అమెరికాలో వినాయక వైభవం
ఏ దేశమేగినా ఎందు కాలిడినా…పొగడరా నీ తల్లి భూమి భారతిని అన్నట్లు మనవారు పుట్టిన ఊరికి, మాతృదేశానికి ఎంత దూరంలో ఉన్నా మన ధర్మాన్ని ఆచరిస్తూ , హిందూ సంస్కృతీ సంప్రదాయాలను కొనసాగిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
ఇటీవలే అమెరికాకు వచ్చిన మేము వినాయక ఉత్సవాల సందర్భంగా గమనించిన కొన్ని అంశాలు ప్రేరణాత్మకంగా ఉన్నాయి. ఆ విశేషాలు మీకోసం…
మట్టి విగ్రహాల తయారీకి వర్క్‌షాప్

మట్టి విగ్రహాలనే పూజించాలని…పర్యావరణ హితంగా విగ్రహాలు తయారు చేయాలన్న చైతన్యం ఇటీవల భారత్‌లో బాగా పెరిగింది. ప్లాస్టర్ ఆఫ్ పారిస్, కృత్రిమ రంగులను ఉపయోగించే విగ్రహాల వినియోగం క్రమంగా తగ్గుతోంది. అయితే ఇప్పటికీ విగ్రహాలను తయారుచేసుకోవడం కన్నా చిన్నవో పెద్దవో కొనుక్కొని రావడమే ఎక్కువమందికి అలవాటుగా ఉంది. అయితే అమెరికాలో అందుకు భిన్నమైన వాతావరణం కనిపించింది. కాన్సస్‌లోని హిందూ దేవాలయ కమిటీ వారు మట్టి విగ్రహాల తయారీపై ఏకంగా వర్క్ షాప్ నిర్వహించారు. దాదాపు 250 మంది చిన్నారులు ఇందులో పాల్గొని స్వయంగా మట్టితో విగ్రహాలు తయారు చేశారు. తల్లిదండ్రులు, ఇతరులు కలసి దాదాపు మంది ఈ వర్క్‌షాపులో పాల్గొన్నారు. పిల్లల్లో ధార్మిక భావన , పండుగల పట్ల అవగాహన పెరగడమే కాకుండా వ్యక్తిగత నైపుణ్యాలు కూడా ఈ వర్క్‌షాపుతో మెరుగుపడే అవకాశముందని పలువురు పేర్కొన్నారు. పర్యావరణాన్ని కాపాడాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్నినిర్వహించినట్లు దేవాలయ కమిటీ వారు తెలిపారు. ఆరేళ్ల నుంచి ఇలా మట్టి గణపతుల తయారీపై వర్క్ షాపులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
పద్దెనిమిదేళ్లుగా…పరిపరి రూపాల్లో..!
హైదరాబాద్ కు చెందిన తలగడదీవి శ్రీనివాస్ అమెరికాలో ఉంటూ గత పద్దెనిమిదేళ్లుగా పర్యావరణ హితంగా వినాయక విగ్రహాన్ని స్వయంగా తయారు చేసి తమ ఇంట ప్రతిష్ఠిస్తున్నారు. ఇంట్లో విగ్రహం అంటే ఏదో చిన్నగా కాదు. సాధారణంగా వినాయక మంటపాల్లో ప్రతిష్ఠించేంత పరిమాణంలో రూపు దిద్దుతున్నారు. పది నుంచి పన్నెండు అడుగుల ఎత్తులో ..అత్యంత సుందరంగా తయారు చేస్తున్నారు. ఉన్నత చదువులు చదివి…మంచి స్థాయిలో ఉండి…ఎంతో పని ఒత్తడి మధ్య కూడా ఇందుకోసం చాలా సమయం వెచ్చిస్తున్నారు. నెల నుంచి మూడు నెలల పాటు శ్రమించి సిద్ధం చేస్తున్నారు. తన సృజనాత్మక నైపుణ్యానికి తోడు భక్తి భావాన్ని రంగరించి ఎంతో శ్రద్ధతో వినాయకుడిని తయారు చేస్తున్నారు. వినాయక విగ్రహాలను శ్రీనివాస్ పర్యావరణ హితంగా రూపొందించడం విశేషం. ఒక సంవత్సరం కాగితాలతో..మరోసారి అట్టలతో… ఇంకోసారి మట్టితో, గడ్డితో, దూదితో, కూరగాయలతో …ఇలా రకరకాలైన పదార్థాలతో గణపతి విగ్రహాలను రూపొందిస్తున్నారు. ఇలా పద్దెనిమిది సంవత్సరాలుగా నిరాటంకంగా చేస్తున్నారు. ఈ సంవత్సరం పసుపుతో వినాయకుడిని తయారుచేసి ప్రతిష్ఠించారు. అంతే కాకుండా అత్యంత ఆకర్షణీయంగా అలంకరిస్తున్నారు. భార్య, పిల్లలు కూడా ఆయనకు సంపూర్ణంగా సహకరిస్తున్నారు.
స్థానికులకు ఆహ్వానం

ఈ విగ్రహాన్ని అందరూ దర్శించుకుని, కాసేపు గడిపే విషయంలో కూడా శ్రీనివాస్ ఒక వినూత్న విధానం అవలంబిస్తున్నారు. ఆయన స్థానికులను తమ ఇంటికి ఆహ్వానిస్తున్నారు. రావలసిన వారి జాబితా తయారు చేసి …ఎవరు ఏరోజు ఏసమయానికి రావాలో సూచిస్తున్నారు. ప్రతి ఒక్కరూ కనీసం ఓ గంటపాటైనా వినాయకుడి సన్నిధిలో గడపాలన్నది ఆయన యోచన. ఇలా ప్రణాళికా బద్ధంగా చేస్తుండటంతో అందరూ ప్రశాంతంగా దర్శనం చేసుకోగలుగుతున్నారు.
బంధాలను బలోపేతం చేసేందుకే..
పండగలు మన సంస్కృతిలో ముఖ్యమైనవని, ఇవి ప్రజల మధ్య బంధాలను పెంపొందిస్తాయని శ్రీనివాస్ అన్నారు.”నలుగురం దగ్గరికొచ్చి మాట్లాడుకోవడం, ఒకరినొకరు మద్దతుగా ఉండటమే పండగ ఆంతర్యం. సంతోషంగా గడపడమే పర్వదినాల లక్ష్యం. అంతాకలసి పండుగలను ఆనందంగా చేసుకోవాలి. మన సంస్కృతి గురించి తర్వాతి తరానికి తెలియజేయాలి. పండగల్లో ఉన్న ఆనందాన్ని వారికి తెలియజెప్పాలి. ఆ ఉద్దేశంతోనే ఇలా వినాయక ఉత్సవాలను నిర్వహిన్నాం. అన్ని పండుగలను పర్యావరణహితంగా చేసుకోవాలి” అని ఆయన సూచించారు.
ఇదీ శ్రీనివాస్ నేపథ్యం
శ్రీనివాస్ హైదరాబాద్‌కు చెందిన పాత తరం బీజేపీ నాయకుడు టీ ఎస్ రామారావు, మీనాక్షిల కుమారుడు. ఉస్మానియా యూనివర్సిటీలో ఎంబీఏ (ఫైనాన్స్) చదివి అమెరికాలో స్థిరపడ్డారు. ఇరవై ఏడేళ్లుగా క్యాన్సస్ సిటీ సమీపంలోని ఓవర్ ల్యాండ్ పార్క్‌లో నివాసం ఉంటున్నారు. ప్రస్తుతం పిట్స్బర్గ్ కేంద్రంగా పనిచేస్తున్న ఇంజినీరింగ్ కంపెనీ మైకేల్ బేకర్ ఇంటర్నేషనల్ లో వైస్ ప్రెసిడెంట్ ( బిజినెస్ అప్లికేషన్స్) గా ఉన్నతోద్యోగంలో ఉన్నారు. శ్రీనివాస్ కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లో ఉంటూ శ్రీనివాస్‌కు సహకరిస్తున్నారు. వినాయక విగ్రహానికి అవసరమైన సామగ్రిని కూడా భారత్ నుంచి వారే పంపిస్తుంటారు. అమ్మా…నాన్నల స్ఫూర్తి, కుటుంబ సభ్యుల సహకారంతోనే పద్దెనిమిదేళ్లుగా పర్యావరణ హితంగా వినాయక విగ్రహాలను రూపొందించి పూజలు చేస్తున్నట్లు చెప్పారు.
బహిరంగంగా వినాయక మంటపం

అది ఓవర్ ల్యాండ్ పార్క్‌లోని వ్యాపార సముదాయ ప్రాంతం.అక్కడికి వెళ్లగానే ఒక్కసారిగా భారత్‌కు వెళ్లిన అనుభూతి కలిగింది. కారణం ఒకవైపు రిలయన్స్ మార్ట్. దానికి ఎదురుగా బహిరంగ మంటపంలో వినాయకుడు. అచ్చం మన దగ్గరి లాగే. సంబంధిత అధికారుల నుంచి అన్నిఅనుమతులు తీసుకుని ఈ మంటపాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకుల్లో ఒకరైన జిగర్ బారట్ తెలిపారు.ఎక్కడ ఉంటున్నా మన మూలాలను మరవొద్దని, సంస్కృతిని పిల్లలకు అందించడం ముఖ్యమని అన్నారు. అలాగే భారతీయులను, హిందువులందరి మధ్య ఒక బంధం ఏర్పడాలన్న ఉద్దేశంతో ఈ మంటపం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. భారత్‌లోని వివిధ రాష్ట్రాలకు చెందిన దాదాపు మూడు వందల భక్తులు రోజూ మంటపాన్ని సందర్శించి పూజలు చేస్తున్నట్లు చెప్పారు. మూడు రోజులపాటు మంటపాన్ని ఉంచి తర్వాత నిమజ్జనం చేస్తామని చేశారు. మూడేళ్లుగా ఇలా వినాయక ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇవన్నీ అమెరికా లోని కాన్సస్ సిటీ, ఓవర్లాండ్ పార్క్ పరిధిలో గమనించిన అంశాలే. దేశ వ్యాప్తంగా పరిశీలిస్తే ఇలాంటి ఎన్నో విశేషాలు కనిపిస్తాయి.
- కాన్సస్ సిటీ ఓవర్ ల్యాండ్ పార్క్ నుంచి రావికంటి శ్రీనివాస్
