‌టాకాల‌తో విల‌సిల్లిన న‌గ‌ర‌మిది.  స‌మ శీతోష్ణ వాతావ‌ర‌ణం, భూకంప ప్ర‌మాదం అతి త‌క్కువ‌గా ఉండ‌టం, అన్ని రాష్ట్రాల వారిని ఆత్మీయంగా అక్కున చేర్చుకునే ప్ర‌జానీకం, హిందూ, ముస్లింల  ఐక్య‌త‌కు ప్ర‌తీక‌గా నిల‌చే ఘ‌న‌మైన సంస్కృతి,  ఈ న‌గ‌రాన్ని ప్ర‌త్యేకంగా నిలుపుతున్నాయి. తాజాగా ఐటీ విప్ల‌వానికి, ఏఐ వికాసానికి, ఫార్మా రంగ వృద్ధికి ఇది కేంద్రంగా విల‌సిల్లుతోంది. చారిత్ర‌కంగానే కాకుండా ఆధ్యాత్మికంగా…సాంస్కృతికంగా ఎన్నో విశేషాల‌కు నెల‌వు ఈ  మ‌హాన‌గ‌రం. ఇక్క‌డ జ‌రిగే వినాయ‌క చవితి, బోనాల ఉత్స‌వాలు అంత‌ర్జాతీయంగా ప్ర‌ఖ్యాతి గాంచాయి.  వాటి గురించి తెలుసుకునేందుకు  ఈ విశ్లేష‌ణ‌.

ANLALYTICAL VIEW:

 వెల్లివిరిసే ఆధ్యాత్మిక శోభ‌

 ఆషాఢం, శ్రావ‌ణం, భాద్ర‌ప‌ద‌ మాసాలు వ‌చ్చాయంటే చాలు హైద‌రాబాద్ వాతావ‌రణం ఒక్క‌సారిగా మారిపోతుంది. అడుగ‌డుగునా ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తుంది. ఆషాఢంలో బోనాల ఉత్స‌వాలు అత్యంత వైభవంగా జ‌రుగుతాయి. వీధివీధినా మ‌హిళ‌లు అమ్మ‌వారికి బోనాలు స‌మ‌ర్పిస్తారు. స్థానిక సంస్థ‌లు, వివిధ ప్ర‌భుత్వ శాఖ‌లు ఇందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తారు. వివిధ రాజ‌కీయ ప‌క్షాల వారు మ‌హిళ‌ల‌ల‌ను స్వాగ‌తిస్తూ..శుభాకాంక్ష‌లు తెలుపుతూ పెద్ద ఎత్తు స్వాగ‌త తోర‌ణాలు, బ్యాన‌ర్లు క‌డ‌తారు.  ఇక శ్రావ‌ణంలో  ప్ర‌తి సోమ‌వారం, శుక్ర‌వారం మ‌హిళ‌ల‌కు ప‌ర్వ‌దిన‌మే. ఈ రోజుల్లో ప్ర‌తి ఆల‌యం కిట‌కిట‌లాడుతుంటుంది. ఇక భాద్ర‌ప‌దంలో వినాయ‌క చ‌వితి వ‌స్తే ఆ సంద‌డే వేరు. అత్యంత పెద్ద ఎత్తున సామాజిక ఉత్స‌వంగా ప‌రిణామం చెంది హైద‌రాబాద్‌కు ప్ర‌పంచ‌ప‌టంలో ప్ర‌త్యేక గుర్తింపు తీసుకువచ్చింది.

 సజీవ సంప్ర‌దాయం ..బోనాలు

 బోనాలు తెలంగాణకు చెందిన అత్యంత ముఖ్యమైన జానపద-ఆధ్యాత్మిక పండుగ. ఆషాఢ మాసంలో జరిగే ఈ ఉత్సవంలో మహాకాళి, ఎల్లమ్మ, పోచమ్మ, మైసమ్మ, పెద్దమ్మ, కట్టమైసమ్మ తదితర గ్రామదేవతలను ఆరాధిస్తారు. ఇంట్లో మహిళలు బియ్యం, పాలు, బెల్లం తదితరాలతో తయారు చేసిన బోనాన్ని కొత్త మట్టి లేదా ఇత్తడి పాత్రలో పెట్టి, పసుపు, కుంకుమ, వేపాకులతో అలంకరించి తలపై మోసుకెళ్లి అమ్మవారికి సమర్పించడం ప్రధాన సంప్రదాయం. బోనాలకు హైదరాబాద్‌లో ప్రత్యేకమైన చారిత్రక కథనం ఉంది. 1813 ప్రాంతంలో హైదరాబాద్–సికింద్రాబాద్ జంట నగరాల్లో అంటువ్యాధి/ప్లేగు వ్యాప్తి చెందినప్పుడు ఉజ్జయినిలోని మహాకాళి అమ్మవారిని ప్రార్థించిన హైదరాబాద్ సైనిక బెటాలియన్ తిరిగి వచ్చి మహాకాళి విగ్రహాన్ని ప్రతిష్ఠించి బోనాలు సమర్పించిందనే విశ్వాసం ఉంది.  తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో బోనాలను రాష్ట్ర పండుగగా గుర్తించింది.  బోనాల్లో మహిళలు కేవలం ప్రేక్షకులు కాదు. ప్రధాన ఆచారాన్ని నిర్వహించే వారు. బోనం మోసే మహిళ, రంగం చెప్పే మహిళ, సంప్రదాయ దుస్తులు ధరించే యువతులు, ఇవన్నీ బోనాల సామాజిక స్వరూపాన్ని ఇతర భారీ పండుగలతో పోలిస్తే భిన్నంగా చేస్తాయి. పోతురాజు, డప్పులు, గటాలు, తొట్టెలు, ఊరేగింపులు, రంగం వంటి సంప్రదాయాలు దీనిని జానపద కళల ప్రదర్శనగా కూడా మార్చాయి. 2025లో సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి ఆలయంలోనే రెండు రోజుల్లో సుమారు 3 లక్షల మంది భక్తులు వస్తారని ఆలయ అధికారులు అంచనా వేశారు. 1,500 మంది పోలీసులు, వాలంటీర్లు, కళాశాలలు–ఎన్జీవోల నుంచి వచ్చిన సిబ్బందిని బందోబస్తుకు వినియోగించారు. 2026లో కూడా బోనాల ఉత్స‌వాలు అత్యంత వైభ‌వంగా జ‌రిగాయి. బోనాలు ఇప్పుడు ఇంటి పూజ నుంచి భారీ నగర ఉత్సవంగా పరిణామం చెందాయి.

వినాయ‌క ఉత్స‌వాల విశ్వ‌రూపం

గణేశ్ చతుర్థి దేశవ్యాప్తంగా జరిగే పండుగ అయినప్పటికీ హైదరాబాద్‌లో అది ప్ర‌జ‌ల భాగ‌స్వామ్యంతో  ప్ర‌జా  ప‌ర్వ‌దినంగా రూపాంత‌రం చెందింది. హైదరాబాద్‌లో గణేశ్ ఉత్సవాలు ప్రజా స్థాయిలో పెద్ద ఎత్తున విస్తరించడంలో భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి కీలక పాత్ర పోషించింది. సమితి స్వయంగా అందిస్తున్న వివరాల ప్రకారం, 1980లో సుమారు 1,500 గణేశ్ మండపాలతో ప్రారంభమైన సామూహిక ఉత్సవాలు, తరువాతి దశల్లో నగరవ్యాప్తంగా వేలాది మండపాలకు విస్తరించాయి. 2011 నాటికి దాదాపు 50,000 మండపాలు ఉన్నాయని సమితి పేర్కొంటోంది.  సమితి కేవలం ఉత్సవ నిర్వహణకే పరిమితం కాకుండా, ప్రభుత్వంలోని వివిధ శాఖలతో సమన్వయం చేయడం, నిమజ్జన ఏర్పాట్లలో సహకరించడం, మండపాల నిర్వాహకులకు మార్గదర్శకత్వం ఇవ్వడం వంటి బాధ్యతలు చేపట్టినట్లు చెబుతోంది. సమితి ప్రకారం, ఉత్సవాల నిర్వహణలో 17 ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేస్తుంది. సమితి లక్ష్యాల్లో గణేశ్ ఆరాధనతో పాటు ఆధ్యాత్మిక చైతన్యం, భారతీయ సంస్కృతి పరిరక్షణ, ప్రజలను సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ఏకం చేయడం ఉన్నాయి. గణేశ్ ఉత్సవాల్లో స్థానిక గణేశ్ మండళ్లు, ఉత్సవ సమితులు, యువజన సంఘాలు, వ్యాపార సంఘాలు, కాలనీ సంఘాలు కలిసి పనిచేస్తాయి. మండ‌పం ఏర్పాటు, విగ్రహం తీసుకురావడం, అలంకరణ, భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలు, అన్నదానం, రక్తదాన శిబిరాలు, ట్రాఫిక్ సహాయం, నిమజ్జన ఏర్పాట్లు వంటి పనుల్లో యువత భాగస్వామ్యం చాలా ఎక్కువ‌గా ఉంటుంది.  భక్తి, ఆధ్యాత్మిక చైతన్యం, సాంస్కృతిక పరిరక్షణ, ప్రజల ఐక్యతల‌ను త‌మ ల‌క్ష్యాలుగా గ‌ణేశ్ ఉత్స‌వ స‌మితి పేర్కొంది.

 ఖైరతాబాద్ గణేశుడి ప్రత్యేక చరిత్ర

 ఖైరతాబాద్ గణేశ్ చరిత్ర  మ‌రింత ప్ర‌త్యేకం. 1954లో స్వాతంత్య్ర‌ సమరయోధుడు, మాజీ కార్పొరేటర్ సింగరి శంకరయ్య ఖైరతాబాద్‌లో కేవలం ఒక అడుగు ఎత్తైన గణేశ్ విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. బాల గంగాధర్ తిలక్ 1893లో ప్రజల ఐక్యత కోసం గణేశ్ ఉత్సవాలను సామూహికంగా నిర్వహించాలని ఇచ్చిన పిలుపు ఆయ‌న‌కు స్ఫూర్తినిచ్చిందని నిర్వాహక కుటుంబం చెబుతోంది.  ఆ చిన్న విగ్రహం కాలక్రమంలో హైదరాబాద్ గణేశ్ ఉత్సవాలకు ప్రతీకగా మారింది. విగ్రహం ఎత్తు ఏటా పెంచుతూ వచ్చారు. 2014లో 60 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. 2019లో సుమారు 61–65 అడుగుల ఎత్తుతో భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ఖైరతాబాద్ గణేశ్ దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందాడు.  అయితే భారీ విగ్రహాన్ని హుస్సేన్‌సాగర్‌కు తరలించి నిమజ్జనం చేయడంలో ఎదురయ్యే రవాణా, విద్యుత్ లైన్లు, రహదారులు, క్రేన్లు తదితర సమస్యల కారణంగా కొన్ని సంవత్సరాల్లో ఎత్తును తగ్గిస్తూ వ‌స్తున్నారు.. 2023లో 63 అడుగుల పర్యావరణహిత మట్టి గణేశుడిని ఏర్పాటు చేశారు. దాదాపు 80 రోజులపాటు విగ్రహ నిర్మాణం జరిగినట్లు నిర్వాహకులు తెలిపారు.  శంకరయ్య తర్వాత ఆయన కుటుంబ సభ్యులు, ముఖ్యంగా ఆయన సోదరుడు సింగరి సుదర్శన్ ఈ సంప్రదాయాన్ని కొనసాగించారు. 1994 నుంచి సుదర్శన్ కీలక బాధ్యతలు నిర్వహించారు. ఆయన తర్వాత తదుపరి తరం కూడా ఉత్సవ నిర్వహణలో కొనసాగుతోంది.

 ప‌ర్వ‌దినం…వివిధ వ‌ర్గాల‌కు ఆర్థిక ప్ర‌యోజనం…

 హిందూ ప‌ర్వ‌దినాల‌ను సామాజిక‌, ఆర్థిక కోణాల్లో కూడా చూడ‌వ‌చ్చు. డ‌బ్బు ఒక‌రి నుంచి మ‌రొక‌రికి చేరిన‌ప్పుడే ఆర్థిక వ్య‌వ‌స్థ పురోగ‌మిస్తుంద‌నేది ఒక సిద్ధాంతం.  సంప‌ద కొంత మంది చేతుల్లో బందీ అయితే ఒక ప్ర‌తిష్టంభ‌న ఏర్ప‌డుతుంది.  హిందువుల‌కు సంబంధించి ఏ పండుగ‌ను తీసుకున్నా వివిధ వ‌ర్గాల‌కు ఆర్థిక ప్ర‌యోజ‌నం చేకూరుతుంద‌న‌డంలో సందేహం లేదు. ఉదాహ‌ర‌ణ‌కు వినాయ‌క చవితిని ఇళ్ల‌లోనే చేసుకున్న‌ప్ప‌టికీ విగ్ర‌హం త‌యారీదారులకు, పూలు, ఆకులు, అలంకార సామ‌గ్రి, స‌రుకుల విక్ర‌యదారుల‌కు వ్యాపారం జ‌రుగుతుంది. అలా ఆయా వ‌ర్గాల వారు ల‌బ్ధి పొందుతారు. ఉత్స‌వాలు సామాజికం అయిన త‌ర్వాత ఇలా ప్ర‌యోజ‌నం పొందుతున్న వారి సంఖ్య బాగా పెరుగుతోంది. భారీ విగ్ర‌హాల త‌యారీ దారులు, మండ‌పాలు వేసే వారు, ఎల‌క్ట్రీషియ‌న్లు, అలంక‌ర‌ణ నిపుణులు, టెంట్ హౌసుల వారు, బ్యాండుమేళాల వారు, క‌వులు, గాయ‌కులు, క‌ళాకారులు, ప్ర‌వ‌చ‌న క‌ర్త‌లు, వంట‌వారు, కిరాణా దుకాణాల వారు, ఫ్లెక్సీల డిజైన‌ర్లు, త‌యారీ దారులు, ద‌ర్జీలు, వివిధ ర‌కాల వాహ‌నాల య‌జ‌మానులు, క్రేన్ల నిర్వాహ‌కులు,పూలు,  పూజా సామ‌గ్రి  విక్ర‌య‌దారులు, , పారిశుద్ధ్య కార్మికులు…ఎన్నో వ‌ర్గాల వారికి ఉపాధి ల‌భిస్తుంది.  2025లో హైదరాబాద్ గణేశ్ ఉత్సవాల వల్ల రూ.650 కోట్లకు పైగా వ్యాపార కార్యకలాపాలు జరిగాయని నగర అధికారుల అంచనా. ఒక్క‌ ధూల్‌పేట్ ప్రాంతంలోనే సుమారు రూ.50 కోట్ల వ్యాపారం జరిగినట్లు తెలుస్తోంది. ఇక దేశవ్యాప్తంగా 2025 గణేశ్ ఉత్సవాలపై  సుమారు 20 లక్షల గణేశ్ మండ‌పాలు ఉండగా, ఒక్కో దానికి  కనీసం రూ.50,000 ఖర్చు అవుతుందంటూ బిజినెస్ టుడే పరిశ్రమ నిపుణుల అంచనాలను ఉటంకించింది. దాంతో దేశవ్యాప్తంగా  ఏర్పాట్లు, అలంకరణ, పూజా సామగ్రి తదితరాలపై రూ.10,000 కోట్లకు పైగా ఖర్చు అవుతుందని పేర్కొంది.   గణేశ్ విగ్రహాల తయారీలో ధూల్‌పేట్ హైదరాబాద్‌కు ప్రధాన కేంద్రంగా ఉంది. 2025లో అక్కడి కళాకారులు సంవత్సరానికి సుమారు 30,000 గణేశ్ విగ్రహాలు తయారు చేస్తున్నారని  తెలంగాణ టుడే పేర్కొంది.  ఇక బోనాల సమయంలో  మట్టి బోనం పాత్రలు తయారు చేసేవారు, పూల వ్యాపారులు, పూజా సామగ్రి విక్రేతలు, చీరలు, ఆభరణాల వ్యాపారులు, డప్పు కళాకారులు,  పోతురాజు బృందాలు, అలంకరణ కార్మికులు, విద్యుత్/లైటింగ్ సిబ్బంది, రవాణా, ఆహారం, ప్రసాదం ఫోటోగ్రఫీ, వీడియో , పారిశుద్ధ్య కార్మికులు,  భద్రతా సిబ్బంది వంటి అనేక వర్గాలకు తాత్కాలిక ఉపాధి లభిస్తుంది. అంటే శాశ్వ‌త ఉపాధి క‌న్నా సీజ‌న‌ల్ ఎంప్లాయిమెంట్ సృష్టిలో ఈ రెండు పండుగ‌లు ప్ర‌ధాన పాత్ర పోషిస్తున్నాయ‌ని చెప్ప‌వ‌చ్చు. అయితే పండుగల వల్ల ప్రైవేటు రంగంలో వ్యాపారం పెరుగుతున్నప్పటికీ, ప్రభుత్వానికి కూడా భారీ నిర్వహణ వ్యయం ఉంటుంది. ఉదాహరణకు 2025 బోనాల నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం రూ.20 కోట్లు కేటాయించింది. 2026లో కూడా బోనాల ఏర్పాట్లకు అదనపు నిధులు కేటాయించినట్లు, విద్యుత్, నీరు, వైద్యం, అగ్నిమాపక, జీహెచ్ఎంసీ, రోడ్లు, ప్రత్యేక బస్సులు తదితర శాఖలు సమన్వయంతో పనిచేయాలని ప్రభుత్వం ఆదేశించినట్లు వార్తలు వచ్చాయి.

 వార‌స‌త్వం బ‌లోపేతం

 తెలంగాణ పర్యాటక శాఖ ప్రకారం ఈ ప్రాంతానికి వేల సంవత్సరాల సాంస్కృతిక చరిత్ర ఉంది. కాకతీయులు, కుతుబ్‌షాహీలు, ఆసఫ్‌జాహీల కాలాల్లో వివిధ కళలు, భాషలు, ఆహారం, వస్త్రాలు, సంగీతం, చిత్రకళలు అభివృద్ధి చెందాయి. బోనాలు ఈ వారసత్వంలో జానపద భాగాన్ని బలంగా ప్రతిబింబిస్తాయి. పోతురాజు, డప్పు, బోనం, గటాం, రంగం, తొట్టెలు, జానపద గీతాలు, మహిళల సంప్రదాయ దుస్తులు—ఇవన్నీ ఒక రకంగా సాంస్కృతిక వార‌స‌త్వమ‌ని చెప్ప‌వ‌చ్చు.  అంటే మ్యూజియంలో భద్రపరిచినట్లు కాకుండా  ప్రతి సంవత్సరం ప్రజలే తిరిగి ప్రదర్శించే స‌జీవ‌మైన  సంస్కృతిగా వీటిని చూడవచ్చు.

స్వాతంత్య్రోద్య‌మ కాలంలో బ్రిటిష్ వారి వివిధ ఆంక్ష‌ల మ‌ధ్య ప్ర‌జ‌ల‌ను ఒక్క చోటికి చేర్చేందుకు, వారిలో దేశ‌భ‌క్తిని, చైత‌న్యాన్ని పెంపొందించేందుకు  బాల గంగాధ‌ర్ తిల‌క్  గ‌ణేశ్ ఉత్స‌వాల‌ను సామాజిక ఉత్స‌వాలుగా మ‌ల‌చిన‌ట్లు చరిత్ర చెపుతోంది. అలా దైవ‌భ‌క్తి,తో దేశ‌భ‌క్తి మిళిత‌మై స్వ‌తంత్ర పోరాటం విస్తృత‌మైంది. ఆ త‌ర్వాత ఈ సామాజిక ధోర‌ణి మ‌హారాష్ట్ర నుంచి వివిధ రాష్ట్రాల‌కు విస్త‌రించి కొన‌సాగుతోంది. ఈ క్ర‌మంలో హిందువుల‌ను ఏక‌త్రితం చేయ‌డం, వారిలో ఐక‌మ‌త్యాన్ని సాధించడానికి ఇవి దోహ‌ద‌ప‌డుతున్నాయి. రాష్ట్రీయ స్వ‌యంసేవ‌క్ సంఘ్‌, విశ్వ హిందూ ప‌రిష‌త్‌, ధ‌ర్మ‌జాగ‌ర‌ణ స‌మితి లాంటి వాటి ప్రేర‌ణ‌తో , స‌హ‌కారంతో భాగ్య‌న‌గ‌ర్ గ‌ణేశ్ ఉత్స‌వ స‌మితి ఏర్ప‌డి ఈ ల‌క్ష్య సాధ‌న‌కు కృషి చేస్తోంది. వేలాది మంట‌పాల వారి మ‌ధ్య ఒక వార‌ధిలా ఉంటూ వేడుక‌లు స‌వ్యంగా, భ‌వ్యంగా సాగ‌డానికి ప్ర‌య‌త్నిస్తోంది. ప్ర‌ణాళిక నుంచి మొద‌లుకొని  ప‌రిస‌మాప్త‌మ‌య్యే వ‌ర‌కు స‌మ‌న్వ‌యంతో ముందుకు సాగుతోంది. ప్రజలను సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా ఏకం చేయడ‌మే త‌మ లక్ష్య‌మ‌ని ప్ర‌క‌టించే భాగ్య‌న‌గ‌ర్ గ‌ణేశ్ ఉత్స‌వ స‌మితి  వివిధ ప్రాంతాల్లో వేదిక‌లు, స్వాగ‌త తోర‌ణాలు ఏర్పాటు  చేయ‌డం, మంచినీళ్లు, ప్ర‌సాదాలు వంటివి స‌మ‌కూర్చ‌డం, ఆధ్యాత్మిక వేత్త‌లు, హిందూ నేతలు, ప్ర‌ముఖుల‌తో ప్ర‌సంగా లు ఏ ర్పాటుచేయ‌డం మొద‌లుకొని అన్ని ప‌నుల‌ను త‌న భుజాల‌పై వేసుకుని నిర్వ‌హిస్తోంది. ప్ర‌భుత్వం కూడా అన్ని ఏర్పాట్లు చేసేలా చూస్తోంది. ప‌ర్యావ‌ర‌ణం ప‌రంగానూ ప్ర‌భుత్వం పెట్టే నిబంధ‌న‌లు అమల‌య్యేలా సూచ‌న‌లు జారీ చేస్తోంది.

వివిధ వ‌ర్గాల‌కు చెందిన యువ‌త‌, మ‌హిళ‌లు కాషాయ జెండాలు ధ‌రించి నిమ‌జ్జ‌నోత్స‌వం రోజు  ప్ర‌ద‌ర్శ‌న హిందూ శ‌క్తిని ప్ర‌పంచానికి చాటుతుంద‌ని చెప్ప‌వ‌చ్చు. అన్నదానం, రక్తదానం, వైద్య శిబిరాలు, నీటి పంపిణీ, ట్రాఫిక్ సహాయం వంటి కార్యక్రమాలకు కూడా ఈ పండుగ దోహ‌దం చేస్తుంది.

 పర్యావరణ సమస్య 

 వినాయ‌క ఉత్స‌వాల్లో అతి పెద్ద విగ్ర‌హాల‌ను ప్ర‌తిష్టించ‌డం, వాటిలో చాలా మ‌ట్టుకు ప్లాస్ట‌ర్ ఆఫ్ ప్యారిస్‌తో త‌యారైన‌వి కావ‌డంతో నిమజ్జ‌నం కార‌ణంగా కాలుష్యం పెరుగుతోంద‌నే వాద‌న ఉంది. అందువ‌ల్ ప్లాస్ట‌ర్ ఆఫ్ ప్యారిస్ విగ్ర‌హాల స్థానంలో మ‌ట్టి విగ్ర‌హాల స్థాప‌న జ‌రిగేలా వివిధ సామాజిక సంస్థ‌లు కృషి చేస్తున్నాయి. అలాగే  భారీ  మండ‌పాలు, ఊరేగింపులు ప్రజా రహదారులను ఆక్ర‌మించ‌డంతో ట్రాఫిక్ స‌మ‌స్య‌లు, శ‌బ్ద కాలుష్యం పెరిగిపోతున్నాయే ఆందోళ‌న కూడా వ్య‌క్త‌మ‌వుతోంది. ఈ నేప‌థ్యంలోనే

2025లో తెలంగాణ హైకోర్టు గణేశ్ మండ‌పాలుట్రాఫిక్‌కు, ఆసుపత్రులు/అత్యవసర మార్గాలకు అడ్డంకిగా ఉండకూడదని, శబ్ద వ్యవస్థలపై పరిమితులు పాటించాలని మార్గ‌ద‌ర్శ‌కాలు ఇచ్చింది.  వీటిని పాటిస్తూ…ప‌ర్య‌వ‌ర‌ణానికి , ప్ర‌జా జీవ‌నానికి ఇబ్బందులు త‌లెత్త‌కుండా ప‌ర్వ‌దినాల‌ను నిర్వ‌హించుకోవ‌డం అన్ని విధాలుగా శ్రేయ‌స్క‌రం.

   By Numbers:

ఖైరతాబాద్‌ గణేశ్‌ — ముఖ్య సంఖ్యలు

  • 1954 — ఖైరతాబాద్‌లో గణేశ్‌ ఉత్సవానికి శ్రీకారం.
  • ప్రారంభ విగ్రహం ఎత్తు — 1 అడుగు.
  • 201460 అడుగుల విగ్రహం.
  • 202363 అడుగుల పర్యావరణహిత మట్టి గణేశ్‌ విగ్రహం.
  • విగ్రహ నిర్మాణానికి — సుమారు 80 రోజులు.

హైద‌రాబాద్ లో వినాయ‌క ఉత్స‌వాల తీరు

1980 → 1,500 మండపాలు
2011 → 50,000 మండపాలు
2025 → రూ.650 కోట్లకు పైగా గణేశ్‌ ఉత్సవ వ్యాపారం
2025 → రూ.20 కోట్ల బోనాల ప్రభుత్వ కేటాయింపు
2025 → 3 లక్షలకు పైగా ఉజ్జయిని మహాకాళి ఆలయ భక్తులు

 Official Sources:

 https://hyderabad.telangana.gov.in/festival/bonalu/?utm

https://www.incredibleindia.gov.in/en/festivals-and-events/telangana/bonalu?utm

https://tourism.telangana.gov.in/experience/culture-history?utm

https://hyderabad.telangana.gov.in/culture-heritage/?utm

https://newsonair.gov.in/over-2-lakh-ganesh-idols-immersed-in-various-lakes-in-hyderabad-telangana/?utm

https://medak.telangana.gov.in/festival/ganesh-chaturthi/?utm

https://www.ghmc.gov.in/Mutation_Report.aspx/Menu_Files/Documents/Menu_Files/Trade%20License%20Fee%20rates.pdf?utm

https://www.obnews.co/Index/newsDetail/id/11897863.html?val=6b4fb99e11a30ec21cb5cb4c39ca6bdb&utm

https://www.businesstoday.in/india/story/indias-biggest-economic-influencer-powers-rs-45000-cr-economy-in-2025-expert-reveals-sector-wise-impact-492882-2025-09-06

https://www.tenderdetail.com/Indian-Tenders/TenderNotice/50720819/abfedf141bc78f71f0a516854da3bb79

https://bhagyanagarganesh.com/samithi-year-wise-details

Academic Insights:

https://utsav.gov.in/view-event/bonalu-1

News at a Glance:

https://www.deccanchronicle.com/southern-states/telangana/explainer-what-is-bonalu-telanganas-iconic-festival-1972447   

https://www.thecollector.com/ganesha-chaturthi-hindu-festival/  

 On our Reading List:

https://www.chivukulas.com/2019/07/bonalu-festival-celebrations-in-hyderabad.html

https://epaper.andhrajyothy.com/article/Hyderabad_Main_II?OrgId=148ca39cbf4&eid=224&imageview=1&device=desktop

https://hyderabad.telangana.gov.in/festival/bonalu/?utm

https://www.incredibleindia.gov.in/en/festivals-and-events/telangana/bonalu?utm

https://tourism.telangana.gov.in/experience/culture-history?utm

https://hyderabad.telangana.gov.in/culture-heritage/?utm

https://newsonair.gov.in/over-2-lakh-ganesh-idols-immersed-in-various-lakes-in-hyderabad-telangana/?utm

https://medak.telangana.gov.in/festival/ganesh-chaturthi/?utm

https://www.ghmc.gov.in/Mutation_Report.aspx/Menu_Files/Documents/Menu_Files/Trade%20License%20Fee%20rates.pdf?utm

https://www.obnews.co/Index/newsDetail/id/11897863.html?val=6b4fb99e11a30ec21cb5cb4c39ca6bdb&utm

https://www.businesstoday.in/india/story/indias-biggest-economic-influencer-powers-rs-45000-cr-economy-in-2025-expert-reveals-sector-wise-impact-492882-2025-09-06

https://www.tenderdetail.com/Indian-Tenders/TenderNotice/50720819/abfedf141bc78f71f0a516854da3bb79

https://bhagyanagarganesh.com/samithi-year-wise-details

https://utsav.gov.in/view-event/bonalu-1   

https://www.deccanchronicle.com/southern-states/telangana/explainer-what-is-bonalu-telanganas-iconic-festival-1972447  

https://www.thecollector.com/ganesha-chaturthi-hindu-festival/   

https://www.chivukulas.com/2019/07/bonalu-festival-celebrations-in-hyderabad.html

https://epaper.andhrajyothy.com/article/Hyderabad_Main_II?OrgId=148ca39cbf4&eid=224&imageview=1&device=desktop

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *