Andhra PradeshNewsNews from StatesPopular NewsRecent NewsTrending News

స్థానిక ఎన్నికలతో ఏపీలో వేడెక్కిన రాజకీయాలు

INTRODUCTION

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రాజ‌కీయం వేడెక్కింది. మున్సిప‌ల్ , ప‌రిష‌త్‌, పంచాయ‌తీ ఎన్నిక‌ల‌కు న‌గారా మోగ‌డంతో అన్ని పార్టీలు హోరాహోరీకి సిద్ధ‌మ‌వుతున్నాయి. తెలుగుదేశం, జ‌న‌సేన‌, భార‌తీయ జ‌న‌తాపార్టీల మ‌ధ్య ఎన్నిక‌ల పొత్తుపై ర‌క‌ర‌కాల  ఊహాగానాలు వ్య‌క్త‌మైనా అది చివ‌రికి ఓ కొలిక్కి వ‌చ్చింది.  తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు, జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్‌ల మ‌ధ్య అంత‌రం పెరిగిన‌ట్లు అనిపించ‌డం, జ‌న‌సేనాని కార్య‌క‌ర్త‌ల‌ అంచ‌నాలు పెర‌గ‌డం,  అల‌క‌లు, అస‌మ్మ‌తులు, వ్యూహాత్మ‌కంగా ర‌క‌ర‌కాల ప్ర‌క‌ట‌న‌లు, పోస్ట‌ర్ల‌తో కొంత క‌ల‌క‌లం ఏర్ప‌డిన నేప‌థ్యంలో రాజ‌కీయంగా ఆస‌క్తి నెల‌కొంది. అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలో రాష్ట్ర భ‌విష్య‌త్తు  కోసం త్యాగం చేశామ‌ని, ఇప్పుడు పార్టీ కోసం , కార్య‌క‌ర్త‌ల కోసం అప్ప‌టికంటే ఎక్కువ శాతం సీట్లు కావాల‌ని జ‌న‌సేన శ్రేణులు కోరాయి. ప‌వ‌న్ కల్యాణ్ కూడా కాకినాడ స‌మావేశంలో బ‌ల‌మున్న అన్ని చోట్లా పోటీ చేయండి అని పిలుపు ఇవ్వ‌డంతో పార్టీ కార్య‌క‌ర్త‌ల్లో ఉత్సాహం పెల్లుబికింది. ఈ నేప‌థ్యంలో పొత్తుపై కొన్ని సందేహాలు వ్య‌క్త‌మైనా చంద్ర‌బాబు, ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ల భేటీ అనంత‌రం ప‌రిస్థితి స‌ద్దుమ‌ణిగింది.  త‌మ మ‌ధ్య పొత్తు కుదిరింద‌ని,  పోటీ చే య‌నున్న స్థానాల‌పై స్ప‌ష్ట‌త వ‌చ్చింద‌ని ఇరుపార్టీల నేత‌ల ప్ర‌క‌టించారు. అయితే అవి ఎన్ని? ఏమిటి? అనే విష‌యాల‌ను వారు ప్ర‌క‌టించ‌లేదు.  అయితే  జ‌న‌సేన నేత‌లు గ‌తం క‌న్నా ఎక్కువ స్థానాలు పొందిన‌ట్లు తెలుస్తోంది. దీనిపై పూర్తి స్ప‌ష్ట‌త రావ‌ల‌సి ఉంది. భార‌తీయ జ‌న‌తా పార్టీ వైపు నుంచి పెద్ద‌గా డిమాండ్లు ఏవీ లేన‌ట్లు స‌మాచారం. వారు ఆశించిన స్థాయిలోనే స్థానాలు ద‌క్కిన‌ట్లు భావిస్తున్నారు. మ‌రోవైపు వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నిక‌ల విష‌యంలో అంత‌ర్గతంగా ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేసింది.  మ‌రోవైపు  జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి ప్రమేయ‌మున్న కేసుల విచార‌ణ వేగ‌వంతం చేయాల‌ని, రోజువారీ విచార‌ణ జ‌ర‌పాల‌ని నాంప‌ల్లి సీబీఐ కోర్టు నిర్ణ‌యించింది.  ఇది ఎన్నిక‌ల‌ను ప్ర‌భావితం చేస్తుందా? అనేది చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఈ నేప‌థ్యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయ ముఖ‌చిత్రంపై విహంగ‌వీక్ష‌ణం.

ANALYSIS

ఇదీ స్థానిక ఎన్నికల షెడ్యూల్

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అనిల్‌ చంద్ర పునేఠా 2026 అక్టోబరు 14న స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించారు. నోటిఫికేషన్‌ వెలువడిన వెంటనే రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది. పట్టణ స్థానిక సంస్థలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రామ పంచాయతీలకు వేర్వేరు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు.

పట్టణ స్థానిక సంస్థలు:

రాష్ట్రంలోని మొత్తం 123 పట్టణ స్థానిక సంస్థల్లో ప్రస్తుతం 100 సంస్థలకు మాత్రమే ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించారు.

స్థానిక సంస్థ    సంఖ్య

మున్సిపల్‌ కార్పొరేషన్లు              13

మున్సిపాలిటీలు           77

నగర పంచాయతీలు    10

మొత్తం 100

మున్సిపల్‌ ఎన్నికల తేదీలు

కార్యక్రమం        తేదీ

ఎన్నికల నోటిఫికేషన్‌   అక్టోబరు 14

నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ          అక్టోబరు 18

నామినేషన్ల పరిశీలన   అక్టోబరు 19

నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ             అక్టోబరు 21

ఎన్నికల ప్రచార ముగింపు         అక్టోబరు 26

పోలింగ్‌               అక్టోబరు 28

ఓట్ల లెక్కింపు, ఫలితాలు            అక్టోబరు 30

పోలింగ్‌ అవసరమైన చోట ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నట్లు ఎన్నికల షెడ్యూల్‌లో పేర్కొన్నారు. అవసరమైతే అక్టోబరు 29న రీపోలింగ్‌ నిర్వహించే అవకాశం ఉంది.

పోలింగ్‌ జరగనున్న 13 కార్పొరేషన్లు

గ్రేటర్‌ విశాఖపట్నం

విజయవాడ

విజయనగరం

ఏలూరు

మచిలీపట్నం

గుంటూరు

ఒంగోలు

నెల్లూరు

తిరుపతి

చిత్తూరు

కడప

కర్నూలు

అనంతపురం

ఈ కార్పొరేషన్లతో పాటు 77 మున్సిపాలిటీలు, 10 నగర పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహిస్తారు.

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు

కార్యక్రమం                                                        తేదీ

నోటిఫికేషన్‌                                                 అక్టోబరు 19

నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ            అక్టోబరు 23

నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ             అక్టోబరు 27

పోలింగ్‌                                                                 నవంబరు 3

ఓట్ల లెక్కింపు                                              నవంబరు 5

గ్రామ పంచాయతీ ఎన్నికలు

గ్రామ పంచాయతీ ఎన్నికలను మూడు విడతల్లో నిర్వహించనున్నారు.

విడత   నోటిఫికేషన్‌       నామినేషన్ల చివరి తేదీ ఉపసంహరణ  పోలింగ్‌

మొదటి విడత నవంబరు 13     నవంబరు 17     నవంబరు 21     నవంబరు 26

రెండో విడత      నవంబరు 16     నవంబరు 20     నవంబరు 24     నవంబరు 29

మూడో విడత    నవంబరు 19     నవంబరు 23     నవంబరు 27     డిసెంబరు 2

గ్రామ పంచాయతీల్లో పోలింగ్‌ జరిగిన రోజే ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటించనున్నారు.

రాజకీయ ప్రాధాన్యం

స్థానిక ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే భిన్నమైనవి. ఇక్కడ అభ్యర్థి వ్యక్తిగత పరిచయాలు, స్థానికంగా పార్టీకి ఉన్న బలం, సామాజిక సమీకరణాలు, గ్రామస్థాయి కార్యకర్తల ప్రభావం కీలకంగా ఉంటాయి. పట్టణ ఎన్నికలు అక్టోబరు 28న జరగనున్నందున అభ్యర్థుల ఎంపిక, ప్రచారం, కూటమి పార్టీల మధ్య సమన్వయానికి పరిమిత సమయం మాత్రమే ఉంది. ఇది ఆయా పార్టీల‌కు ఒక స‌వాల్‌గా మార‌నుంది.

23 పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికల షెడ్యూల్‌ ఎందుకు లేదు?

ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 123 పట్టణ స్థానిక సంస్థలు ఉన్నాయి. అయితే ఎన్నికల కమిషన్‌ ప్రస్తుతం 100 సంస్థలకే షెడ్యూల్‌ ప్రకటించింది. మిగిలిన 23 సంస్థల్లో ఎన్నికలు కోర్టు ఉత్తర్వులు, ఇతర న్యాయపరమైన అంశాలు లేదా ఎన్నికలకు ముందు చేపట్టాల్సిన ప్రక్రియలు పూర్తయ్యాక నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ వెల్లడించారు.

శ్రీకాకుళం, రాజమహేంద్రవరం, కాకినాడ మంగళగిరి–తాడేపల్లి కార్పొరేష‌న్లు కాగా  మిగిలిన 19 మున్సిపాలిటీలు/నగర పంచాయతీల్లో అమదాలవలస, రాజాం, పాలకొల్లు, భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, చింతలపూడి, గుడివాడ, వైఎస్సార్‌ తాడిగడప, పొన్నూరు, నరసరావుపేట, బాపట్ల, కందుకూరు, కావలి, గూడూరు, శ్రీకాళహస్తి, పొదిలి, అల్లూరు, బి.కొత్తకోట ఉన్నాయి.

టీడీపీ–జనసేన–బీజేపీ పొత్తు: ఎవరి ఎంత వాటా?

స్థానిక ఎన్నికల షెడ్యూల్‌ విడుదలకు ముందు నుంచే అధికార కూటమిలో సీట్ల సర్దుబాటుపై చర్చలు సాగుతున్నాయి. జనసేన తొలుత 17 కార్పొరేషన్లలో ఆరు కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు/నగర పంచాయతీల్లో 26 స్థానాలు తమకు కేటాయించాలని ప్రతిపాదించ‌గా  నాలుగు కార్పొరేషన్లు, సుమారు 24 మున్సిపాలిటీలు/నగర పంచాయతీలు కేటాయించేందుకు టీడీపీ సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. జ‌న‌సేన తాజాగా అయిదు కార్పొరేష‌న్లు అడుగుతున్న‌ట్లు స‌మాచారం.  దీన్ని బ‌ట్టి జ‌న‌సేన కొంత వెనక్కి తగ్గినట్లు కనిపిస్తోంది. స్థానికంగా బలమున్న చోట పోటీ చేసే అవకాశం కల్పిస్తామన్న హామీ జనసేనకు ముఖ్యమైన రాజకీయ భరోసా.

* బీజేపీకి ఒక మేయర్‌ స్థానం, పది మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ స్థానాలు కేటాయించే అంశంపై చర్చ జరిగినట్లు సమాచారం.  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ గతంలో మాట్లాడుతూ, గ్రామ పంచాయతీల నుంచి కార్పొరేషన్ల వరకు పార్టీ బలాన్ని అంచనా వేసి కూటమి భాగస్వాములతో సీట్ల సర్దుబాటు చేసుకుంటామని చెప్పారు.

* టీడీపీ ప్రధానంగా కూటమి ఐక్యత, స్థానికంగా గెలుపు అవకాశాలు, అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టింది.   కూటమి భాగస్వాములకు తగిన ప్రాతినిధ్యం కల్పించడం, తమ పార్టీ స్థానిక నాయకులు, కార్యకర్తల్లో అసంతృప్తి పెరగకుండా చూడడం తెలుగుదేశం పార్టీ ముందు ఉన్న‌స‌వాళ్లు. అసెంబ్లీ ఎన్నికల్లో కుదిరిన పొత్తు ఫార్ములాను స్థానిక ఎన్నికలకు యథాతథంగా వర్తింపజేయడం కష్టమ‌ని,   స్థానికంగా అభ్యర్థుల బలం, సామాజిక సమీకరణాలు, పాత రాజకీయ విభేదాలు భిన్నంగా ఉండ‌ట‌మే అందుకు కార‌ణ‌మ‌ని ఆ పార్టీ  భావిస్తోంది. ఈ నేప‌థ్యంలోనే కూట‌మి పార్టీల‌తో సామ‌ర‌స్యంగా సర్దుబాటు చేయ‌డంపై, అభ్య‌ర్థుల ఎంపిక‌పై చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్‌లు తీవ్రంగా కసరత్తు చేస్తున్న‌ట్లు స‌మాచారం.

అన్ని చోట్లా పోటీకి సిద్ధ‌మ‌వుతున్న వైఎస్సార్ సీపీ

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అక్టోబరు 13న పార్టీ జిల్లా స్థాయి నాయకులతో సమావేశమై అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల సన్నద్ధతపై చర్చించారు. బలమైన అభ్యర్థులను గుర్తించాలని సూచించారు.  అన్ని చోట్లా పోటీకి ఆ పార్టీ సిద్ధ‌మ‌వుతోంది. కూట‌మిలో పొత్తు కోసం జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను వైఎస్సార్ కాంగ్రెస్ నాయ‌కులు విమ‌ర్శిస్తున్నారు. కూట‌మిలో లుక‌లుక‌లు ఉన్నాయంటూ ప్ర‌చారం ప్రారంభించారు.  పొత్తు య‌త్నాల‌ను గండికొట్ట‌డం ద్వారా ల‌బ్ధి పొందేందుకు వారు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు అనిపిస్తోంది.

ఎన్నిక‌ల వేళ‌..క‌దిలిన కేసుల డొంక‌

జ‌గ‌న్‌పై సీబీఐ 11 చార్జిషీట్లు దాఖలు చేసింది.ఈడీ తొమ్మిది చార్జిషీట్లు దాఖలు చేసింది.ఈ కేసులు సుమారు పదేళ్లుగా వివిధ దశల్లో పెండింగ్‌లో ఉన్నాయి. నిందితులు దాఖలు చేసిన 141 డిశ్చార్జ్‌ పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నట్లు ఈడీ హైకోర్టుకు తెలిపింది.   స్థానిక ఎన్నిక‌ల‌కు న‌గారా మోగిన స‌మ‌యంలో వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి సంబంధించిన అక్రమాస్తుల కేసుల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.

అక్టోబరు 14న నాంపల్లి ప్రత్యేక సీబీఐ కోర్టు సీబీఐ కేసులతో పాటు ఈడీ కేసులను కూడా రోజువారీగా విచారించాలని నిర్ణయించింది. అక్టోబరు 19 నుంచి రోజువారీ విచారణ ప్రారంభమయ్యే అవకాశం ఉందని న్యాయవర్గాలు తెలిపాయి.  అయితే జగన్‌కు గతంలో మంజూరైన వ్యక్తిగత హాజరు మినహాయింపును రద్దు చేయాలంటూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌ తెలంగాణ హైకోర్టులో ఇంకా పెండింగ్‌లో ఉంది. దాంతో ఆయ‌న వ్య‌క్తిగ‌తంగా  హాజ‌రవుతారా అన్న‌ది ఇప్ప‌టికీ ప్ర‌శ్నార్థ‌క‌మే. ఏది ఏమైనా  ఇది రాజ‌కీయంగా ప్ర‌భావితం చూపే అవ‌కాశం ఉంద‌ని భావిస్తున్నారు.

*   ఎన్నికల ప్రచారంలో అభివృద్ధి, స్థానిక సమస్యలతో పాటు జగన్‌ కేసులు ప్రధాన చర్చగా మారవచ్చు. ప్రత్యర్థి పార్టీలు ఈ అంశాన్ని ప్రస్తావించే అవకాశం ఉంది.

*  కోర్టు ఆదేశాల మేరకు జగన్‌ వ్యక్తిగతంగా హాజరుకావాల్సిన పరిస్థితి ఏర్పడితే, ఆయన ప్రచార కార్యక్రమాల షెడ్యూల్‌పై ప్రభావం పడవచ్చు. అయితే ఇది కోర్టు మినహాయింపు విషయంలో వచ్చే నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.

* పార్టీ నాయకత్వం న్యాయపరమైన పరిణామాలకు సమాధానం చెప్పడంలో ఎక్కువ సమయం వెచ్చించాల్సి రావచ్చు.

అయితే విచార‌ణ‌ను వేగ‌వంతం చేయాల‌ని జ‌గ‌న్ ఎప్ప‌టినుంచో కోరుతున్నార‌ని, అది త‌మ‌ను ఇబ్బంది పెట్టే వ్య‌వ‌హారం కాద‌ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు. పైగా  కేసుల విషయాన్ని రాజకీయ కక్ష సాధింపు పేరిట‌ ప్రజల ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది.  జ‌గ‌న్ ప్ర‌చారం ఒక్క‌టే విజయావ‌కాశాల‌కు కార‌ణం కాద‌ని, పార్టీకి ఉన్న స్థానిక నాయకత్వం, అభ్యర్థుల ఎంపిక, కేడర్‌ బలం త‌మ‌కు ఉప‌క‌రిస్తాయ‌ని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌ స్థానిక ఎన్నికలు కేవలం గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలకు ప్రతినిధులను ఎన్నుకునే ప్రక్రియ మాత్రమే కాదు. అధికార కూటమిలోని పార్టీల మధ్య స్థానిక బలం ఆధారంగా సీట్ల పంపకం, బీసీ రిజర్వేషన్లపై వివాదం, 23 పట్టణ స్థానిక సంస్థల్లో ఎన్నికల ఆలస్యం, జగన్‌ కేసుల రోజువారీ విచారణ వంటి పరిణామాలు ఈ ఎన్నికల రాజకీయ నేపథ్యాన్ని ప్రభావితం చేస్తున్నాయి.

NEWS AT A GLANCE

https://www.deccanchronicle.com/southern-states/andhra-pradesh/ap-local-body-elections-schedule-announced-1995768?utm

https://ntvtelugu.com/andhra-pradesh-news/amaravathi/ap-local-body-election-schedule-2026-polling-dates-announced-1025829.html

https://www.andhrajyothy.com/2026/andhra-pradesh/ap-local-elections-tdp-jana-sena-seat-sharing-confirmed-1567409.html

https://www.ysrcongress.com/english/news?new=1791720911&page=1&utm

https://www.newindianexpress.com/states/telangana/2026/Oct/11/telangana-high-court-links-pils-to-ed-plea-in-former-cm-jagan-mohan-reddy-case-for-trial?utm

https://thesouthfirst.com/andhrapradesh/cbi-court-to-hold-daily-hearings-in-da-cases-against-jagan-mohan-reddy/?utm

BY RAVIKANTI SRINIVAS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *