Andhra PradeshInternationalNewsNews from StatesPoliticsPopular NewsRecent NewsTelanganaTrending News

కెనడా ఎన్నికల బరిలో తెలుగు మహిళ!

కెనడాలోని మిస్సిస్సాగా నగర మేయర్‌ పదవికి తెలుగు మ‌హిళ దీపికా దామెర్ల పోటీప‌డుతున్నారు. త‌న ప్ర‌చార శైలితో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బాలీవుడ్‌ పాటను సరదాగా మార్చి పాడుతూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. . పాట‌లు, వీడియోల‌కే ప‌రిమితం కాకుండా స్థానిక స‌మ‌స్య‌ల‌పై స్ప‌ష్ట‌మైన అవ‌గాహ‌న క‌లిగి ఉండి ఆచ‌ర‌ణ యోగ్య‌మైన హామీలు ఇస్తూ ప్ర‌జ‌లను ఓట్లు అర్థిస్తున్నారు. మిస్సిస్సాగా న‌గ‌రం గురించి త‌న విజ‌న్‌ను వారి ముందుంచుతూ ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఈనెల 26న జ‌ర‌గ‌నున్న ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల్లో ఆమె త‌న ఆదృష్టాన్ని ప‌రీక్షించుకుంటున్నారు. క‌రోలిన్ పారిష్‌, అల్విన్ టెడ్జో, బోన్నీ క్రాంబీల‌తో ఆమె పోటీ పడుతున్నారు.

ఎవ‌రీ దీపికా దామెర్ల‌?

దీపికా దామెర్ల సికింద్రాబాద్‌లో సైనిక నేపథ్యం ఉన్నతెలుగు కుటుంబంలో జన్మించారు. ఆమె తండ్రికి తరచూ బదిలీలు కావడంతో కుటుంబం వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేది. అయితే, సికింద్రాబాద్‌లోని తాతయ్య, అమ్మమ్మల ఇల్లు ఆమెకు ఆ నగరంతో అనుబంధాన్ని కొనసాగించింది. బేగంపేటలోని రాజా జితేంద్ర పబ్లిక్‌ స్కూల్‌, తిరుమలగిరిలోని కేంద్రీయ విద్యాలయంలో ఆమె చదువుకున్నారు. 1991లో వివాహం తర్వాత కెనడాకు వెళ్లారు. మోండా మార్కెట్‌, సికింద్రాబాద్‌ క్లబ్‌కు వెళ్లిన జ్ఞాపకాలు ఆమెకు ఇప్పటికీ గుర్తున్నాయి.

“మా ఇంట్లో తరచూ సత్యనారాయణ స్వామి వ్రతాలు జరిగేవి. బంధువులు కూడా ఇంటికి వస్తుండేవారు. శీష్‌ మహల్‌ థియేటర్‌లో తెలుగు సినిమాలు చూడటం నా జ్ఞాపకాల్లో ఒక ముఖ్యమైన భాగం. హైదరాబాద్‌లో గడిపిన ఆ నాలుగేళ్లు ఎప్పటికీ మర్చిపోలేనివి” అని ఒక ఇంటర్వ్యూలో ఆమె చెప్పారు.

 

కార్పొరేట్‌ బ్యాంకింగ్‌ నుంచి రాజకీయాల వరకు

1991లో కెనడాకు వలస వెళ్లిన దీపిక‌ టొరంటో విశ్వవిద్యాలయంలోని రోట్‌మన్‌ స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌లో ఫైనాన్స్‌లో ఎంబీఏ పూర్తి చేసిన తర్వాత  కార్పొరేట్‌ బ్యాంకింగ్‌ రంగంలో పనిచేశారు. అనంతరం మిస్సిస్సాగాలో చిన్న వ్యాపారాన్ని నిర్వహించారు. ప్రావిన్షియల్‌ రాజకీయాల్లోకి ప్రవేశించేందుకు మూడుసార్లు ప్రయత్నించి విఫలమైన తర్వాత, 2011లో ఒంటారియో శాసనసభకు ఎన్నికయ్యారు. మిస్సిస్సాగా ఈస్ట్‌–కుక్స్‌విల్లే నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. ఆరోగ్యం, దీర్ఘకాలిక సంరక్షణ శాఖ సహాయ మంత్రిగా, ఆ తర్వాత సీనియర్స్‌ అఫైర్స్‌ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2018లో మిస్సిస్సాగా నగర కౌన్సిల్‌కు ఎన్నికయ్యారు. ఆమె రాజకీయ జీవితంలో ఆసుపత్రి విస్తరణకు 350 పడకల కోసం కృషి చేయడం, రెండు దీర్ఘకాలిక సంరక్షణ కేంద్రాలు, రెండు పాఠశాలల ఏర్పాటు, మిల్టన్ జీఓ రైలు సేవల పెంపునకు మద్దతు ఇవ్వడం వంటి అంశాలను తన ప్రగతిగా పేర్కొంటున్నారు.

బాలీవుడ్‌ పాటతో ఎన్నికల ప్రచారం

దీపికా దామెర్ల ఎన్నికల ప్రచారం బాలీవుడ్‌ పాటల వినియోగంతో ప్రత్యేకంగా వార్తల్లో నిలిచింది. అక్టోబర్‌ 9న మేయర్‌ అభ్యర్థుల చర్చా కార్యక్రమం అనంతరం, ‘క్యా హువా తేరా వాదా’ అనే పాటను మార్చి రూపొందించిన వీడియోను ఆమె ఎక్స్‌ (X) సామాజిక మాధ్యమంలో పోస్టు చేశారు. ఆ వీడియో చివరలో “పనిచేసే నగరం” అనే నినాదంతో పాటు తనకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. “నన్ను నేనే సరదాగా ఆటపట్టించుకోవాలన్నది మా ఉద్దేశం మాత్రమే. ఈ వీడియోకు ఇంత ప్రచారం వస్తుందని మేము ఊహించలేదు” అని ఆమె తెలిపారు. అయితే, కొందరు చేసిన వ్యాఖ్యలు ద్వేషపూరితంగా ఉన్నాయని, అవి తనను బాధించాయని, అందుక‌ని వీడియోను ఉప‌సంహ‌రించుకుంటున్న‌ట్లు కూడా చెప్పారు. నగర పాలనపై దీపికా దామెర్ల గట్టి హామీలు ఇస్తున్నారు. మిస్సిస్సాగా నగర కౌన్సిలర్‌గా ఎనిమిదేళ్లు పనిచేసిన ఆమె, నగరాన్ని మరింత మెరుగ్గా అభివృద్ధి చేయవచ్చని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ వ్యయాల్లో వృథాను తగ్గించి, పన్ను చెల్లింపుదారుల డబ్బును సమర్థంగా వినియోగించాలని ఆమె చెబుతున్నారు.నగర పాలనలో స్వతంత్ర ఆడిటర్ జనరల్‌ను నియమించి ఖర్చులపై పర్యవేక్షణ పెంచాలని ప్రతిపాదిస్తున్నారు. జీవన వ్యయం పెరగడం, నేరాలు అధికమవడం, నగర సేవల నాణ్యత తగ్గడం వంటి సమస్యలను ఆమె ప్రస్తావించారు.“ప్రజలు తమ ప్రాంతాల్లో గుంతలున్న రహదారులను, పార్కుల్లో చెత్తను ఎందుకు భరించాలి? ప్రభుత్వాలు మరింత సమర్థంగా పనిచేయాలి. ప్రజలకు జవాబుదారీగా ఉండాలి” అని ఆమె అన్నారు. ఆస్తి పన్నులపై హామీ2027లో నివాస గృహాల ఆస్తి పన్నులో నగర పాలక సంస్థ పరిధిలోకి వచ్చే భాగాన్ని పెంచకుండా నిలిపివేస్తానని దీపికా హామీ ఇచ్చారు. నగర పాలక సంస్థ ఖర్చులను పరిశీలించేందుకు స్వతంత్ర ఆడిటర్‌ జనరల్‌ను నియమించాలని, పోలీసు విభాగానికి నిధులు కేటాయించే విధానాన్ని సమీక్షించాలని కూడా ఆమె ప్రతిపాదించారు.

ఆవిష్కరణలకు కేంద్రంగా మిస్సిస్సాగా

జీవన వ్యయం, నగర సేవల సమస్యలను పరిష్కరించడంతో పాటు, మిస్సిస్సాగాను నూతన ఆవిష్కరణలకు కేంద్రంగా అభివృద్ధి చేయాలని దీపికా కోరుకుంటున్నారు. ముఖ్యంగా క్వాంటమ్‌ కంప్యూటింగ్‌, భౌతిక కృత్రిమ మేధస్సు (ఫిజిక‌ల్ ఏఐ) వంటి అభివృద్ధి చెందుతున్న రంగాలను ఆమె ప్రస్తావించారు.భారతదేశంలో నివసించిన అనుభవం కూడా తన పాలనా విధానాన్ని ప్రభావితం చేసిందని దీపికా తెలిపారు. “ప్రభుత్వాలు విఫలమైతే ప్రజలు ఇబ్బందులు పడతారు. ప్రభుత్వ విద్య, ఇతర అత్యవసర సేవల్లో లోపాలు ప్రజల జీవితాలపై నేరుగా ప్రభావం చూపుతాయి. ప్రపంచంలోని అన్ని ప్రభుత్వాలూ ప్రజలకు మరింత మెరుగ్గా స్పందించాలి. ప్రజా సేవలు సక్రమంగా పనిచేసేలా చూడాలి” అని ఆమె పేర్కొన్నారు.

తెలంగాణతో కొనసాగుతున్న అనుబంధం

దీపికకు తెలంగాణతో ఉన్న సంబంధాలు బాల్య జ్ఞాపకాలకే పరిమితం కాలేదు. 2016లో ఒంటారియో ప్రావిన్స్‌ అప్పటి ముఖ్యమంత్రి కాథ్లీన్‌ వైన్‌ నాయకత్వంలో భారత్‌లో పర్యటించిన వాణిజ్య ప్రతినిధి బృందంలో దీపిక కూడా సభ్యురాలిగా ఉన్నారు. ఈ పర్యటనలో హైదరాబాద్‌ కూడా భాగంగా ఉంది. ఒంటారియో, భారతదేశం మధ్య ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడం ఈ పర్యటన ప్రధాన లక్ష్యం. సుస్థిర అభివృద్ధి, పట్టణ మౌలిక సదుపాయాలు, పునరుత్పాదక ఇంధనం, పర్యావరణ సాంకేతికత వంటి రంగాల్లో పరస్పర సహకార అవకాశాలను ఈ బృందం పరిశీలించింది. అదే పర్యటన సందర్భంగా కెనడాకు చెందిన డేటావిండ్‌ సంస్థ హైదరాబాద్‌లో తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి తెలంగాణ ప్రభుత్వంతో భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఆ ఏడాదే గ్రేటర్‌ టొరంటో ప్రాంతంలో నిర్వహించిన తెలంగాణ నైట్‌ కార్యక్రమానికి దీపిక ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో 800 మందికి పైగా తెలంగాణ ప్రవాసులు పాల్గొన్నారు. తన పుట్టిన నగరానికి తిరిగి రావడం, భారత్‌–కెనడా సంబంధాలను బలోపేతం చేయడంలో భాగస్వామి కావడం భావోద్వేగపూరితమైన, హృదయానికి హత్తుకునే అనుభవమని ఆమె అభివర్ణించారు. “భారత్‌, కెనడా మధ్య వాణిజ్య సంబంధాలు ఎంతో మెరుగ్గా ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే ఉన్న సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి అద్భుతమైన అవకాశాలున్నాయి” అని ఆమె చెప్పారు.

మిస్సిస్సాగాలో ఎన్నిక‌ల వాతావ‌ర‌ణం

కెన‌డాలోని ఒంటారియో  ప్రావిన్స్‌లోని మిస్సిస్సాగాలో ప్ర‌స్తుతం ఎన్నిక‌ల వాతావ‌ర‌ణం నెల‌కొంది.  ఈనెల 26న మున్సిపల్ ఎన్నికలు  జరుగుతాయి.  అభ్యర్థులు తమ పేర్లు, ఎన్నికల గుర్తింపు, హామీలతో  ఏర్పాటుచేసిన పోస్ట‌ర్లు న‌గ‌ర‌మంతా క‌నిపిస్తున్నాయి. స్థానిక సమస్యలపై ఇంటింటి ప్రచారం, బహిరంగ చర్చలు, సోషల్ మీడియా ప్రచారం కొన‌సాగుతోంది.   మేయర్‌తో పాటు వార్డు/ప్రాంతీయ కౌన్సిలర్లు, పాఠశాల బోర్డు ట్రస్టీలను కూడా ఓటర్లు ఎన్నుకుంటారు. ఎన్నికైన ప్రతినిధులు 2026–2030 కాలానికి బాధ్యతలు నిర్వహిస్తారు.  మిస్సిస్సాగా కెనడాలోని ఒంటారియో ప్రావిన్స్‌లో ఉన్న ప్రధాన నగరం. గ్రేటర్ టొరంటో ప్రాంతంలో కీలకమైన ఈ నగర జనాభా 8 లక్షలకు పైగా ఉంది. మిస్సిస్సాగా నగర పాలక సంస్థ నగర సేవలు, రహదారులు, పార్కులు, రవాణా, స్థానిక బడ్జెట్ వంటి అంశాలపై నిర్ణయాలు తీసుకునే సంస్థ. అందువల్ల ఇక్కడి మేయర్ పదవి నగర పాలనతోపాటు గృహనిర్మాణం, రవాణా, పన్నులు, భద్రత వంటి అంశాలపై గణనీయమైన ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం మిస్సిస్సాగా ఎన్నికల్లో ఆస్తి పన్నుల భారం, జీవన వ్యయం, నేరాలు, రవాణా సౌకర్యాలు ప్రధాన చర్చనీయాంశాలుగా ఉన్నాయి. ఎన్నికల ప్రచారానికి సంబంధించి స్థానిక నియమాలు, ఖర్చుల పరిమితులు వర్తిస్తాయి.

ఓటింగ్ విధానం

2026 అక్టోబర్ 26న ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. అర్హులైన ఓటర్లు మేయర్, తమ వార్డు కౌన్సిలర్, సంబంధిత పాఠశాల బోర్డు ట్రస్టీ పదవులకు ఓటు వేస్తారు.

మేయర్ పదవికి పోటీ చేసే అభ్యర్థుల్లో అత్యధిక ఓట్లు పొందిన వ్యక్తి గెలుస్తారు. 50 శాతానికి పైగా ఓట్లు సాధించాల్సిన అవసరం లేదు. ఉదాహరణకు, ఒక అభ్యర్థికి 35 శాతం, మరొకరికి 30 శాతం, ఇంకొకరికి 25 శాతం ఓట్లు వస్తే, మొదటి అభ్యర్థి విజేత అవుతారు.

ఎవరు ఓటు వేయవచ్చు?

మిస్సిస్సాగా మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేయడానికి సాధారణంగా కెనడా పౌరుడై ఉండాలి.  కనీసం 18 ఏళ్లు నిండి ఉండాలి. మిస్సిస్సాగాలో నివసిస్తూ ఉండాలి లేదా అక్కడి ఆస్తి యజమాని/అద్దెదారు అయి ఉండాలి; అర్హత కలిగిన ఆస్తి యజమాని లేదా అద్దెదారు జీవిత భాగస్వామికీ అర్హత ఉండవచ్చు. అవసరమైన గుర్తింపు పత్రాలు చూపించాలి.  కెనడాలో శాశ్వత నివాస హోదా ఉన్నంత మాత్రాన ఓటు హక్కు రాదు. పౌరసత్వం తప్పనిసరి. భారతదేశంలోనూ ఎన్నికల రకాన్ని బట్టి అర్హతలు, ఓటర్ల జాబితా నిబంధనలు ఉంటాయి. ఒంటారియోలో మేయర్ ఎన్నికలు పార్టీ రహిత విధానంలో జరుగుతాయి. అయితే అభ్యర్థులకు రాజకీయ అభిప్రాయాలు, గత పార్టీ అనుబంధాలు ఉండవచ్చు. వాటి ఆధారంగా ఓటర్లు నిర్ణయం తీసుకున్నా, బ్యాలెట్‌పై పార్టీ గుర్తు ఉండదు.

భారతదేశంతో పోలిస్తే ప్రధాన మార్పు ఏమిటి?

భారతదేశంలోని అనేక నగరాల్లో మేయర్‌ను  కార్పొరేటర్లు ఎన్నుకుంటారు. మిస్సిస్సాగాలో మాత్రం ప్రజలే మేయర్‌ను నేరుగా ఎన్నుకుంటారు. అందువల్ల మేయర్ అభ్యర్థి వ్యక్తిగత ప్రజాదరణ, స్థానిక సమస్యలపై అవగాహన, పాలనా అనుభవం, హామీలకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. అలాగే ఒంటారియోలో కొన్ని చట్టాల ప్రకారం మేయర్లకు ప్రత్యేకమైన స్ట్రాంగ్ ప‌వ‌ర్స్‌ కూడా ఉన్నాయి. దీంతో బడ్జెట్, సిబ్బంది నియామకాలు, కొన్ని విధాన నిర్ణయాల్లో వారి అధికారాలు పెరిగాయి. అయినప్పటికీ మేయర్ ఒంటరిగా అన్ని నిర్ణయాలూ తీసుకోలేరు. చట్టాలు, కౌన్సిల్ అధికారాలు వర్తిస్తాయి.

  • మిస్సిస్సాగా నుంచి రావికంటి శ్రీ‌నివాస్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *