Andhra PradeshInternationalNewsNews from StatesPopular NewsRecent NewsTelanganaTrending News

మారుతున్న ఆమెరికా కల, అవకాశాలు తెరుస్తున్న భారత్

కొద్దికాలం క్రితం అమెరికాలో ఉన్న ప్రవాస భారతీయ (NRI) దంపతుల నుంచి వచ్చిన ఒక వైరల్ “రావద్దు (డోంట్ కమ్)” సందేశం మారుతున్న వాస్తవికతను ప్రతిబింబిస్తోంది: భారతదేశంలో స్టార్టప్, ఉద్యోగ అవకాశాలు విస్తరిస్తుండగా, అమెరికాలో పెరుగుతున్న వీసా ఖర్చులు, జాప్యాల కారణంగా అక్కడికి వెళ్లడం కష్టతరమైన ఎంపికగా మారుతోంది.

అమెరికాలో చదువుకోవడం, మంచి వేతనంతో ఉద్యోగం సంపాదించడం, మెరుగైన భవిష్యత్తును నిర్మించుకోవడం కొద్ది సంవత్సరాల క్రితం వరకు భారతదేశంలోని మధ్యతరగతి కుటుంబాలలో ఒక కల. దాన్ని సాధించడానికి ఆయా కుటుంబాలు చాలా కష్టపడేవి. తమ కుటుంబంలో ఒకరైనా స్థిరపడతారని, తద్వారా కుటుంబానికి ఒక ఆర్ధికమయిన ఆలంబన దొరుకుతుందని వారి ఆశ. కానీ ఇప్పుడు ఆ లెక్క మారుతోంది. ఇమ్మిగ్రేషన్ అనిశ్చితి, పెరుగుతున్న ఖర్చులు, కఠినమైన టెక్ జాబ్ మార్కెట్ అమెరికా కలల వాస్తవాన్ని అర్ధం చేసుకునేల చేస్తున్నాయి. మరోవైపు భారతదేశంలోని స్టార్టప్‌లు, డిజిటల్ మౌలిక సదుపాయాలు,  విస్తరిస్తున్న గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (GCCలు) స్వదేశంలోనే మరిన్ని అవకాశాలను సృష్టిస్తున్నాయి. భారతీయ విద్యార్థులు, నిపుణుల కోసం ఇప్పుడు కేవలం విదేశాలకు వెళ్లాలా వద్దా అనే దాని గురించే కాకుండా అభివృద్ధికి తదుపరి ఎక్కడ మెరుగైన అవకాశాలు లాభిస్తాయనే అంశాలు పరిశీలించవలసిన పరిస్థితి ఆవిష్కృతమవుతోంది.

అమెరికాలో కెరీర్‌ను నిర్మించుకోవాలనే నిర్ణయం ఒకప్పుడు ఎంతోమంది ప్రతిష్టాత్మక భారతీయులకు చాలా సహజమైనదిగా అనిపించేది. అమెరికన్ డిగ్రీ, గ్లోబల్ కంపెనీలో ఉద్యోగం, హెచ్-1బి (H-1B) వీసా, చివరికి గ్రీన్ కార్డ్ ఒక వ్యక్తి విజయానికి కొలబడ్డాగా ఉండేవి. ఆ మార్గం పూర్తిగా మూసుకుపోలేదు కానీ దానిలోని ప్రతి మెట్టూ ఇప్పుడు సందిగ్ధంగా మారింది.

భారతదేశంలో అవకాశాల తీరుతెన్నులు మారాయి. రెండు దశాబ్దాల క్రితం ఊహించడానికీ కష్టమైన కెరీర్ మార్గాలను టెక్నాలజీ, స్టార్టప్‌లు, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు, డిజిటల్ మౌలిక సదుపాయాలు సృష్టించాయి. ఇప్పుడు ప్రశ్న అమెరికా మెరుగైన అవకాశాలను ఇస్తుందా లేదా అనేది మాత్రమే కాదు. నిత్య అనిశ్చితిలో చట్టపరమైన అనేక ఆంక్షలను ఎదుర్కుంటా అక్కడ ఉండడం అంతా అవసరమా అన్నదే.

ఒకప్పుడు సరైనదే అనిపించిన కల

గడిచిన మూడు దశాబ్దాలలో ఎక్కువ కాలం ఈ లెక్క చాలా స్పష్టంగా ఉండేది. భారతదేశంలోని ప్రత్తిపాదిత ఉద్యోగ మార్కెట్ ముఖ్యంగా ఇంజనీర్లు, డాక్టర్లు, ఎంబీఏ (MBAs) లకు  పరిమితంగా ఉండేది. మరోవైపు అమెరికాలో  ఎక్కువ వేతనాలు, పటిష్టమైన పరిశోధనా వాతావరణం, విద్య నుండి ఉపాధికి సులభమైన మార్గాన్ని దొరికేవి. మాస్టర్స్ డిగ్రీ చేయడం, ఉద్యోగం సంపాదించడం, కెరీర్‌ను నిర్మించుకోవడం, చివరకు స్థిరపడడం లక్ష్యంగా మారాయి. ఈ మార్గాన్ని అనుసరించి అమెరికా అంతటా ఇండో-అమెరికన్ కమ్యూనిటీలు ఏర్పడ్డాయి. “విదేశాలకు వెళ్లడం” అనేది వృత్తిపరమైన ఆశయానికి మారుపేరుగా మారింది.

ఇప్పుడు లెక్కలు మారాయి. చదువుకోసం అమెరికా వెళ్ళడం, చదువు పూర్తి చేయడం, స్థిరపడడం గతంలో అంత సులభంగా లేదు.

అమెరికా ప్రయాణం మరింత కష్టతరం

ఇమ్మిగ్రేషన్ విధానం మారుతోంది. అమెరికా ప్రభుత్వం కొన్ని కొత్త H-1B దరఖాస్తుల కోసం సెప్టెంబర్ 2025లో 1,00,000 డాలర్ల చెల్లింపు నిబంధనను ప్రవేశపెట్టింది. మసాచుసెట్స్‌లోని ఫెడరల్ జడ్జి జూన్ 2026లో ఈ నిబంధన చట్టవిరుద్ధమని కొట్టివేశారు. అయితే ప్రభుత్వం వేరే మార్గాన్ని అనుసరించింది: ఆగస్టులో, హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం H-1B దరఖాస్తుల కోసం ప్రత్యేకంగా 103,265 డాలర్ల ఫీజును ప్రతిపాదించింది. ఈ సవరించిన ప్రతిపాదనలు ఇప్పటికీ అమలులోకి రాలేదు. చట్టపరమైన నిబంధనల అడ్డంకిని దాటి వీటిని అమలు చేయాలి. దానికి ఇంకా టైమ్ పడుతుంది. విదేశీ నిపుణులను నియమించుకునే సంస్థలకు పరిస్థితిని ప్రతికూలంగా మార్చడమే దీని అంతిమ ఉద్దేశం.

కేవలం ఫీజు మాత్రమే కాకుండా అనిశ్చితి కూడా మరో ప్రధాన సమస్య. మారుతున్న నిబంధనలు, న్యాయపోరాటాలు, అధిక ఖర్చులను పరిగణనలోకి తీసుకోవాల్సి వస్తుంది. దీనివల్ల స్థానికంగా లేదా గ్లోబల్ టీమ్‌ల ద్వారా భర్తీ చేయగల ఉద్యోగాలకు స్పాన్సర్‌షిప్ ఇవ్వడం కంపెనీలకు అంతగా ఆకర్షణీయంగా అనిపించడం లేదు.

H-1B అనిశ్చితి ఒక తీవ్రమైన సమస్యను భారతీయ నిపుణుల ముందుకు తీసుకువస్తోంది – అదే గ్రీన్ కార్డ్ జాప్యం. అమెరికా ఉపాధి ఆధారిత ఇమ్మిగ్రేషన్ వ్యవస్థ ప్రతిసంవత్సరం జారీ చేసే గ్రీన్ కార్డ్ సంఖ్యను దేశాల వారీగా 7% సీలింగ్‌తో పరిమితి చేసింది. భారతదేశం నుండి అత్యధిక సంఖ్యలో నైపుణ్యం కలిగిన దరఖాస్తుదారులు ఉండటం వల్ల, భారతీయ నిపుణులు గ్రీన్ కార్డ్ కోసం అత్యంత సుదీర్ఘమైన నిరీక్షణను ఎదుర్కోవాల్సి వస్తోంది.

దీని ప్రభావం కేవలం కాగితాల పరిమితం కాదు. వీసాపై ఆధారపడటం వల్ల ఉద్యోగ మార్పులు పరిమితం కావచ్చు, జీవిత భాగస్వామి కెరీర్‌పై ప్రభావం పడవచ్చు,  కుటుంబాలు కొన్ని కీలక నిర్ణయాలను వాయిదా వేయవలసిన పరిస్థితి రావచ్చు. మొదట్లో కెరీర్ అప్‌గ్రేడ్‌గా కనిపించే నిర్ణయం తరువాత ఇమ్మిగ్రేషన్ రిస్క్‌లను నిర్వహించే సుదీర్ఘ ప్రక్రియగా మారుతుంది.

విద్యా రంగంలోనూ ఒత్తిడి స్పష్టంగా కనిపిస్తోంది. కామన్ యాప్ డేటా ప్రకారం 2025-26లో అమెరికన్ కాలేజీలకు దరఖాస్తు చేసుకునే భారతీయ విద్యార్థుల సంఖ్య అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే 15% తగ్గింది. నాఫ్సా (NAFSA) యొక్క ఆగస్టు 2026 నివేదిక ప్రకారం.. వీసా ఇబ్బందులు, తగ్గుతున్న దరఖాస్తులు, విధానపరమైన అనిశ్చితి కారణంగా 2026 శరదృతువులో (Fall 2026) అమెరికా కాలేజీలు, విశ్వవిద్యాలయాలలో అంతర్జాతీయ విద్యార్థులు దాదాపు 1,11,000 మంది  తక్కువగా చేరే అవకాశం ఉందని అంచనా వేసింది.

అలాగే కొన్ని సామాజిక అంశాలు కూడా ఉన్నాయి. 2026 కార్నెగీ ఎండోమెంట్ సర్వే ప్రకారం –  ప్రత్యక్ష వివక్షత బాగా తగ్గినప్పటికి ఉన్నప్పటికీ ఆన్‌లైన్‌లో ఇండియన్ అమెరికన్లను లక్ష్యంగా చేసుకుని వేధించడం ఎక్కువగానే ఉంది.

భారత వ్యతిరేక, దక్షిణ ఆసియా వ్యతిరేక పదజాలాలు, బెదిరింపులు ఆన్లైన్ లో పెరిగినట్లు అనేక  డాక్యుమెంట్ చెప్తున్నాయి. AAPI ఈక్విటీ అలయన్స్ ప్రకారం.. ఆగస్టు 2025 నాటి ఒక్క నెలలోనే తీవ్రవాద ఆన్‌లైన్ స్పేస్‌లలో దక్షిణ ఆసియా దేశాల వారిని లక్ష్యంగా చేసుకున్న దాదాపు 57,200 దూషణలను ట్రాక్ చేసింది. 2024 ఎన్నికల తర్వాత నెలల్లో ఈ వేదికలపై దక్షిణ ఆసియా వ్యతిరేక, హింసాత్మక బెదిరింపులు 88% పెరగగా, దూషణలు 75% పెరిగాయి.

అంటే దీనర్ధం ఇండియన్ అమెరికన్లు పూర్తిగా అభద్రతాభావంలో ఉన్నారని కాదు. కానీ ఆయా కుటుంబాలు తమ వర్తమానాన్ని సమీక్షించుకుని భవిష్యత్తు ప్రణాళికలు రూపొందించుకోవడానికి ఒక అవకాశం లభించిందని భావించవచ్చు. వీటికి తోడుగా టెక్ జాబ్ మార్కెట్ కష్టంగా మారడం, అప్పుడప్పుడు జరిగే లేఆఫ్స్, ప్రధాన అమెరికన్ నగరాల్లో అధిక జీవన వ్యయం వంటివి వలసలపై నమ్మకాన్ని తగ్గిస్తున్నాయి.

అవకాశాల అంతరం తగ్గింది

అదే సమయంలో భారతదేశపు అంతర్గత వాతావరణంల మార్పులు వచ్చాయి. ఆవిష్కరణలు, పెట్టుబడులకు  కేంద్రంగా మారింది. 130 కి పైగా యూనికాన్‌లతో అమెరికా, చైనా తర్వాత భారతదేశం ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్‌గా నిలిచింది. కన్స్యూమర్ టెక్, ఫిన్‌టెక్ కాకుండా.. స్కైరూట్ ఏరోస్పేస్ వంటి సంస్థల ద్వారా ఇటీవలి కాలంలో అడ్వాన్స్‌డ్ ఇంజనీరింగ్ రంగాలు, AI ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఎంటర్‌ప్రైజ్ SaaS, డీప్ టెక్, స్పేస్ టెక్ రంగాలలో దేశీయ సాంకేతిక సామర్థ్యాలు వేగంగా విస్తరించాయి.

భౌగోళిక పరిస్థితులు కూడా మారుతున్నాయి. బెంగళూరు ప్రధాన కేంద్రంగా కొనసాగుతున్నప్పటికీ, పూణే, హైదరాబాద్, చెన్నై, అహ్మదాబాద్ అన్నీ 2026లో మంచి నిధులు పొందిన స్టార్టప్‌లకు కేంద్రాలుగా మారాయి. 2025-26లో నమోదైన స్టార్టప్‌లలో దాదాపు 50% టాప్ 6 మెట్రో నగరాల వెలుపల నుంచే వచ్చాయి. అంటే అవకాశాలు ఇకపై కేవలం మెట్రో నగరాలకే పరిమితం కాలేదు.

గత కొన్ని సంవత్సరాలలో స్టార్టప్ పరిశ్రమలో గణనీయమైన మార్పు వచ్చింది. కేవలం వ్యాల్యూయేషన్‌ల వెంట పడటం కంటే, నిజమైన యూనిట్ ఎకనామిక్స్, లాభదాయకతకు నమ్మదగిన కంపెనీలకు ఇన్వెస్టర్లు మొగ్గు చూపుతున్నారు. దీనివల్ల భారతదేశంలోని యువ నిపుణులకు తెరుచుకుంటున్న అవకాశాలు అటుపోట్లకు తట్టకుని నిలబడేలా మారుతున్నాయి.

సంస్థాగత మద్దతు, డిజిటల్ మౌలిక సదుపాయాలు దీనికి మరింత ఊపునిచ్చాయి. స్టార్టప్ ఇండియా వంటి కార్యక్రమాల ద్వారా ఒక దశాబ్ద కాలంగా చేపట్టిన ప్రజా విధానాలు, సులభతరమైన కార్పొరేట్ నిబంధనలు, పన్ను ప్రోత్సాహకాలు , చెల్లింపుల కోసం UPI, వాణిజ్యం కోసం ONDC వంటి ఓపెన్ పబ్లిక్ డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అమలు కారణంగా ఆధునిక సంస్థలకు నిర్వహణ ఖర్చులు బాగా తగ్గాయి. ఫార్చ్యూన్ 500 బహుళజాతి కంపెనీలు ఏర్పాటు చేసిన బలమైన దేశీయ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లతో (GCCలు) కలిసి, యువ నిపుణులు దేశం విడిచి వెళ్లకుండానే ఉన్నత స్థాయి నాయకత్వ పాత్రలు, గ్లోబల్ ప్రాజెక్ట్‌లు, ఈక్విటీ ప్యాకేజీలను పొందుతున్నారు.

గమనించదగిన పోలిక

దీన్ని బేరీజు వేసి చూస్తే, పదేళ్ల క్రితం ఉన్నదాని కంటే నేడు ఈ నిర్ణయం పూర్తిగా భిన్నంగా కనిపిస్తుంది. అమెరికాను ఎంచుకోవడం అంటే.. అధిక ఆదాయ సంపాదన అవకాశాన్ని, దశాబ్దాల తరబడి ఉండే చట్టపరమైన అనిశ్చితి, వీసా ఆధారిత పరిమిత కెరీర్ వృద్ధి, టెక్ హబ్‌లలో అధిక జీవన వ్యయం, జాబ్ మార్కెట్‌లో అకస్మాత్తుగా ఎదురయ్యే షాక్‌ల రిస్క్‌తో బేరీజు వేసుకోవడమే. మరోవైపు, భారతదేశంలో ఉండటం లేదా తిరిగి రావడం అనేది అభివృద్ధి చెందుతున్న రంగాలలో వేగవంతమైన వృద్ధి, పెరుగుతున్న మూలధన లభ్యత, కుటుంబం, స్నేహితులకు చేరువగా ఉండే డైనమిక్ వాతావరణాన్ని అందిస్తుంది.

చదువు, అనుభవం కోసం విదేశాలకు వెళ్లే చాలా మంది చైనీయులు, వలస వెళ్లడాన్ని శాశ్వతమైన, ఒకే మార్గంగా పరిగణించకుండా, ఆ తర్వాత తమ కెరీర్‌ను అక్కడే నిర్మించుకోవడానికి ఉద్దేశపూర్వకంగా స్వదేశానికి తిరిగి వస్తారు. విదేశాలకు వెళ్లు, నేర్చుకో, తిరిగి రా (Go, learn, return) అనే ఆ మోడల్‌ని ఇప్పుడు ఎక్కువ మంది యువ భారతీయులు పరిగణించేలా ప్రోత్సహిస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలలో NRI కుటుంబాలు శాశ్వతంగా భారతదేశానికి తిరిగి వచ్చిన ఉదాహరణలు అనేకం ఉన్నాయి.

వేతనాల అంతరం ఉంది

అయితే ఇదంతా భారతదేశం అమెరికాను “అందుకుంది” అని అర్థం కాదు.  అలా చెపితే మన యువతకు అన్యాయం చేసినట్లే. వేతనాల పరంగా పెద్ద అంతరం ఉంది: భారతదేశంలోని అగ్రశ్రేణి స్టార్టప్‌లలో కూడా జీతాలు అమెరికా టెక్ వేతనాలతో సమానంగా ఉండవు. కేవలం వీసా కష్టతరమైనంత మాత్రాన ఆ అంతరం పూడిపోదు. మౌలిక సదుపాయాలు, పట్టణ జీవన సౌలభ్యం – కాలుష్యం, ప్రయాణ సమయాలు, పౌర సదుపాయాలు – ఇప్పటికీ ఢిల్లీ, ముంబై మొదలైన భారతదేశంలోని మెట్రోపాలిటన్, టైర్-I నగరాలలో రోజువారీ సమస్యలుగానే ఉన్నాయి. వ్యాపార సులభతర వాతావరణం (Ease of doing business) ప్రభావవంతంగా ఉన్నప్పటికీ అది ఒకేతీరుగా లేదు. అది రాష్ట్రం, రంగం, వ్యవస్థాపకుడికి ఉండే పరిచయాల బట్టి మారుతుంది. అలాగే చాలా భారతీయ కంపెనీలలో ఎక్కువ గంటలు పనిచేయడం, కఠినమైన ప్రమోషన్ సిస్టమ్, పని-జీవిత సమతుల్యత (work-life balance) లేకపోవడం వంటి వర్క్‌ప్లేస్ సంస్కృతి.. విదేశాలలో అలవాటు పడిన చాలా మంది రిటర్నీ NRI లు ఆశించే ప్రమాణాలకు ఇంకా చేరుకోలేదు.

ఈ మొత్తం చర్చలో సెలక్షన్ బయాస్‌ను కూడా గమనించాలి: “భారతదేశానికి తిరిగి వెళ్లండి” అని గట్టిగా వాదించే ప్రముఖులు ఇప్పటికే ఆర్థిక భద్రత కలిగిన స్థానం నుండి ఆ నిర్ణయాన్ని పరిశీలిస్తున్న విజయవంతమైన, టెక్-కు సంబంధించిన నిపుణులే అయి ఉంటారు. అమెరికన్ మాస్టర్స్ డిగ్రీ అనేది పరిమిత పరిస్థితుల నుండి బయటపడటానికి ఒక నిజమైన మెట్టుగా భావించే సామాన్య వ్యక్తికి వారి లెక్కలు వర్తించకపోవచ్చు.

ఇందులో ఏదీ భారతదేశం “గెలిచింది” లేదా అమెరికా “ఓడిపోయింది” అనడానికి రుజువు కాదు. ఇది కేవలం భావోద్వేగం కంటే, ఇరువైపులా జరుగుతున్న నిర్మాణ మార్పుల ద్వారా నిజ సమయంలో జరుగుతున్న ఒక తరాల మార్పు (generational recalibration). అమెరికన్ కల మరింత ఖరీదైనదిగా మారుతోంది. దానిని అందుకోవడం అనిశ్చితంగా మారుతోంది. భారతదేశంలో అవకాశాలు దశాబ్దాల కంటే విస్తృతంగా తెరుచుకుంటున్నాయి. ఇప్పుడు నిర్ణయం తీసుకోవలసిన సమయం ఆసన్నం అయింది. ఏ నిర్ణయం అయినా తీసుకోవచ్చు. అక్కడకు వేడితే అందరికీ దూరంగా అత్యధిక ఆదాయంతో నిత్యం టెన్షన్ తో ఉండాలి. ఇక్కడ అయితే టెన్షన్ ఉన్నప్పటకి భావోద్వేగాలు పంచుకోవడానికి మనుషులు ఉంటారు, అంటే తేడా.

News at a Glance

https://www.thehindu.com/news/international/us-trump-plans-to-impose-over-100000-fee-for-h-1b-visas-impact-indians/article71387461.ece

https://www.npr.org/2026/06/09/nx-s1-5851474/federal-judge-fee-h1b-visa

https://edition.cnn.com/2026/08/24/politics/trump-administration-h-1b-visa-fee

https://www.newsweek.com/green-card-update-report-shows-applicants-with-longest-wait-times-12385164

https://inc42.com/features/indian-unicorn-tracker-funding-investors-revenue-and-more/

https://timesofindia.indiatimes.com/blogs/the-india-centre/is-the-american-dream-losing-its-sheen-for-indians/

https://aapiequityalliance.org/silence-will-not-save-us-from-anti-indian-racism/

https://www.ndtv.com/india-news/15-decline-in-indian-students-seeking-undergraduate-courses-in-us-report-11954120

Our reading list

  1. Diaspora, Development and Democracy: The Domestic Impact of International Migration from India by Devesh Kapur. This book explores how Indian diaspora shapes India itself.

 

  •  Article By Remilla Avadhani 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *