NewsNews from StatesPopular NewsRecent NewsTelanganaTrending News

పాలమూరు యోధుడు పండగ సాయన్న

ఎంద‌రో పోరాట యోధులను క‌న్న గ‌డ్డ తెలంగాణ‌. కొమురం భీం, స‌ర్దార్ పాప‌న్న‌గౌడ్‌, దొడ్డి కొముర‌య్య‌  చాక‌లి ఐల‌మ్మ‌…ఇలా ఎంద‌రెంద‌రినో నేటికీ తెలంగాణ త‌ల‌చుకుంటోంది. ఈ క్ర‌మంలో ప్ర‌భుత్వం గుర్తించిన  మ‌రో ప్ర‌జా యోధుడు పండ‌గ సాయ‌న్న‌. పాల‌మూరు బిడ్డ‌ల‌కు సుప‌రిచిత‌మైన ఈయ‌న చ‌రిత్ర ఇప్పుడు అంద‌రి దృష్టికి వ‌చ్చింది. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన    174వ జయంతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి పాల్గొని పండగ సాయన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.  ఆయ‌న‌పై రూపొందించిన పాటలను కూడా ఆవిష్కరించారు.  పండగ సాయన్న, దొడ్డి కొమురయ్యల‌ విగ్రహాలను ట్యాంక్‌బండ్ పరిసరాల్లో ఏర్పాటు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి ప్రకటించారు.  26 ఆగస్టు 20న జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వు ప్రకారం, పండగ సాయన్న జయంతిని ప్రతి సంవత్సరం అక్టోబర్ 22న, వర్ధంతిని డిసెంబర్ 10న రాష్ట్ర ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలుగా నిర్వహించాలని నిర్ణయించారు. అన్ని జిల్లాల కలెక్టర్లు ఈ వేడుకలను నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దాంతో ఆయ‌న చ‌రిత్ర‌పై ఆసక్తి పెరిగింది. ఆ విష‌యాల‌ను తెలుసుకుందాం.

ధిక్కార స్వ‌రం…

పండగ సాయ‌న్న ఒక ధిక్కార స్వ‌రం. వెట్టి చాకిరీకి వ్య‌తిరేకంగా ఎలుగెత్తిన గ‌ళం. నిరంకుల నిజాం పాల‌న‌ను వ్య‌తిరేకించి పిడికిలి బిగించిన యోధుడు. అరాచ‌కాల‌కు ఎదురొడ్డి  ఆత్మగౌరవ దివిటీగా వెలిగిన ప్రజా యోధుడు  భూస్వాముల గోడుములను బద్దలుకొట్టి ఆకలితో అలమటించిన పేదల కడుపు నింపిన  విప్లవ వీరుడు ఆయన.  పాలమూరు గడ్డపై గర్జించిన ఈ రాబిన్‌హుడ్ జీవిత చరిత్ర పుటల్లో మరుగునపడినా, జానపదుల గుండెల్లో పాటై నేటికీ సజీవంగా నిలిచింది.

పేరు వెన‌క గాథ‌

మహబూబ్‌నగర్ జిల్లా నవాబుపేట మండలం మెరుగోనిపల్లెలో సాయమ్మ, అనంతయ్య దంపతులకు 1852 అక్టోబర్ 22న దసరా, మొహర్రం పండుగలు ఒకే రోజు వచ్చిన శుభముహూర్తంలో సాయన్న జన్మించాడు. అందుకే ఆయనకు ‘పండుగ సాయన్న’ అని  పేరు పెట్టార‌ని ప్రాచుర్యంలో ఉంది. ఆయ‌న దేహ దారుఢ్యం, వీర‌త్వం గురించి కూడా ప్ర‌జ‌లు క‌థ‌లు క‌థ‌లుగా చెప్పుకొంటారు. పులి ఎదురుప‌డ్డా త‌ల‌ప‌డ‌గ‌ల‌డ‌ని, గుర్రాల‌తో స‌మానంగా ప‌రుగెత్త‌గ‌ల‌డ‌ని చెప్పుకొంటారు. త‌మ కుటుంబానికి దొర‌ల కుటుంబం చేసిన అన్యాయాన్ని స‌హించ‌లేక తిరుగుబాటు బావుటా  ఎగ‌ర‌వేశాడ‌ని తెలుస్తోంది. నవాబుపేట, మద్దూరు, పర్వతాపురం తదితర ప్రాంతాలను కేంద్రంగా చేసుకుని సొంతంగా సాయుధ దళాన్ని నిర్మించి, నిజాం సేనలకు, గడీల పెత్తందార్లకు  ఎదురొడ్డి పోరాడారు.

ప్ర‌జ‌ల క‌న్నీళ్లు తుడిచేందుకే..

అన్యాయాల‌ను ఎదుర్కోవ‌డ‌మే కాదు…ఆప‌న్నుల‌ను ఆదుకోవ‌డంలోనూ సాయ‌న్న‌ముందుండే వారు. ఆయ‌న పోరాటం సంపద కోసం కాదు, పీడిత కన్నీళ్లు తుడవడం కోసమే సాగింది. తీవ్ర కరువు పరిస్థితుల్లో ప్రజలు పిట్టల్లా రాలుతుంటే, దొరలు దాచిపెట్టిన ధాన్యాగారాలను బద్దలుకొట్టడం, బందిపోటు దొంగల్ని తరిమించి పేదవాళ్లకు పంచడం ఆయన మార్గం. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం, నిరుపేదల ఆడబిడ్డల పెళ్లిళ్లు జరిపించడం వంటి పనులతో పేదల దృష్టిలో ఆయన దేవుడయ్యాడు. అందుకే  బడుగు బలహీన వర్గాల దృష్టిలో  ‘రాబిన్‌హుడ్’గా నిలిచాడు.

ఉత్త‌ర్వుల‌ను మార్చి ఊపిరి తీశారు..

సాయన్నకు పెరుగుతున్న ప్రజాదరణను జీర్ణించుకోలేని పెత్తందార్లు నిజాం అధికారులతో కుమ్మక్కై కుట్రతో బంధించారు. అయితే వేలాది మంది ప్రజలు జైలు ముట్టడికి దిగడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. పసవట్టి రాణి శంకరమ్మ సహకారం చేసుకుని నిజాం వద్దకు వెళ్లి విడుదల ఉత్తర్వులు తెప్పించారు. అయితే, ఆ ఉత్తర్వుల్లో ఉన్న ‘మారో మత్, ఛోడో’ (చంపవద్దు, వదిలేయండి) అనే వాక్యాన్ని దొరలు కుట్రపూరితంగా ‘మారో, మత్ ఛోడో’ (చంపండి, వదలకండి) అని మార్చి, సాయన్న తల న‌రికి అతి క్రూరంగా హతమార్చార‌ని ఒక క‌థ‌నం.

క‌ళాకారుల గ‌ళాల్లో బతికిన గాథ

నిజాం  ఆయన శరీరాన్ని అంతం చేసినా, ప్రజల మనసుల నుంచి ఆయనను చెరిపివేయలేకపోయారు. అధికారిక చరిత్రకారులు విస్మరించిన ఈ వీరుడి పోరాటాన్ని పాలమూరు ఒగ్గు కళాకారులు, బుర్రకథకులు తమ గళాల్లో బతికించారు. సాయన్న కథలు తరతరాలుగా జానపద కళాకారుల ద్వారా ప్రచారంలో ఉన్నాయి. ముఖ్యంగా 12 మెట్ల కిన్నెరపై వీరగాథలు ఆలపించే దర్శనం మొగులయ్య వంటి కళాకారులు ఆయన స్మృతిని ప్రజల్లో సజీవంగా ఉంచడంలో పాత్ర పోషించారు.  సీనియర్ జర్నలిస్ట్ బెక్కం జనార్దన్ విశ్లేషణ చేసి ‘పండగ సాయన్న’ జీవిత చరిత్రను గ్రంథస్థం చేయడంతో ఈ చరిత్ర వెలుగులోకి వచ్చింది. ఇటీవల నవాబుపేటలో సాయన్న కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించడం, ప్రభుత్వం జయంతి, వర్ధంతులను నిర్వహించడం ఆయన త్యాగానికి దక్కిన గౌరవంగా స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పండగ సాయన్న జయంతిని అధికారికంగా నిర్వహించడం, ఆయన విగ్రహాన్ని ట్యాంక్‌బండ్ పరిసరాల్లో ఏర్పాటు చేయాలన్న ప్రకటన తెలంగాణ చరిత్రలో ప్రజావీరులకు గుర్తింపు కల్పించే ప్రయత్నంగా చూడవచ్చు.

By RAVIKANTI SRINIVAS

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *