ఆంధ్రప్రదేశ్లో చంద్ర పవనం తెలుగు దేశం , జనసేన నేతల భేటీ పొత్తు పొడుపుపై కొత్త ఆశలు
INTRODUCTION
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకు సాగుతున్నాయి. తెలుగు దేశం,జనసేన, బీజేపీల కూటమి ప్రభుత్వమే రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పటికీ ఈ మూడు పార్టీల మధ్య కూడా పొత్తు విషయంలో దోబూచులాట కొనసాగుతోంది. తాజాగా తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌లు మంగళవారం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో భేటీ అయ్యారు.దాదాపు రెండుగంటల పాటు చర్చించుకున్నారు. స్థానిక ఎన్నికల విషయంలో సీట్ల సర్దుబాటుకు సంబంధించే వారు చర్చించుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మరో వైపు ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన పావులను బలంగా కదుపుతోంది. అటు బీసీ రిజర్వేన్లు, ఇటు సర్ ఎన్నికల ప్రక్రియపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ లబ్ధిపొందేందుకు ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీలో రాజకీయ పరిస్థితిపై విశ్లేషణ.
ANALYTICAL VIEW
దూరం పెరిగిందా?
తాజాగా చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు భేటీ అయినప్పటికీ గత కొద్ది రోజులుగా ఇద్దరి మధ్య దూరం పెరిగిందా అని సందేహం వచ్చేలా అనేక పరిణామాలు జరిగాయి. అంతకు ముందు లాగా ఇద్దరూ సన్నిహితంగా కనిపించకపోవడం, ఆగస్టు 15 , లోక్‌భవన్‌లో ఎట్‌హోం లాంటి ముఖ్యమైన కార్యక్రమాలకు పవన్ కల్యాణ్ హాజరుకాకపోవడం చర్చనీయాంశమైంది. చంద్రబాబునాయుడు ఉన్నసమయంలో పవన్ అసెంబ్లీ సమావేశాలకు రాకపోవడం, ఆయన కోయంబత్తూరుకు దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన కార్యక్రమం నిమిత్తం వెళ్లినప్పడు అసంబ్లీకి రావడం , వచ్చినా సమావేశాలకు వెళ్లకుండా పార్టీ కార్యాలయంలో నేతలతో కలిసివెళ్లడం , క్యాబినెట్ సమావేశంలో కూడా పాల్గొనక పోవడంతో పలు సందేహాలు తలెత్తాయి. ఈ అన్నింటికీ అనారోగ్యమే కారణంగా చెప్పినప్పటికీ అంతర్గతంగా ఏదో అసంతృప్తి ఉండి ఉంటుందని అనేకమంది భావించారు.
అనుమానాలకు ఊతమిచ్చిన ప్రకటనలు
ఆంధ్రప్రదేశ్‌లో తమ పొత్తు పదిలంగా ఉందని, అసెంబ్లీ , లోక్ సభ ఎన్నికల సమయంలో ఉన్నట్లే అదే శాతం ప్రకారం పోటీ చేస్తామని నారా లోకేశ్ అంతకు ముందు ఒక సభలో ప్రకటించారు. దీనిపై జనసేన శ్రేణుల్లో అసంతృప్తి వ్యక్తమైంది. ఈ నేపథ్యంలోనే పార్టీ ముఖ్య నేత నాదెండ్ల మనోహర్ తమ పార్టీ బలంగా ఉన్న చోట్ల పోటీ చేస్తామని ప్రకటించారు. అనంతరం కొద్ది రోజులకే పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ కాకినాడలో పార్టీ రాష్ట్ర నాయకులతో సమావేశమయ్యారు. గతంలో రాష్ట్ర భవిష్యత్ కోసం, ప్రజల కోసం అనేక చోట్ల త్యాగాలు చేశామని, ఇప్పుడు పార్టీ కోసం ఎక్కడ బలముంటే అక్కడ పోటీకి సిద్ధమని ప్రకటించారు. పోటీకి సిద్ధం కావాలని కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. ఈ ప్రకటన కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.
సమన్వయానికి యత్నాలు
పొత్తు విషయంలో బయటికి కొన్నిసందేహాలు వ్యక్తమైనా…మూడుపార్టీల మధ్య సమన్వయం కోసం ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ మూడు పార్టీల నుంచి ముఖ్యనేతలతో ఒక ప్రధానకమిటీ ఏర్పాటైంది. టీడీపీ నుంచి నిమ్మల రామానాయుడు, శ్రీనివాసరావు, జనసేన నుంచి నాదెండ్ల మనోహర్, శంకర్, బీజేపీ నుంచి రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ లు ఇందులో సభ్యులుగా ఉన్నారు. వీరు రాష్ట్ర స్థాయిలో ఎవరికి ఎక్కడ బలముంది? ఎక్కడ ఎవరు పోటీచేయాలనే విషయంపై దృష్టి పెట్టారు. అలాగే లోక్ సభ నియోజకవర్గాల వారీగాకూడా ఒక్కో పార్టీ నుంచి ముగ్గురు చొప్పున సభ్యులుగా కమిటీలు ఏర్పాటు చేశారు. ఈ నియోజకవర్గాల పరిధిలోని ఎమ్మెల్యేలు కూడా స్థానిక ఎన్నికల నేపథ్యంలో పార్టీల పరంగా చర్చలు ప్రారంభించారు.
వ్యూహాత్మకమేనా?
మంత్రి లోకేశ్ ప్రకటన..నాదెండ్ల మనోహర్ స్పందనలతో పొత్తు విషయంలో అనుమానాలు తలెత్తడం, చంద్రబాబు-పవన్‌ల మధ్య దూరం పెరిగినట్లు అనిపించే పరిణామాలు జరగడంతో రాష్ట్రంలో రాజకీయంగా ఒకింత ఉత్కంఠ పెరిగింది. ఈ నేపథ్యంలోనే మంగళవారం చంద్రబాబు-పవన్‌కల్యాణ్‌లు భేటీ కావడం, రెండు గంటలకు పైగా చర్చించుకోవడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కూటమి పార్టీల మధ్య సీట్ల పంపకం, మేయర్–చైర్మన్ పదవులు, ఎన్నికల వ్యూహంపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. జనసేన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాల్లో కార్పొరేటర్ స్థానాల్లో సుమారు 50 శాతం, అలాగే మేయర్ లేదా చైర్మన్ పదవులు తమకు ఇవ్వాలని జనసేన వర్గాలు ఆశిస్తున్నట్లు ఊహాగానాలు బయటికి వచ్చాయి. అయితే వారు మాట్లాడుకున్న అంశాలపై పూర్తిగా స్పష్టత రాకున్నప్పటికీ పొత్తు పదిలమే అనే సందేశాన్ని ఈ భేటీ ఇచ్చిందనే భావిస్తున్నారు. పవన్ అనారోగ్య కారణాల వల్లే బాబుతో దూరంగా ఉన్నారా? లేక స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఒత్తిడి పెంచేందుకే వ్యూహాత్మకంగా అలా వ్యవహరించారా? అనే సందేహాలు అయితే అలాగే ఉన్నాయి. కాకినాడలో ఆయన మాట్లాడిన తీరు మాత్రం కార్యకర్తలకు కొత్త ఉత్సాహాన్నిఇచ్చిందని చెప్పొచ్చు. పవన్ భేటీ అనంతరం చంద్రబాబు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి నిమ్మల రామానాయుడు తదితరులతోనూ సమావేశమై సమన్వయ సమావేశాల పురోగతిని సమీక్షించారు.
బీజేపీ పాత్ర ఏమిటి?
ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ హాజరు కాలేదు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విశాఖపట్నం పర్యటన నేపథ్యంలో ఆయన పాల్గొనలేకపోయినట్లు తెలుస్తోంది. అయితే ఆయన అంతకు ముందే చంద్రబాబుతో భేటి అయినట్ల తెలిసింది. బీజేపీ కూడా స్థానికంగా తన పార్టీ బలాన్ని పెంచుకునేందుకు, తమ ఎమ్మెల్యేలు లేని ప్రాంతాల్లోనూ పోటీ అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలిసింది. అందువల్ల టీడీపీ–జనసేన మధ్య సీట్ల సర్దుబాటు మాత్రమే కాకుండా, మూడో భాగస్వామి బీజేపీకి కేటాయింపులు కూడా తుది నిర్ణయంలో కీలకమవుతాయి.
వైఎస్సార్ సీపీ మెలికలు
కాగా రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అన్నిచోట్లా పోటీకి సిద్ధమవుతోంది. అందుకు పూర్తిస్థాయి సన్నాహాలు ప్రారంభించింది. అన్ని చోట్లా పోటీ చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చింది. అందుకు నియోజకవర్గ ఇన్‌ఛార్జీలదే ప్రధాన బాధ్యత అని స్పష్టం చేసింది. మరోవైపు ఈ ఎన్నికల నిర్వహణ విషయంలో కొన్ని మెలికలు పెడుతోంది. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకున్ననిర్ణయాన్ని హైకోర్టులో సవాల్ చేయడానికి అండగా నిలబడింది. అలాగే కొత్త ఓటర్ల నమోదుప్రక్రియ (సర్) విషయంలో అభ్యంతరాలు ఉన్నందున పాత ఓటర్ల జాబితా ప్రకారమే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తోంది. 2026 నాటి ఓటర్ల జాబితాను ప్రాతిపదికగా తీసుకోరాదని కోరుతోంది. ఓటర్ల సవరణ ప్రక్రియ ఇంకా కొనసాగుతున్నందున తుది జాబితా తయారయ్యేకే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తోంది. రాష్ట్రంలో వార్డుల పునర్విభజన (డీలిమిటేషన్)పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును కూడా సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో స్పెషల్‌లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసు శుక్రవారం విచారణకు రానుంది.
బీసీ రిజర్వేషన్ల అంశం ఎందుకు కీలకం?
స్థానిక ఎన్నికల సీట్ల పంపకంలో రిజర్వేషన్లు కీలకమైన అంశంగా మారాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన ఉత్తర్వులను హైకోర్టు అక్టోబర్ 2న కొట్టివేసింది. దీనిని తెలుగుదేశం పార్టీ సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి తాము కట్టుబడి ఉన్నామని, చిత్తశుద్ధితో జీవోలు వెలువరించామని ఆ పార్టీ వాదిస్తోంది. ఒక వేళ సుప్రీం కోర్టులో అనుకూలంగా తీర్పు రాకపోయినా…స్థానిక ఎన్నికల్లో తమ పార్టీ 34 శాతం మంది బీసీలకు సీట్లు ఇస్తామని చెప్తున్నారు. తమ వాదనను గట్టిగా వినిపించే ఉద్దేశంతో అనేకమంది నాయకులు ఢిల్లీకి కూడా చేరుకున్నారు.
రానున్న ఎన్నికల రాజకీయ ప్రాధాన్యం
గత ఎన్నికల గణాంకాలు వైఎస్సార్ కాంగ్రెస్‌కు గ్రామీణ స్థానిక సంస్థల్లో విస్తృత ఆధిక్యం ఉన్నట్లు చూపుతున్నాయి. అయితే ఆ ఎన్నికలు 2021లో జరిగాయి. టీడీపీ బహిష్కరణ కూడా ఫలితాలపై ప్రభావం చూపింది. 2024 అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో అధికార కూటమి మారింది. అందువల్ల రాబోయే స్థానిక ఎన్నికలు నాలుగు పార్టీల ప్రస్తుత క్షేత్రస్థాయి బలాన్ని పరీక్షించే పోరుగా మారనున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత గ్రామ పంచాయతీలు, మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఏ పార్టీకి ఎంత బలం ఉందో తేల్చుకునే అవకాశం.
డిసెంబరులోగా ఎన్నికల ప్రక్రియ పూర్తికి ప్రణాళిక
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక ఎన్నికలను రెండు దశల్లో నిర్వహించి, 2026 డిసెంబరులోగా ప్రక్రియను పూర్తి చేసే లక్ష్యంతో ప్రణాళిక రూపొందిస్తోంది. తాజా సమాచారాన్ని బట్టి పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థల వివరాలు ఇలా ఉన్నాయి.
IN NUMBERS
పట్టణ స్థానిక సంస్థలు
సంస్థ రకం సంఖ్య
మున్సిపల్ కార్పొరేషన్లు 17
మున్సిపాలిటీలు 88
నగర పంచాయతీలు 18
మొత్తం పట్టణ స్థానిక సంస్థలు 123
గ్రామీణ స్థానిక సంస్థలు
సంస్థ రకం సంఖ్య
జిల్లా పరిషత్‌లు (ZPPలు) 28 — పునర్వ్యవస్థీకరణ ప్రకారం
మండల ప్రజా పరిషత్‌లు (MPPలు) సుమారు 660
జడ్పీటీసీ నియోజకవర్గాలు గత ఎన్నికల్లో 660
ఎంపీటీసీ నియోజకవర్గాలు గత ఎన్నికల్లో 10,047
గ్రామ పంచాయతీలు 13,327
NEWS AT A GLANCE
By RAVIKANTI SRINIVAS
